నిన్నెట్టే ఫిలోమోనో ప్రభూ, సమంత తల్లి
‘కొడుకు ఒక్కడుంటే చాలు’ అనుకొనే పాతకాలం నాటి నమ్మకాలకు కాలం చెల్లిపోయింది. తల్లిదండ్రుల నమ్మకాల్లో, ఆలోచనల్లో, అనుబంధాల్లో సమతాభావనలు వెల్లివిరుస్తున్నాయి. ‘కొడుకైనా, కూతురైనా ఒక్కటే’ననే’ భావన బలోపేతమవుతోంది. అంతేకాదు. ఇప్పుడు ఎంతోమంది తల్లితండ్రులు ‘ఒక్క కూతురు చాలు’నని సంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. ఒకప్పుడు కూతురు అంటే భారం. గుండెలమీద కుంపటిగా భావించేవారు తల్లిదండ్రులు. ప్రస్తుతం ఆ ఆలోచన విధానంలో మార్పు వచ్చింది. ఎంతోమంది కూతుళ్లు తల్లిదండ్రుల కీర్తి ప్రతిష్టలను పెంపొందిస్తున్నారు. గొప్ప పేరు సంపాదిస్తున్నారు. తాము ఎంచుకొన్న రంగాల్లో ఉన్నత శిఖరాలను చేరుకుంటున్నారు. తాము పుట్టిపెరిగిన సమాజాన్ని, దేశాన్ని ప్రపంచ యవనికపై నిలబెడుతున్నారు.
ఎంతోమంది సింధూలై, మిథాలీ, సానియా, సైనాలై విజయబావుటాలు ఎగరవేస్తున్నారు. ఎవరెస్టు శిఖాన్ని అధిరోహించిన మాలావత్ పూర్ణ ప్రస్థానం ఆద్యంతం స్ఫూర్తిదాయకం, ఉత్తేజభరితం. ఇదంతా నాణేనికి ఒకవైపు అయితే మరోవైపు.. కూతురు అంటే ఉన్నతమైన విలువలకు నిలువెత్తు రూపం. ఆర్తి కలిగిన బంగారు తల్లి. కన్నవారి పట్ల ఎంతో ప్రేమను ఆప్యాయతను చూపుతుంది. అచ్చం అమ్మలాగే ఆదరిస్తుంది. కంటిపాపలా పెరిగిన బిడ్డ పెద్దయ్యాక తన తల్లిదండ్రులను సైతం కంటికి రెప్పలా చూసుకోవాలని ఆరాటపడుతుంది. పేరెంటింగ్ దృక్పథంలో మార్పు వచ్చినట్లుగానే పిల్లల ఆలోచనల్లోనూ మార్పు వస్తోంది. ఎంతో మంది కూతుళ్లు ‘ది బెస్ట్ డాటర్’గా పేరు తెచ్చుకుంటున్నారు. అమ్మానాన్నల కలలను సాకారం చేయడంలో ముందువరసలో ఉంటున్నారు. నేడు కూతుళ్ల దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం.
సామ్.. సో స్మార్ట్
నా కూతురు సమంత సో స్వీట్. ఆమె ఏ రంగాన్ని ఎంచుకున్నా అప్పర్ హ్యాండ్‌గానే ఉంటుంది. సామ్ సినీ ఇండస్ట్రీలో స్టార్‌గా వెలుగొందడం, అక్కినేని లాంటి ఓ పెద్ద ఫ్యామిలీకి పెద్ద కోడలుగా వెళ్లడం ఎంతో సంతోషాన్ని ఇస్తోంది. నా కూతురు చిన్నప్పటి నుంచి ప్రతిదీ నాకు చెప్పి చేసేది. సినీ ఇండస్ట్రీలోకి వెళ్తున్నప్పుడు నిలుదొక్కుకుంటుందా? లేదా? అని భయపడ్డాను. ఇప్పుడు నాకా భయం లేదు. సమంత ఇప్పుడు స్టార్ మాత్రమే కాదు... సేవా హృదయం కలిగిన వ్యక్తి కూడా. సో.. సామ్ ఈజ్ ఆల్వేస్ సో స్వీట్. – నిన్నెట్టే ఫిలోమోనో ప్రభూ, సమంత తల్లి
శభాష్ బిడ్డా
సాక్షి, సిటీబ్యూరో: కంటే కూతురినే కనాలి అనే నానుడిని సార్థకం చేస్తున్నారు ఆ కూతుళ్లు. వారు ఎంచుకున్న రంగంలో తిరుగులేని శక్తిగా ఎదుగుతున్నారు. తల్లులు చూపిన మార్గంలో రాణిస్తూ శభాష్ అనిపించుకుంటున్నారు. ఒక్కొక్కరిదీ ఒక్కో నేపథ్యం. తల్లుల అడుగుజాడల్లో నడుస్తూ.. బెస్ట్ డాటర్ అనే కాంప్లిమెంట్స్‌ని సొంతం చేసుకుంటున్నారు. కుమార్తెల గురించి కొందరు తల్లులు తమ మనోగతాన్ని ఇలా వివరించారు.
మై డాటర్ ఈజ్ బెస్ట్
మా అమ్మాయి సిమ్రాన్ చౌదరి బెస్ట్ డాటర్. స్కూల్ నుంచి ఇప్పటి వరకు ప్రతిదాంట్లోనూ తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకుంది. సిన్సీయర్‌గా ఉంటుంది. ఏం చేయాలన్నా.. పేరెంట్స్‌గా మా దృష్టికి తీసుకువచ్చి చేస్తుంది. ఫ్రీడం ఇచ్చాం కదా అని మిస్యూజ్ చేసుకోలేదు. స్కూల్లో టాపర్, డ్యాన్స్ బాగా చేసిందని ఎక్స్‌లెన్స్ అవార్డు కూడా ఇచ్చారు. కాలేజీలో బాస్కెట్ బాల్ ప్లేయర్, టీచర్స్ పెట్. ఇప్పుడు హీరోయిన్‌గా ఓ మంచి పొజీషిన్‌కు వెళ్లడాన్ని తల్లిగా ఆస్వాదిస్తున్నా.– సంగీత చౌదరి, సిమ్రాన్ చౌదరి తల్లి
కూచిపూడిలో ప్రతిభావంతులు
మా అమ్మాయిలు అదితినాగ్, అభనాథ్‌లు ఇప్పటి వారైనా నా జనరేషన్ పిల్లలని చెప్పుకోవడానికి గర్వంగా ఉంది. ఇద్దరూ కూచిపూడి నాట్యంలో మంచి ప్రతిభావంతులు. ఇప్పటి వరకు సుమారు 200కిపైగా ప్రదర్శనలు ఇవ్వడం నాకు చాలా ఆనందంగా ఉంది. వారు చేస్తుండటమే కాదు.. ఇతరులకు కొరియోగ్రఫీ కూడా నేర్పిస్తున్నారు. థియేటర్ ఆర్ట్స్‌లో కూడా ఉన్నారు. పెద్దమ్మాయి అదితినాగ్ ‘నాగి’గా, చిన్నమ్మాయి అభనాథ్ ‘నథాలయ’గా రాణిస్తున్నారు. ఎన్‌సీసీలోనూ టాపర్లే. నేటితరం పిల్లల్లా ఉంటారే కానీ.. వాళ్ల ఆలోచనలు, బాధ్యతలన్నీ నా తరం నాటివే. – సరోజబాల ఠాకూర్
తనయా.. ఒక్కతేనయా
సనత్‌నగర్: కుమారుడు అయినా, కూతురు అయినా వారికి సమానమే. కొడుకే పుట్టాలని భావించలేదు. మొదటి సంతానం ఆడబిడ్డ జన్మించినా బాధపడలేదు. ఆ ఒక్క అమ్మాయే చాలనుకున్నారు. దేవుడిచ్చిన తనయే సర్వస్వంగా బతికేస్తున్నారు. ఒకే ఒక అమ్మాయితో సరిపెట్టుకుని స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు నగరానికి చెందిన పలువురు దంపతులు. కూతుళ్ల భవిష్యత్‌కు బంగారు బాటలు వేస్తున్నారు.
ప్రేమాభిమానాలకు చిరునామా..
మోతీనగర్ పాండురంగానగర్‌కు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు సురేందర్, చంద్ర దంపతుల ముద్దుల కుమార్తె మోనా. మొదట కుమార్తె జన్మించినప్పటికీ ఆ తర్వాత మగబిడ్డ కావాలని ఏనాడూ ఈ జంట ఆలోచన చేయలేదు. ఒక్కగానొక్క కుమార్తెలోనూ మగబిడ్డను చూసుకుంటూ ఆమె నుంచి అంతులేని ప్రేమాభిమానాలను పొందుతున్నామని సురేందర్ వివరించారు. బాధ వచ్చినా, సంతోషం వచ్చినా ముందుగా కలగజేసుకుని తల్లిదండ్రులతో పంచుకునేది ఒక్క కుమార్తె మాత్రమే అని ఆయన చెబుతున్నారు. అందుకే కూతురు అంటే తమకు ఇష్టమంటున్నారు. ప్రస్తుతం మోనా ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతోంది. కెరీర్ పరంగా ఏనాడూ పాప ఆశయాలను అగౌరవపరచలేదు. ఆమె లక్ష్యం ప్రకారమే డాక్టర్‌ను చేయాలనుకున్నాం. బయటకు వెళితే నాన్న ఎప్పుడు వస్తారని వేయి కళ్లతో ఎదురుచూసేంది కుమార్తె మాత్రమేనని సురేందర్ పేర్కొన్నారు.
ఆడపిల్ల ఇంటికి అదృష్టం..
మూసాపేట ఆంజనేయనగర్‌కు చెందిన స్కూల్ నిర్వాహకురాలు రజనీ కొల్లూరు, బోస్ దంపతుల కుమార్తె అనఘా. ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం చదువుతోంది. ‘అనఘాను మగరాయుడిలా పెంచుకుంటున్నాం. ప్రస్తుత పరిస్థితులు చూస్తే కొడుకులు ఉన్నప్పటికీ పెళ్లయ్యాక పరిస్థితులు మారిపోతున్నాయి. దీంతో వృద్ధాశ్రమాలు పెరుగుతున్నాయి. అదే కూతురు ఉంటే పెళ్లై అత్తారింటికి వెళ్లిపోయినా ప్రేమాప్యాయతలు మాత్రం తల్లిదండ్రులపై శాశ్వతంగా ఉంటాయి. కూతురిని ఉన్నత స్థానంలో చూడాలని మా కోరిక. అందుకోసం ఎంతటి కష్టమైనా పడతాం’ అంటున్నారు. రజనీ, బోస్ దంపతులు. ‘తనలోనే కొడుకును చూసుకుంటూ తన మాటలకు ఎంతో విలువనిస్తారు. ఈ రోజుల్లో ఆడపిల్ల పుడితే ఏ విధంగా పరిస్థితులు ఉంటాయో అందరం చూస్తున్నాం. ఆడపిల్ల ఇంటికి అదృష్టంగా భావించే వారు నా తల్లిదండ్రులు కావడం నా అదృష్టం’ అని చెబుతోంది అనఘా.
అనురాగాల ‘నిధి’
మూసాపేట మారుతీనగర్‌కు చెందిన వ్యాపారవేత్త శ్రీనివాస్‌రెడ్డి, సంయుక్త దంపతుల ముద్దుల తనయ నిధిలారెడ్డి. ఐఐటీ రామయ్యలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. ‘మా దృష్టిలో వారసుడైనా, వారసురాలైనా ఒక్కటే. పాప పుట్టిన తర్వాత బాబు కావాలని ఏ రోజూ ఆలోచించలేదు. దేవుడిచ్చిన సంతానంలో పాపైనా, బాబైనా ఒక్కటే. బయట పనులపై తిరిగి ఇంటికి వచ్చిన తండ్రికి చేదోడుగా నిలిచేది భార్య తర్వాత కుమార్తె మాత్రమే. కొడుకు జేబు చూస్తాడంటారు. అదే కుమార్తె కడుపు చూస్తుందంటారు. అదే కొడుకుకు, కూతురుకు తేడా. కొడుకు కంటే తల్లిదండ్రులపై ప్రేమాప్యాయతలు ఎక్కువగా చూపించేది కూడా కూతురే. అందుకే కంటే కూతురినే కనాలి’ అంటున్నారు శ్రీనివాస్‌రెడ్డి, సంయుక్త దంపతులు
కూతురిలోనే ఆత్మీయత..
వీరు కూకట్‌పల్లి బాలాజీనగర్‌కు చెందిన బిల్డర్ కొండేపూడి వెంకటరమణ, సుమ దంపతులు. వారి గారాలపట్టి చరిష్మ. వీరికి వివాహమైన నాలుగేళ్లకు చరిష్మ జన్మించింది. కుటుంబమంతా మగబిడ్డ కావాలని కోరుకున్నా.. ఆ దంపతులు మాత్రం ఆడపిల్ల పుట్టాలనే మొక్కుకున్నారు. విశేషమేమంటే తల్లి సుమ పుట్టిన రోజునే చరిష్మ జన్మించింది. ఇద్దరు బర్త్ డే ఒకేసారి గ్రాండ్‌గా జరుపుకొంటారు. పాప పుట్టి 17 ఏళ్లయినా వారు ఏనాడూ మగబిడ్డ గురించి ఆలోచించలేదు. చరిష్మా ప్రస్తుతం తమిళనాడులోని శాస్త్ర డీమ్డ్ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ ఎలక్ట్రానిక్స్ మొదటి సంవత్సరం చదువుతోంది. కూతురు తమపై చూపించే ప్రేమ వల్లనో ఏమో మగబిడ్డ ఊసే లేదని వెంకటరమణ చెప్పుకొచ్చారు. బిజినెస్ పని మీద బయటకు వెళ్తే సాయంత్రం ఇంటికి వచ్చేవరకు ఫోన్ చేస్తూనే ఉంటుంది. ఎక్కడున్నా తల్లిదండ్రుల సంక్షేమం గురించి ఆలోచించేది ఒక్క కూతురే. ఎన్ని జన్మలెత్తినా కూతుర్నే కనాలని నేను గర్వంగా చెబుతా. తల్లిదండ్రులుగా మనం కోరుకునే ప్రేమ, ఆప్యాయత కూతురులో మాత్రమే దొరుకుతుంది.
సేవా తత్పరత నచ్చింది..
మా అమ్మాయి శ్రావ్యరెడ్డికి చిన్నప్పటి నుంచి సేవ చేయాలనే తపన. ఐఏఎస్ కావాల్సిన శ్రావ్య సేవా కార్యక్రమాలపై దృష్టి పెట్టడం సమ్‌థింగ్ ఇంట్రస్టింగ్ అనిపించింది. గ్రామీణ ప్రాంతాల్లో రైతులతో మమేకమై వాళ్లకు భరోసా ఇవ్వడం నాకు గర్వంగా అనిపిస్తుంది. చేనేత కుటుంబాలు ఆత్మహత్య చేసుకోకుండా వారికి తనకున్న దాంట్లో చేస్తున్న సాయం నన్ను మరింతగా ఆకర్షిస్తుంది. ఒక తల్లిగా ఇంతకన్నా నాకేం కావాలి. – నీరజారెడ్డి
మా అమ్మాయి మంచి ఆర్టిస్ట్
మా అమ్మాయి ప్రియాంక ఆలే ఓ మంచి ఆర్టిస్టు అని చెప్పుకోవడానికి చాలా గర్వంగా, ఆనందంగా ఫీలవుతుంటాను. ఆర్ట్‌పై ఆమెకు మంచి గ్రిప్ ఉంది. వేసిన ఆర్ట్‌పై గంటల కొద్దీ డిబేట్ చేయడం కూడా నాకు చాలా నచ్చుతుంది. ఆమె ఆర్ట్ విషయంలో నేను జోక్యం చేసుకోను. తనే ‘అమ్మా... నేను గీసిన చిత్రాలు’ ఎలా ఉన్నాయంటూ అడుగుతుంటుంది. మావారు కూడా ఆర్టిస్టే. ఇప్పుడు కుమార్తె సైతం ఆర్టిస్టు కావడం ఓ గొప్ప వరంగా భావిస్తా. – ఆలే లలిత
Comments
Please login to add a commentAdd a comment