
అంతా నటీనటుల ఇష్టమేనా? కథ నచ్చిందనో... పారితోషకం నచ్చిందనో... మరొకటో... ఏవేవో కారణాల వల్ల సినిమా ఒప్పుకుని, తర్వాత ‘తూచ్! నేనీ సినిమా చేయడం లేదు’ అనడం నటీనటుల ఇష్టమేనా?!! కొన్ని రోజులు షూటింగ్ చేసిన తర్వాత సినిమా నుంచి తప్పుకుంటే నిర్మాతల పరిస్థితేంటి? తమిళ చలనచిత్ర నిర్మాతల మండలి ఇప్పుడీ ప్రశ్నలే వేస్తోంది. అటువంటి నటీనటులపై తప్పకుండా చర్యలు ఉంటాయని చెబుతోంది. చెప్పడమే కాదు... చేతల్లో చూపిస్తోంది! త్రిష, వడివేలు, శింబుల నుంచి వివరణ కోరుతూ నోటీసులు ఇచ్చింది. ఇంతకీ, ఈ ముగ్గురూ ఏం చేశారంటే....
మీతో సెట్ కాదులే సామి!
విక్రమ్ హీరోగా హరి దర్శకత్వంలో 14 ఏళ్ల క్రితం వచ్చిన ‘సామి’లో త్రిష హీరోయిన్. ఇప్పుడు ఆ సిన్మాకి సీక్వెల్‌గా దర్శకుడు హరి ‘సామి స్క్వేర్’ తీస్తు న్నారు. విక్రమ్ హీరో. త్రిష, కీర్తీ సురేశ్‌లను హీరోయిన్లుగా తీసుకున్నారు. అయితే... కొన్ని రోజులు షూటింగ్ చేశాక ‘‘క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల ‘సామి–2’ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నా. వాళ్లకు అంతా మంచే జరగాలని కోరుకుంటున్నా’’ అని త్రిష సినిమాకి ‘గుడ్‌బై’ చెప్పేశారు. దాంతో చిత్రనిర్మాణ సంస్థ తమీన్స్ ఫిలిమ్స్ నిర్మాతల మండలికి కంప్లయింట్ చేసింది. త్రిష తప్పుకోవడంతో మాకెంతో నష్టం ఏర్పడిందని కంప్లయింట్‌లో పేర్కొన్నారు.
పులికేసి... ప్రాబ్లమ్ ఏంటి?
హాస్యనటుడు వడివేలు హీరోగా చింబుదేవన్ దర్శకత్వంలో దర్శకుడు శంకర్ ‘ఇమ్‌సై అరసన్ 23వ పులికేసి’ నిర్మించారు. తమిళంలో మంచి హిట్! తెలుగులో ‘హింసించే 23వ రాజు–పులికేసి’ పేరుతో విడుదల చేస్తే.. ఇక్కడా బాగానే ఆడింది. దానికి సీక్వెల్‌గా సేమ్ టీమ్ ‘ఇమ్‌సై అరసన్ 24వ పులికేసి’ స్టార్ట్ చేశారు. కొన్ని రోజులు షూటింగ్ చేశారు. త్రిషలా వడివేలుకి కూడా టీమ్‌తో ఏవో క్రియేటివ్ ప్రాబ్లమ్స్ రావడంతో షూట్‌కి రావడం మానేశారు. అప్పుడు చేద్దాం... ఇప్పుడు చేద్దామంటూ డేట్స్ ఇవ్వకుండా అలస్యం చేస్తున్నారట! మరోపక్క ఐదు కోట్ల రూపాయలతో సెట్ వేసిన యూనిట్ ఆయన కోసం వెయిట్ చేస్తోంది. చివరకు, చిరాకు వచ్చి నిర్మాతల మండలికి శంకర్ కంప్లయింట్ చేశారు.
శింబు వల్ల 18 కోట్లు హాంఫట్!?
త్రిష, వడివేలు ఇష్యూలతో కంపేర్ చేస్తే శింబుది డిఫరెంట్! ఈ యంగ్ హీరో ట్రిపుల్ రోల్ చేసిన సినిమా ‘అన్బానవన్ అసురాదవన్ అడంగాదవన్’. మొన్న జూన్‌లో విడుదలైన ఈ సిన్మా ఫ్లాప్. అయితే విడుదలకు ముందు సినిమాను రెండు పార్టులుగా తీయనున్నట్టు వార్తలొచ్చాయి. అసలు మేటర్ ఏంటంటే... నిర్మాత సింగిల్ పార్టుగానే తీయాలనుకున్నారట! శింబు రెండు పార్టులు తీయాలని వాదించాడట! నిర్మాత కాదనే సరికి ఇప్పటివరకు నేను నటించిన సన్నివేశాలతోనే సినిమా విడుదల చేసుకోమని వదిలేశాడట! కట్ చేస్తే... శింబు షూటింగ్ చేసింది 29 రోజులే.
దర్శకుడు ఏవో సర్దుబాట్లు చేసి సినిమా రెడీ చేశారు. ఫ్లాప్ కావడంతో నిర్మాతకు 18 కోట్లు నష్టం వచ్చిందట! శింబు ప్రవర్తన వల్లనే 18 కోట్లు హాంఫట్ అయ్యాయని చిత్రనిర్మాత మైఖేల్ రాయప్పన్ తమిళ చలనచిత్ర నిర్మాతల మండలికి కంప్లయింట్ చేశారు. దాంతో నిర్మాతల మండలి ముగ్గురికీ నోటీసులు పంపించింది. వీళ్ల వివరణతో సంతృపి చెందకపోతే... ఒక్కొక్కరిపై రెండేళ్లు బ్యాన్ విధించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఏం జరుగుతుందో? వెయిట్ అండ్ సీ!!
Comments
Please login to add a commentAdd a comment