డబుల్ మీనింగ్ డైలాగులు చెప్పలేకే...
డబుల్ మీనింగ్ డైలాగులు చెప్పలేకే...
Published Fri, Dec 27 2013 2:00 AM | Last Updated on Mon, Jul 15 2019 9:21 PM
బూతు మాటలు, డబుల్ మీనింగ్ డైలాగులు పలకలేకే కొన్ని సినిమాల్లో వేషాలను వదులుకున్నానని ప్రముఖ హాస్యనటుడు వేణుమాధవ్ తెలిపారు. సతీసమేతంగా గురువారం రత్నగిరిపై సత్యదేవుడిని దర్శించుకుని పూజలు చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే...
‘సంప్రదాయం’తో అరంగేట్రం
సూపర్‌స్టార్ కృష్ణ హీరోగా ఎస్‌వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో 1996లో వచ్చిన సంప్రదాయం నా తొలి సినిమా. హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో నా మిమిక్రీ ప్రదర్శనను కృష్ణారెడ్డి, ఆ సినిమా నిర్మాత అచ్చిరెడ్డి చూశారు. వెంటనే ఆ సినిమాలో వేషం ఇచ్చారు. ఆ సినిమాకు నాకు ఇచ్చిన పారితోషకం రూ.70వేలు. అదే పదిలక్షలుగా ఫీల్ అయ్యాను.
అగ్రహీరోలందరితోనూ నటించా
మొత్తం 586 సినిమాలలో నటించాను. చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్, పవన్‌కల్యాణ్, ఎన్‌టీఆర్, నితిన్...ఇలా అందరితోనూ నటించాను. సింహాద్రి, దిల్, సంప్రదాయం నాకు కమెడియన్‌గా మంచి పేరు తెచ్చాయి. చార్లీచాప్లిన్, రాజబాబు, బ్రహ్మనందం బాగా ఇష్టమైన హాస్యనటులు. ప్రస్తుతం నాగచైతన్యతో ఆటోనగర్ సూర్య, శ్రీను వైట్ల దర్శకత్వంలో మహేష్‌బాబు చిత్రం, అల్లరి నరేష్ లడ్డుబాబు, ఈ సత్తిబాబు దర్శకత్వంలో అల్లరినరేష్ నటిస్తున్న చిత్రం, నట్టికుమార్ దర్శకత్వంలో వస్తున్న యుద్ధం, చిరంజీవి మేనల్లుడు వరుణ్ తేజ్ హీరోగా వైవీఎస్ చౌదరి దర్శకత్వంలో వస్తున్న రే చిత్రం, శివాజీ హీరోగా వస్తున్న చిత్రాలకు క మిట్ అయ్యా. ఆడపిల్లలను వేధించే వారిని, హింసించేవారిని కఠినంగా శిక్షించాలని సత్యదేవుడిని వేడుకున్నా. కాగా.. సత్యదేవుని ఆలయం వద్ద వేణుమాధవ్ దంపతులకు ఆలయ ఏసీ ఈరంకి జగన్నాథరావు ఆధ్వర్యంలో పండితులు ఘనంగా స్వాగతం పలికారు.
Advertisement