వందకోట్లు ఇస్తామన్నా... మళ్లీ అలాంటి ప్రయోగం చేయను!
Published Thu, Oct 31 2013 12:38 AM | Last Updated on Mon, Aug 20 2018 6:18 PM
తమిళంలో జయభేరి మోగించిన తెలుగు కుర్రాడు విశాల్. హీరోగా
తన ప్రతిభ చెప్పడానికి ‘పందెంకోడి’ చాలు. నటుడిగా తనేంటో చెప్పడానికి
ఒక్క ‘వాడు-వీడు’ సినిమా చాలు. నవంబర్ 2న ‘పల్నాడు’ సినిమాతో తెలుగు
ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు విశాల్. అటు ‘పందెంకోడి’, ఇటు
‘వాడు-వీడు’ రెండూ కలిస్తే ఎలా వుంటుందో ‘పల్నాడు’ అలా ఉంటుందని
కాన్ఫిడెంట్‌గా చెబుతున్న విశాల్‌తో ‘సాక్షి’ జరిపిన ప్రత్యేక ఇంటర్‌వ్యూ.
‘పల్నాడు’ అంటున్నారు.. ఫ్యాక్షన్ నేపథ్యమా?
అవును.. తమిళ వెర్షన్‌లో ఈ సినిమా పేరు ‘పాండ్యనాడు’. మధురై నేపథ్యంలో సాగే కథ. మన పల్నాడు నేటివిటీకి దగ్గరగా ఉండే కథ కావడంతో ‘పల్నాడు’ అనే టైటిల్ పెట్టాం.
సుశీంద్రన్ డెరైక్ట్ చేసిన ‘నా పేరు శివ’ నేపథ్యం చాలా భిన్నంగా ఉంటుంది. మరీ ఇందులో కొత్తదనం ఏంటి?
సుశీంద్రన్ గత చిత్రాల మాదిరిగానే రియలిస్టిగ్గా ఉండేసినిమా ఇది. నా పాత్రను చాలా కొత్తగా తీర్చిదిద్దారు. ఇందులో నాకు ఆవేశం వస్తే... ఆటోమేటిగ్గా ‘నత్తి’ వచ్చేస్తుంటుంది. ఛాలెంజింగ్‌గా తీసుకొని ఈ పాత్ర చేశాను.
‘వాడు-వీడు’లో మెల్లకన్ను. ‘పల్నాడు’లో నత్తి... ఏంటి ఉన్నట్టుండి ప్రయోగాల బాట పట్టారు?
ప్రతి నటుడికీ స్థాయిని బట్టి ఆకలి ఉంటుందండీ. దాన్ని తీర్చుకునే అవకాశాలు అరుదుగా మాత్రమే వస్తాయి. అలాంటి అవకాశం అప్పుడు ‘వాడు-వీడు’ ద్వారా వస్తే... ఇప్పుడు ‘పల్నాడు’ ద్వారా వచ్చింది. అయితే... ‘వాడు-వీడు’ లాంటి ప్రయోగాన్ని మాత్రం వందకోట్ల రూపాయలు ఇస్తామన్నా సరే... మళ్లీ చేయను.
ఎందుకని?
దాని వల్ల నా కళ్లకు వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ ఇంకా తగ్గలేదు. అయితే... పాత్రకు వచ్చిన స్పందనను కూడా మాటల్లో చెప్పలేను. కొన్ని పాత్రలు చేస్తున్నప్పుడే మనకు అర్థమైపోతుంది. అవి గొప్ప పేరు తెస్తాయని. ‘పల్నాడు’ విషయంలో కూడా నాకు అలాగే అనిపించింది. ఈ సినిమా తర్వాత మరిన్ని మంచి పాత్రలు నన్ను వెతుక్కుంటూ వస్తాయని నా నమ్మకం.
‘పల్నాడు’లో ప్రముఖ దర్శకుడు భారతీరాజాతో కలిసి నటించడం ఎలా అనిపించింది?
నా లైఫ్‌లో మరిచిపోలేని విషయం అది. నా తండ్రి పాత్రను పోషించారాయన. 70 ఏళ్ల వృద్ధుడు పాత్ర ఆయనది. అంత గొప్ప దర్శకుడై ఉండి కూడా, ఒక విద్యార్థిలా చెప్పింది చెప్పినట్లు చేశారు. ఆయన డెడికేషన్ చూసి షాక్ అయ్యాను.
తమిళంలో ‘ఎమ్జీఆర్’(మదగజరాజా), తెలుగులో ‘ఎన్టీఆర్’ (నటరాజు-తనేరాజు). కేవలం క్రేజ్ కోసమేనా ఈ టైటిల్స్?
‘మదగజరాజా’కు షార్ట్‌కట్ ‘ఎమ్జీఆర్’. ఈ టైటిల్ పెట్టగానే తమిళనాట మంచి క్రేజ్ ఏర్పడింది. తెలుగులో ఆ స్థాయి క్రేజ్ రావాలంటే... ‘ఎన్టీఆర్’ అని పెట్టడమే కరెక్ట్. అందుకే షార్ట్‌కట్‌లో ఎన్టీఆర్ అని వచ్చేలా ‘నటరాజు-తనేరాజు’ అని టైటిల్ పెట్టాం. దానిక్కూడా మంచి క్రేజ్ వచ్చింది. కథకు కూడా ఈ టైటిల్ చక్కగా సరిపోయింది. ఈ సినిమా పూర్తిస్థాయి వాణిజ్య చిత్రం. ప్రయోగాల జోలికి పోకుండా, ఫక్తు కమర్షియల్ ఫార్ములాను ఫాలో అవుతూ ఈ సినిమా చేస్తున్నాం. సుందర్.సి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రం నాకు మంచి పేరు తెస్తుంది.
మీ అన్నయ్య నిర్మాణసంస్థని పక్కన పెట్టేసి, సొంతంగా ప్రొడక్షన్ స్టార్ట్ చేశారు దేనికి?
కోపంతో నేనా సంస్థ స్టార్ట్ చేశాను. దానికి బలీయమైన కారణమే ఉంది. నిజానికి ఈ సినిమాకు ముందు నిర్మాత వేరే. కానీ కొన్ని కారణాలవల్ల నేనే నిర్మించా. ఈ విషయంలో లోతుగా వెళ్లడం నాకు ఇష్టం లేదు. గత ఏడాది నా సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడలేదు. అలాంటి పొరపాటు మళ్లీ జరగకూడదనే ఈ సంస్థను మొదలెట్టా. ఇక అన్నయ్య ప్రొడక్షన్ అంటారా! నాన్నకు సంబంధించిన వ్యాపార వ్యవహారాలు చూసుకునే పనిలో అన్నయ్య బిజీగా ఉన్నారు. త్వరలో అన్నయ్య ప్రొడక్షన్‌లో సినిమా ఉంటుంది.
తెలుగులో డెరైక్ట్ సినిమా ఎప్పుడు చేస్తారు?
నిజానికి ఈ దసరాకే స్టార్ట్ చేయాలి. కథ కూడా ‘ఓకే’ అయ్యింది. శశికాంత్ దర్శకుడు. కానీ నాకు ‘పల్నాడు’ కథ నచ్చడంతో వదులుకోలేకపోయా. దాంతో తెలుగు సినిమాను వాయిదా వేయాల్సి వచ్చింది. నా సొంత సంస్థలోనే త్వరలో తెలుగు సినిమా చేస్తా.
మీ భవిష్యత్తు ప్రణాళికలు?
తిరు దర్శకత్వంలో ‘యూటీవీ’వారితో టైఅప్ అయ్యి ఓ చిత్రం చేయబోతున్నాను. తమిళ వెర్షన్ పేరు ‘నాన్‌సిగపు మణిదన్’. అలాగే బాలా దర్శకత్వంలో కూడా ఓ సినిమా ఉండొచ్చు.
చివరి ప్రశ్న. శరత్‌కుమార్ కుమార్తె వరలక్ష్మితో మీరు లవ్‌లో ఉన్నారట. నిజమేనా?
ఈ రూమర్ నా దగ్గరకూ వచ్చింది. వరలక్ష్మి నా బాల్య స్నేహితురాలు. పైగా మేం ఇద్దరం కలిసి ‘మదగజరాజా’ సినిమా చేస్తున్నాం. దాంతో ఈ రూమర్‌ని క్రియేట్ చేశారు. ఈ ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదు. అసలు పెళ్లి గురించి ఆలోచించడానిక్కూడా నాకు టైమ్ కుదరడం లేదు. ఇక ప్రేమించే టైమ్ ఎక్కడిది చెప్పండి.
Advertisement
Advertisement