పెళ్లి కావాల్సిన అమ్మాయిని కదా.. అందుకే.. | Arti Singh Says Her Brother Upset Over Talking About Molestation Attempt Bigg Boss 13 | Sakshi
Sakshi News home page

దాని గురించి మాట్లాడటం అన్నయ్యకు నచ్చలేదు!

Published Wed, Feb 19 2020 9:29 AM | Last Updated on Wed, Feb 19 2020 10:02 AM

Arti Singh Says Her Brother Upset Over Talking About Molestation Attempt Bigg Boss 13 - Sakshi

సోదరుడు కృష్ణతో ఆర్తీ సింగ్‌(ఫైల్‌ ఫొటో)

ముంబై: తనకు ఎదురైన చేదు అనుభవాలను బహిర్గతం చేయడం వల్ల తన తల్లి, సోదరుడు ఆవేదనకు గురయ్యారని బిగ్‌బాస్‌ భామ, టీవీ నటి ఆర్తీ సింగ్‌ అన్నారు. బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ వ్యాఖ్యాతగా వ్యవహరించిన బిగ్‌బాస్‌-13లో పాల్గొన్న ఆర్తీ  సింగ్‌.. బిగ్‌బాస్‌ హౌజ్‌లో 140 రోజుల పాటు కొనసాగారు. తోటి కంటెస్టెంట్లకు గట్టి పోటీ ఇస్తూ తనదైన శైలిలో దూసుకుపోయారు. ఈ క్రమంలో.. ‘ఛపాక్‌’ మూవీ ప్రమోషన్‌లో భాగంగా హీరోయిన్‌ దీపికా పదుకునె హౌజ్‌లో అడుగుపెట్టినపుడు.. ఆర్తీ సింగ్‌ తన వ్యక్తిగత విషయాలను ఆమెతో పంచుకున్నారు. పదమూడేళ్ల వయసులో తనపై అత్యాచారయత్నం జరిగిందని.. తమ ఇంట్లో పనిచేసే వ్యక్తి.. ఈ దుశ్చర్యకు ఒడిగట్టాడని ఆర్తీ పేర్కొన్నారు. ఈ క్రమంలో మీడియాతో మాట్లాడిన ఆర్తీ సోదరుడు కృష్ణ... ఆర్తీకి అటువంటి అనుభవాలు ఎదురుకాలేదని... తనేదో ఊరికే అలా మాట్లాడి ఉంటుందని అభిప్రాయపడ్డాడు. దీంతో సోషల్‌ మీడియా వేదికగా ఈ అన్నాచెల్లెళ్లపై విమర్శలు వెల్లువెత్తాయి.(నాపై అత్యాచారయత్నం జరిగింది)

ఇక ప్రస్తుతం షో ముగిసిన నేపథ్యంలో... ఇంటికి చేరుకున్న ఆర్తీ.. తన సోదరుడి వ్యాఖ్యలపై స్పందించారు. ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. తనకు ఎదురైన భయానక అనుభవం గురించి షోలో చెప్పడం తన సోదరుడిని బాధపెట్టిందని పేర్కొన్నారు. ‘‘కృష్ణ.. నా సోదరుడు. నాపై అత్యాచారయత్నం జరిగిందని చెప్పడం తనకు, మా అమ్మకు అసలు నచ్చలేదు. పెళ్లి కావాల్సిన అమ్మాయిని కదా.. ఇలాంటి విషయాలు బయటకు చెప్పడం ఎందుకని వారి ఉద్దేశం. ప్రస్తుతం నేను బాగానే ఉన్నాను.. కాబట్టి అలాంటి మాటలు మాట్లాడాల్సిన అవసరం ఏముందని.. మా అమ్మ నన్ను అడిగింది. ‘ఎంతో మంది చిన్నారులు.. నాలాగే ఇలాంటి అఘాయిత్యాల బారిన పడి ఉంటారు.. అలాంటి వాళ్లు నా మాటలు విని పెద్దవాళ్లకు చెప్పే ధైర్యం చేస్తారు. దాంతో వారిపై అమానుష చర్యలు ఆగిపోతాయి. అందుకే నేనలా మాట్లాడాన’ని తనకు చెప్పాను. తను కూడా అర్థం చేసుకుంది. ఇక ప్రతీ అన్నా.. తన చెల్లి గురించి ఇలాగే స్పందిస్తాడు.. ఇది సహజం.. కాబట్టి కృష్ణను విమర్శించడం తగదు’’అని చెప్పుకొచ్చారు. కాగా బాలికా వధు ఫేం సిద్దార్థ్‌ శుక్లా హిందీ బిగ్‌బాస్‌-13 విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే.   (బిగ్‌బాస్‌ విన్నర్‌: ఊహించిందే నిజమైన వేళ..)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement