
సాక్షి, సినిమా: ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమని ఊపేస్తున్న సమస్య క్యాస్టింగ్ కౌచ్. ఈ అంశాన్ని నటి శ్రీరెడ్డి తెరపైకి తీసుకొచ్చి పలువురిపై ఆరోపణలు చేస్తూ టాలీవుడ్‌లో సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. దీనిపై ఇప్పటికే ఇండస్ట్రీలో చాలా మంది చాలా రకాలుగా స్పందించారు. అయితే తాజాగా ‘అర్జున్ రెడ్డి’, ‘పెళ్లి చూపులు’ సినిమా పాటల రచయిత శ్రేష్ఠ క్యాస్టింగ్ కౌచ్‌పై షాకింగ్ నిజాలు బయటపెట్టారు.
శ్రేష్ఠ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాను ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో చాలా లైంగిక వేధింపులు ఎదుర్కున్నానని తెలిపింది. ఏకంగా ఓ నిర్మాత భార్యే తన భర్త వద్దకు ఆమెను పంపే ప్రయత్నం చేశారని తెలిపింది. అదేవిధంగా ఓ మహిళా దర్శకురాలు ఓ వ్యక్తి నిన్ను ఇష్టపడ్డాడని నీకు ప్రపోజ్ చేయడానికి గోవాలో పార్టీ ఏర్పాటుచేశాడని తనతో చెప్పిందని తెలిపారు. కానీ నేను ఆమె మాటలు ఏ మాత్రం లెక్కచేయకపోవడంతో.. ఆ వ్యక్తి శ్రేష్ఠకు ఫోన్ చేసి దారుణంగా తిట్టాడని పేర్కొన్నారు. దీని వల్ల ఇండస్ట్రీలో మగవారు మాత్రమే కాదు ఆడవాళ్లు కూడా వేధింపులకు గురిచేస్తారని తెలిసిందన్నారు. తనకు ఎదురైన ఇలాంటి కొన్ని సంఘటనల వలనే కొంతకాలం ఇండస్ట్రీకి దూరంగా ఉండాల్సి వచ్చిందన్నారు.
శ్రేష్ఠ ఇప్పటివరకు ‘అర్జున్ రెడ్డి’, ‘పెళ్లి చూపులు’, ‘మధురం మధురం’, ‘యుద్ధం శరణం’ సినిమాలకు గేయ రచయిత్రిగా పనిచేశారు.