
ఇప్పుడు నాకన్నీ తెలుసు!
ఎంత అనుభవజ్ఞులైనా నాకు తెలిసింది ఇసుమంతే నేర్చుకోవలసింది ఎంతో ఉంది అంటుంటారు విజ్ఞులు. అలాంటిది నటి కాజల్‌అగర్వాల్ మాత్రం నాకన్నీ తెలుసు అంటున్నారు. ఇది కాస్త అతి అనిపించినా ఈ బ్యూటీ భావనేమిటన్నది ఒక సారిచూస్తే పోలా.దక్షిణాది చిత్ర పరిశ్రమలో దాదాపు యువ హీరోలందరితోనూ జోడీ కట్టేసిన కాజల్‌అగర్వాల్ ఉత్తరాదిలోనూ తన స్థాయిని పెంచుకునే ప్రయత్నంలో ఉన్నారు. ప్రస్తుతం ఈమెకు కోలీవుడ్‌లోనే పరిస్థితి బెటర్‌గా ఉందని చెప్పవచ్చు. ద్విభాషా(తెలుగు,తమిళం)చిత్రం బ్రహ్మోత్సవంతోపాటు జీవాతో కవలైవేండామ్ అనే తమిళ చిత్రంలోనూ నటిస్తున్నారు.
తాజాగా శింబుతో రొమాన్స్ చేసే అవకాశం వెతుక్కుంటూ వచ్చింది. తెలుగు చిత్రం టెంపర్ రీమేక్‌లో శింబు నటించనున్నారన్న విషయం తెలిసిందే.ఇందులో ఆయనకు జంటగా కాజల్‌ను నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇలా కోలీవుడ్‌లో అవకాశాలు పెంచుకుంటున్న కాజల్‌అగర్వాల్ తన గురించి ఏమంటున్నారో చూద్దాం. నటీనటుల్లో ఒక్కొక్కరిలో ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. కొందరికి డాన్స్‌లో ప్రావీణ్యం ఉంటే, మరొకరికి ప్రేమ సన్నివేశాల్లో చక్కగా నటించే నేర్పరితనం ఉంటుంది. ఇంకొందరికి శోక సన్నివేశాల్లో జీవించే ప్రతిభ ఉంటుంది. అయితే నాకు మాత్రం అన్నీ తెలుసు.
ఏ తరహా పాత్రనైనా అవలీలగా చేసేయగలను. నిజం చెప్పాలంటే తొలి రోజుల్లో నాకూ ఏమీ తెలియదు. ముఖ్యంగా ఏడవడం అస్సలు తెలియదు. చిన్నతనం నుంచీ నేను ఏడ్చిన సందర్భాలు లేవు.అందుకే అలాంటి సన్నివేశాల్లో నటించడానికి చాలా కష్టపడేదాన్ని. కన్నీరు వచ్చేవి కానీ అందులో జీవం ఉండేదికాదు. ఇప్పుడు ఏడవడంతో పాటు అన్నీ నేర్చుకున్నాను. కెమెరా ముందుకు రాగానే దర్శకుడు యాక్షన్ అనగానే ముఖంలో శోకాన్ని నింపుకుని ఏడుపు సన్నివేశంలో జీవించేస్తాను. ఇప్పుడీ తరహా నటనను చూసి నా స్నేహితులు ఆశ్చర్యపోతున్నారు. కథ, పాత్రలను అవగాహన చేసుకుని అందులో లీనమై నటించే పరిణితిని సాధించాను. అందుకే నటిగా తానీ స్థాయికి చేరుకోగలిగాను.