
మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందిస్తామని చాలా కాలం క్రితమే సుబ్బిరామిరెడ్డి ప్రకటించారు. అయితే పలు సందర్భాల్లో ఈ సినిమా ప్రస్తావన వచ్చిన అధికారికం ఎప్పుడు మొదలవుతుంది. ఎవరు దర్శకత్వం వహిస్తారు లాంటి అంశాలను వెల్లడించలేదు. తాజాగా మరోసారి ఈ మెగా మల్టీస్టారర్ కు సంబంధించిన ఆసక్తికరమైన వార్త ఒకటి ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతోంది.
ప్రస్తుతం పవన్, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈసినిమా తరువాత చేయబోయే సినిమాలేవి అధికారికంగా ప్రకటించలేదు. చిరంజీవి సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సైరా సినిమాలో నటించేందుకు రెడీ అవుతున్నారు. సైరా పూర్తయిన తరువాత బోయపాటి శ్రీను, త్రివిక్రమ్ లాంటి దర్శకులకు.. చిరు ఓకె చెప్పినా ఏ సినిమా ముందు మొదలవుతుందన్న విషయంపై మాత్రం క్లారిటీ లేదు. తాజా సమాచారం ప్రకారం చిరు సైరా తరువాత త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారట.
అంతేకాదు ఈ సినిమాలో చిరుతో పవన్ కూడా నటించే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. పూర్తి స్థాయి మల్టీ స్టారర్ కాకపోయినా దాదాపు అరగంట పాటు తెరపై కనిపించే పాత్రలో పవన్ నటించే అవకావం ఉందన్న ప్రచారం జరుగుతోంది. గతంలో చిరు హీరోగా రూపొందిన శంకర్ దాదా జిందాబాద్ సినిమాలో పవన్ అతిథి పాత్రలో నటించారు. ఇప్పుడు మరోసారి ఈ కాంబినేషన్ తెర మీద కనిపించనుందన్న వార్తలతో అభిమానులు ఖుషీ అవుతున్నారు.