
తొలి విడత చర్చలు విఫలం
తమిళ నిర్మాతల మండలి నిర్వాహకులకు, దక్షిణభారత సినీ కార్మికుల సమాఖ్య (ఫెఫ్సీ) నిర్వాహకులకు మధ్య శుక్రవారం జరిగిన చర్చలు విఫలమయ్యాయి.
పెరుంబూరు: తమిళ నిర్మాతల మండలి నిర్వాహకులకు, దక్షిణభారత సినీ కార్మికుల సమాఖ్య (ఫెఫ్సీ) నిర్వాహకులకు మధ్య శుక్రవారం జరిగిన చర్చలు విఫలమయ్యాయి. ఈ రెండు సంఘాల మధ్య వేతనం, ఇతర అంశాలపై అంగీకారం కుదరకపోవడంతో ఈ నెల ఒకటో తేదీ నుంచి ఫెఫ్సీ సమ్మె సైరన్ మోగించిన విషయం తెలిసిందే. మూడు రోజుల పాటు జరిగిన ఈ సమ్మె కారణంగా 40 చిత్రాలకు పైగా షూటింగులు రద్దయ్యాయి. దీంతో నటుడు రజనీకాంత్, సినీ ప్రముఖుల విజ్ఞప్తి మేరకు ఫెఫ్సీ సమ్మెను విరమించుకుంది.
ఈ నేపథ్యంలో శుక్రవారం కార్మికుల సంక్షేమ అధికారి, ఇతర ప్రభుత్వ అధికారులు ఫెఫ్సీ, నిర్మాతల మండలి నిర్వాహకుల మధ్య శుక్రవారం చర్చలకు ఏర్పాట్లు చేశారు. ఫెఫ్సీ తరఫున అధ్యక్షుడు ఆర్‌కే.సెల్వమణి, నిర్మాతల మండలి తరఫున ఆ మండలి అధ్యక్షుడు విశాల్ పాల్గొన్నారు. ఫెఫ్సీ నూతన వేతనాలను చెల్లించాలని, అదే విధంగా ఫెఫ్సీ సభ్యులనే షూటింగులకు వాడుకోవాలని పట్టుబడుతోంది. నిర్మాతల మండలి నిర్వాహకులు మాత్రం ఇంతకుముందు నిర్ణయించిన వేతనాలనే చెల్లిస్తామని, అదేవిధంగా ఫెఫ్సీ ఏ ఇతర కార్మికులను వాడుకుంటామన్న విషయంలో వెనక్కు తగ్గడం లేదు. దీంతో తొలి విడత చర్చలు విఫలమయ్యాయి. మలి విడత చర్చలు ఈ నెల 11వ తేదీన జరగనున్నాయి.