
‘మదకరి నాయక’... ప్రస్తుతం శాండల్‌వుడ్‌లో ఈ పేరు పలు వివాదాలకు కారణమైంది. ఇద్దరు స్టార్ హీరో అభిమానుల మధ్య ‘మదకరి నాయక’ వివాదాన్ని రేపుతోంది. 18వ శతాబ్దాపు రాజు మదకరి నాయకుడికి సంబంధించిన కథతో సినిమాను నిర్మించేందుకు కన్నడ సినిమా రంగంలోని చాలా మంది ఆసక్తి కనపరుస్తున్నారు. కిచ్చా సుదీప్ తన సొంత బ్యానర్‌లో మదకరి నాయకపై సినిమాను నిర్మిస్తానని ఇటీవల ప్రకటించారు.
కిచ్చా సుదీప్ భార్య ప్రియా రాధాకృష్ణన్ నిర్మాతగా మదకరి నాయక పాత్రను సుదీప్ పోషిస్తూ సుమారు 100 కోట్లతో సినిమాను తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. ఈ సినిమాను గురుదత్తా గనిగా, సంచిత్‌లల్లో ఎవరో ఒకరు దర్శకత్వం వహించే అవకాశం ఉంది.
ఇదిలా ఉండగా గత కొన్నేళ్లుగా మదకరి నాయకుడిపై సుదీప్‌తో సినిమా నిర్మించాలని వాల్మీకి ఫౌండేషన్ ప్రయత్నాలు చేస్తోంది. కిచ్చా సుదీప్ కూడా ఆ సినిమాపై ఆసక్తి కనపరుస్తున్నారు. కానీ ఇదే మదకరి నాయకుడి జీవిత చరిత్రపై మరో బడా హీరో, చాలెంజింగ్ స్టార్ దర్శన్ కూడా కన్ను వేశాడు. రాక్‌లైన్ వెంకటేశ్ నిర్మాణంలో రాజేంద్ర సింగ్ బాబు దర్శకత్వంలో మదికర నాయక సినిమాను చిత్రీకరించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.
‘గండుగలి వీర మదకరి నాయక’ పేరుతో దర్శన్‌తో సినిమాను నిర్మించనున్నట్లు ఇటీవలే నిర్మాత రాక్‌లైన్ వెంకటేశ్ ప్రకటించారు. దీంతో కిచ్చా సుదీప్ తీయాలనుకుంటున్న సినిమాను దర్శన్ హీరోగా నిర్మించనున్నడంపై సుదీప్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఏ హీరో మదకరి నాయక సినిమాలో నటిస్తారనే విషయం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
ఈ క్రమంలో శనివారం హీరో దర్శన్ చిత్రదుర్గలో ప్రారంభమైన శరణ సంస్కృతి ఉత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు అభిమానుల నుంచి మదకరి నాయక చిత్రం గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. అయితే పదేపదే సినిమా గురించి అడిగి ఎందుకు ఇబ్బంది పెడుతారని ప్రశ్నించారు. ప్రస్తుతం సినిమా గురించి ఎలాంటి గందరగోళం చేయొద్దని సూచించారు.
ప్రస్తుతం చిత్రదుర్గ శరణ సంస్కృతి ఉత్సవంలో పాల్గొనేందుకు వచ్చానని, సినిమా గురించి మాట్లాడేందుకు ఇది సందర్భం కాదని అభిమానులను నివారించే ప్రయత్నం చేశారు. ఇదే ఉత్సవంలో పాల్గొన్న రాక్‌లైన్ వెంకటేశ్ మాట్లాడుతూ... దసరా పండుగ జరుపుకునేందుకు వచ్చామని, ఇక్కడి సినిమా గురించి మాట్లాడడం వద్దని అభిమానులకు సూచించారు. మదకరి నాయక గురించి తర్వాత మాట్లాడుతామని తెలిపారు. కార్యక్రమంలో దర్శకుడు రాజేంద్ర సింగ్ బాబులు పాల్గొన్నారు.
ఎవరీ మదకరి?
ఇంతంటి వివాదానికి కారకుడైన ఒంటిసలగా మదకరి నాయక అలియాస్ మదకరి నాయక చిత్రదుర్గకు చెందిన ఒక గొప్ప రాజు. కర్ణాటక చిత్రదుర్గకు చెందిన మదకరి సామాజిక వర్గానికి చెందిన మహారాజు. 1758లో జన్మించిన రాజా వీర మదకరి నాయక 1789లో శ్రీరంగపట్టణలో తుదిశ్వాస విడిచాడు.