
నాన్న బర్త్‌డేకి ఫస్ట్‌లుక్... తాత బర్త్‌డేకి ఆడియో...
అక్కినేని వంశాంకురం అఖిల్ హీరోగా తెరపై కనిపించడానికి సర్వం సిద్ధమవుతోంది. అఖిల్‌ను హీరోగా పరిచయం చేస్తూ, మరో హీరో నితిన్ నిర్మిస్తున్న భారీ చిత్రం నిర్మాణంలో ఉండగానే అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. వి.వి. వినాయక్ దర్శకత్వంలో శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై నిఖితారెడ్డి సమర్పణలో వస్తున్న ఈ సినిమా క్లైమాక్స్ చిత్రీకరణ మంగళవారం నుంచి జరుగుతోంది.
13 రోజుల భారీ క్లైమాక్స్ షురూ!
హైదరాబాద్‌లోని సంఘీ ఫారెస్ట్‌లో చాలా ఖర్చుతో వేసిన భారీ సెట్‌లో ఈ పతాక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఫైట్‌మాస్టర్ రవివర్మ నేతృత్వంలో మొత్తం 13 రోజుల పాటు ఈ క్లైమాక్స్ షూటింగ్ జరగనుంది. ‘‘దీంతో 3 పాటలు మినహా మిగతా సినిమా మొత్తం పూర్తయినట్లే. ఈ నెల 30 నుంచి సెప్టెంబర్ 12 దాకా రెండు పాటలు యూరప్‌లో చిత్రీకరిస్తాం. సెప్టెంబర్ ద్వితీయార్ధంలో హైదరాబాద్‌లో భారీ సెట్స్‌లో చివరి పాట తీయనున్నాం. దాంతో, షూటింగ్ మొత్తం పూర్తయిపోతుంది’’ అని నిర్మాతగా వ్యవహరిస్తున్న హీరో నితిన్ వివరించారు.
విజయదశమికి... జనం ముందుకు
‘మిస్సైల్’, ‘తాండవం’, ‘బాలరాజు’ లాంటి రకరకాల పేర్లు ప్రచారంలో ఉన్న ఈ సినిమా టైటిల్ ఇంకా ఏదీ ఖరారు కాలేదు. ఈ నెల 29న నాగార్జున పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్‌లుక్ రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అలాగే స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు జయంతి రోజైన సెప్టెంబర్ 20న భారీయెత్తున పాటలు విడుదల చేయనున్నారు. అన్ని కార్యక్రమాలూ పూర్తి చేసి, విజయదశమి కానుకగా అక్టోబర్ 21న సినిమా రిలీజ్ చేయాలని ప్లాన్.
సైరాబాను బంధువే హీరోయిన్
అఖిల్‌ను హీరోగా పరిచయం చేస్తున్న ఈ సినిమాతో బొంబాయి అమ్మాయైన 17 ఏళ్ళ సయేషా కథానాయికగా తెలుగు తెర మీదకొస్తున్నారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు దిలీప్‌కుమార్, సైరాబానులకు సమీప బంధువు ఈ కొత్త నటి. గమ్మత్తేమిటంటే, సినీ కుటుంబం నుంచి వచ్చిందన్న మాటే కానీ, తొలిసారిగా సెట్స్ మీదకు అడుగుపెట్టింది ఈ సొంత సినిమాతోనే! ప్రాథమిక విద్యాభ్యాసమంతా లండన్‌లో చేసిన ఈ అమ్మాయి సినిమా వాతావరణానికి దూరంగా పెరిగారు. ‘‘కాకపోతే, సినిమాల్లో నటిస్తానని చెప్పగానే మా ఇంట్లో అందరూ ఎంతో ప్రోత్సహించారు’’ అని సయేషా చెప్పారు. అజయ్‌దేవ్‌గణ్ నటిస్తూ, స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న హిందీ చిత్రంతో బాలీవుడ్‌లోనూ ఆమె అడుగుపెట్టనున్నారు. ‘‘తెలుగు ఇప్పుడిప్పుడే బాగా అర్థం చేసుకుంటున్నా. డెరైక్టర్ వినాయక్ సర్ నాకు తెలుగులోనే సూచనలిస్తుంటే, అర్థం చేసుకోగలుగుతున్నా. ఆయనతో పని చేయడం చాలా బాగుంది. రేపు నేను ఏ స్థాయికి చేరినా, నా తొలి దర్శకుడు, నన్ను తీర్చిదిద్దిన గురువు ఆయనే అని చెబుతాను’’ అని బుధవారం నాడు పుట్టినరోజు జరుపుకొంటున్న సయేషా అన్నారు. లాటిన్ అమెరికన్ డ్యాన్స్‌లు సల్సా, రుంబా, చాచాతో పాటు కూచిపూడి, ఒడిస్సీ కూడా ఈ యువ నటి నేర్చుకోవడం విశేషం.
విదేశీ విలన్స్
అటు అఖిల్‌కూ, ఇటు సయేషాకూ తొలి సినిమా అయినా, పేరున్న అనుభవజ్ఞులైన తారలు ఈ భారీ తెలుగు చిత్రం నిండా ఉన్నారు. రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందం, ‘వెన్నెల’ కిశోర్, మహేశ్ మంజ్రేకర్, సప్తగిరి, హేమ అందులో కొందరు. లండన్‌కు చెందిన కొందరు, రష్యాకు చెందిన మరొకరు ఈ చిత్రంలో ప్రధాన విలన్స్‌గా నటించడం విశేషం. వెలిగొండ శ్రీనివాస్, కోన వెంకట్‌లు రచనా విభాగంలో, అనూప్, థమన్‌లు సంగీత విభాగంలో, అమోల్ రాథోడ్ కెమేరా విభాగంలో - ఇలా ఒకరికి ఇద్దరు సీనియర్స్ టెక్నీషియన్స్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అవును మరి! పెద్ద కుటుంబం నుంచి... పెద్ద హీరో వారసుడు తెరపైకి వస్తుంటే, ఆ మాత్రం హడావిడి సహజమేగా! ఆల్ ది బెస్ట్ టు అఖిల్ అండ్ సయేషా!