'గౌతమిపుత్ర శాతకర్ణి' మూవీ రివ్యూ
టైటిల్ : గౌతమిపుత్ర శాతకర్ణి
జానర్ : హిస్టారికల్ మూవీ
తారాగణం : బాలకృష్ణ, శ్రియ, హేమామాలిని, కబీర్ బేడీ, శివరాజ్ కుమార్
సంగీతం : చిరంతన్ భట్
దర్శకత్వం : క్రిష్ (రాధాకృష్ణ జాగర్లమూడి)
నిర్మాత : వై. రాజీవ్ రెడ్డి, సాయిబాబు
నందమూరి బాలకృష్ణ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ చారిత్రక కథాంశం గౌతమిపుత్ర శాతకర్ణి. బాలకృష్ణ వందో సినిమా కూడా కావటంతో ఈ సినిమాపై అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాల్లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలను గౌతమిపుత్ర శాతకర్ణి అందుకుందా..? అంత ఘనమైన చరిత్రను కేవలం 79 రోజుల్లోనే తెరకెక్కించిన క్రిష్.. ఆకట్టుకున్నాడా..?
కథ :
శాతకర్ణి (బాలకృష్ణ) అమరావతి రాజ్య రాకుమారుడు. ఉగ్గుపాలతోనే వీరత్వాన్నీ పుణికి పుచ్చుకున్న మహావీరుడు. యుద్ధానికని తన తండ్రి తరచూ కదనరంగానికి వెళుతున్నాడని.. అసలు అంతా ఒకే రాజ్యమైతే యుద్ధం చేయాల్సిన అవసరమే రాదని, అఖండ భారతాన్ని ఒకే రాజ్యంగా చేస్తానని చిన్నతనంలోనే తల్లి గౌతమి బాలాశ్రీ(హేమామాలిని)కి మాట ఇస్తాడు. అందుకోసం అతడు జైత్రయాత్ర మొదలుపెడతాడు. శాతకర్ణి పరాక్రమానికి యావత్ దక్షిణ భారతం దాసోహం అంటుంది. తరువాత శాతకర్ణి చూపు ఉత్తరభాతరం మీద పడుతుంది.
ఇతర రాజ్యాల రాకుమారులను ఎత్తుకెళ్లి ఆ రాజులను తన సామంతులుగా చేసుకునే నహపానుడు ఉత్తర భారతాన్ని పాలిస్తుంటాడు. శాతకర్ణి, సైన్యం తనవైపుగా వస్తుందని తెలుసుకున్న నహపానుడు శాతకర్ణి కొడుకును కదన రంగానికి తీసుకురమ్మని కబురు పంపుతాడు. అందుకు శాతకర్ణి భార్య వాశిష్టి దేవి (శ్రియ) అంగీకరించకపోయినా, శాతకర్ణి పసిబాలుడైన కొడుకుతో కలిసి యుద్ధానికి సిద్ధమవుతాడు. నహపానుడిని గెలిచి అఖండ భారతాన్ని ఒకే రాజ్యంగా మారుస్తాడు.
శాతకర్ణి విజయానికి గుర్తుగా అతని తల్లి గౌతమి బాలాశ్రీ(హేమామాలిని) రాజసూయ యాగం తలపెడుతుంది. ఆ యాగంలోనే తనకు ఇంతటి వీరత్వాన్ని అందించిన తల్లి పేరును తన పేరుకు ముందుకు చేర్చుకొని గౌతమిపుత్ర శాతకర్ణి అవుతాడు. యావత్ భరతఖండం ఒకే రాజ్యంగా ఏర్పడిన ఆ రోజును శాలివాహన శఖ ఆరంభంగా, యుగాదిగా ప్రకటిస్తాడు.
దేశంలోని అన్ని రాజ్యాలు ఏకమైనా పరాయి దేశాల నుంచి ముప్పు మాత్రం అలాగే ఉంటుంది. సామాంతులను వశపరుచుకున్న యవన సామ్రాట్ డిమెత్రీస్, శాతకర్ణిపై యుద్ధం ప్రకటిస్తాడు. దొంగచాటుగా శాతకర్ణిని హతమార్చి తిరిగి భారతభూమిని ముక్కలు ముక్కలు చేయాలనుకుంటాడు. ఈ కుట్రను శాతకర్ణి ఎలా జయించాడు..? అఖండ భారతం కోసం శాతకర్ణి కన్న కల నెరవేరిందా..? అన్నదే మిగతా కథ.
నటీనటులు :
తన వందో చిత్రంగా గౌతమిపుత్ర శాతకర్ణి లాంటి చారిత్రక చిత్రాన్ని ఎంపిక చేసుకున్న బాలకృష్ణ మరోసారి జానపద పౌరణిక పాత్రలకు తానే సరైన నటుడని నిరూపించుకున్నాడు. ఆహార్యంలోనూ, రాజసంలోనూ మహారాజులానే కనిపించి ఆకట్టుకున్నాడు. భారీ యుద్ధ సన్నివేశాల్లో బాలయ్య నటన అభిమానులతో విజిల్స్ వేయిస్తుంది. చారిత్రక కథాంశమే అయినా ఎక్కడ తననుంచి అభిమానులు ఆశించే అంశాలు మిస్ అవ్వకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు బాలకృష్ణ.
రాణీ వాశిష్టీ దేవిగా శ్రియ మెప్పించింది. అందంతో పాటు అభినయంతోనూ ఆకట్టుకుంది. ముఖ్యంగా పసిబాలుడైన కొడుకును యుద్ధరంగానికి పంపమని భర్త అడినప్పుడు, తిరిగి వస్తాడో రాడో తెలియని సమయంలో భర్తను యుద్ధానికి సాగనంపుతున్నప్పుడు శ్రియ చూపించిన హవాభావాలు అద్భుతం. రాజమాత గౌతమి బాలాశ్రీ పాత్రలో హేమామాలిని హుందాగా కనిపించింది. ఆమె స్టార్ డమ్ సినిమాకు ప్లస్ అయ్యింది. ఇతర నటీనటులు తమ పరిథి మేరకు ఆకట్టుకున్నారు.
సాంకేతిక నిపుణులు :
ఇప్పటి వరకు యంగ్ హీరోలతో మాత్రమే సినిమాలు చేస్తూ వచ్చిన క్రిష్ తొలిసారిగా ఓ సీనియర్ స్టార్ హీరోతో సినిమాను తెరకెక్కించి ఘన విజయం సాధించాడు. బాలయ్య వందో సినిమాగా చారిత్రక కథాంశాన్ని చెప్పి ఒప్పించిన క్రిష్ అక్కడే విజయం సాధించాడు. ఎన్నో యుద్ధాలు చేసిన ఓ మహా చక్రవర్తి కథను కేవలం 79 రోజుల్లో తెరకెక్కించిన క్రిష్ సినిమా నిర్మాణం, దర్శకత్వంలో మీద తనకు ఎంత పట్టు ఉందో నిరూపించింది. అంత తక్కువ సమయంలో సినిమాను తెరకెక్కించినా ఎక్కడా హడావిడి పూర్తి చేసినట్టుగా కనిపించకుండా ప్రతీ ఫ్రేమ్ పర్ఫెక్ట్ గా వచ్చేలా జాగ్రత్తలు తీసుకున్నాడు.
ముఖ్యంగా ఎక్కవగా విజువల్ ఎఫెక్ట్స్ జోలికి వెల్లకుండా వీలైనంత వరకు ఒరిజినల్ లొకేషన్స్ లో షూట్ చేసి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కు త్వరగా పూర్తయ్యేలా ప్లాన్ చేశాడు. అయితే లోకేషన్లుగా క్రిష్ ఎంచుకున్న రాజప్రాసాదాలు, యుద్ధ రంగాలు.. అలనాటి శాతకర్ణి వైభవాన్ని కళ్లకు కట్టాయి. క్రిష్ ఊహలకు రూపమివ్వటంలో సినిమాటోగ్రాఫర్ జ్ఞాణశేఖర్ విజయం సాధించాడు. ప్రతీ ఫ్రేమ్ లోనూ శాతవాహనుల రాజసం కనిపించేలా తెరకెక్కించాడు. చిరంతన్ భట్ సంగీతం, సూరజ్,రామకృష్ణల ఎడిటింగ్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణ విలువలు సినిమా స్థాయిని మరింత పెంచాయి.
ప్లస్ పాయింట్స్ :
బాలకృష్ణ నటన
క్రిష్ కథా స్క్రీన్ప్లే
మాటలు
మైనస్ పాయింట్స్ :
క్రిష్ మార్క్ డ్రామా లేకపోవటం
ఓవరాల్గా గౌతమిపుత్ర శాతకర్ణి... తెలుగు వారు గర్వంగా చెప్పుకోవాల్సిన ఘన చరిత్రకు అద్భుత దృశ్యరూపం
- సతీష్ రెడ్డి, ఇంటర్నెట్ డెస్క్