వచ్చే ఏడాది చిన్మయితో నా పెళ్లి : రాహుల్
వచ్చే ఏడాది చిన్మయితో నా పెళ్లి : రాహుల్
Published Tue, Sep 17 2013 12:57 AM | Last Updated on Tue, Aug 28 2018 4:30 PM
తెరవెనుక మరో ప్రేమకథ విజయవంతమైంది. ‘అందాల రాక్షసి’ ఫేమ్ రాహుల్... గాయని, అనువాద కళాకారిణి చిన్మయి ప్రేమకు పెద్దలు పచ్చజెండా ఊపారు. వీరిద్దరి పెళ్లికి ఇరువైపుల పెద్దల అంగీకార ముద్ర లభించింది. ఈ సందర్భంగా రాహుల్‌తో ఫోన్‌లో ముచ్చటిస్తే, చిన్మయితో తన ప్రేమ గురించి, పెళ్లి విషయాల గురించి ప్రత్యేకంగా చెప్పుకొచ్చారు.
** కంగ్రాట్స్ రాహుల్... మీ ప్రేమకథను సక్సెస్ చేసుకున్నారు!
థ్యాంక్స్ అండీ.
** చిన్మయితో మీ తొలి పరిచయం ఎప్పుడు?
‘అందాల రాక్షసి’ స్క్రీనింగ్‌కి తను వచ్చింది. ఆ సినిమాలో హీరోయిన్ లావణ్య పాత్రకు తనే డబ్బింగ్ చెప్పింది. అప్పుడే తనతో నాకు పరిచయం ఏర్పడింది. అప్పటికే నేను తన వాయిస్‌కి వీరాభిమానిని. ‘ఏ మాయ చేశావె’లో సమంత పాత్రకు తను డబ్బింగ్ చెప్పిన తీరు చూసి ఫ్లాట్ అయిపోయాను. తను పాటలు కూడా బాగా పాడుతుంది.
** మీది లవ్ ఎట్ ఫస్ట్ సైటా?
కాదు. ముందు తన వాయిస్‌ని ఇష్టపడ్డాను. మా పరిచయం వృద్ధి చెందాక తనని ఇష్టపడ్డాను.
** చిన్మయిలో మీకు నచ్చిన అంశాలు?
ప్రధానంగా తన మనస్తత్వం. తనది చాలా ఓపెన్ మైండ్. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరితో ఒకేలా మాట్లాడుతుంది. ఎవరి గురించైనా వెంటనే ఒక నిర్ణయానికి రాదు. చాలా నిజాయితీగా ఉంటుంది. ఏ విషయాన్నీ మనసులో దాచుకోకుండా నాతో డిస్కస్ చేస్తుంది. చాలా మెచ్యూర్డ్‌గా ఆలోచిస్తుంది. చాలా తెలివైన అమ్మాయి. ఫెంటాస్టిక్ గాళ్. అందుకే నచ్చింది. నేను ఎలాంటి లక్షణాలున్న అమ్మాయిని భార్యగా కోరుకున్నానో, అవన్నీ తనలో పరిపూర్ణంగా ఉన్నాయి. తనే నా బెటర్‌హాఫ్.
** మీ ప్రేమని ఎప్పుడు సీరియస్‌గా తీసుకున్నారు?
మూడు నెలల క్రితమే ఇద్దరం ఓ నిర్ణయానికొచ్చాం. ప్రేమ గురించి, పెళ్లి గురించి అప్పుడే చర్చించుకున్నాం.
** పెద్దల్ని ఎలా ఒప్పించారు?
ఈ విషయంలో మేం పెద్దగా కష్టపడలేదు. మా ఇంట్లోవాళ్లు వెంటనే ఓకే చెప్పేశారు. మాది తమిళ కుటుంబం. చిన్మయి మదర్ తమిళియనే కానీ, ఫాదర్ మాత్రం తెలుగు.
** ఇంతకూ మీ పెళ్లెప్పుడు?
వచ్చే ఏడాది మార్చిలో ఉంటుంది. 2012... ‘అందాల రాక్షసి’ సినిమాతో హీరోగా బ్రేకొచ్చింది. 2013...
లవర్‌గా సక్సెసయ్యాను. 2014లో పెళ్లితో కొత్త జీవితం మొదలు పెట్టబోతున్నాను.
** పెళ్లి తర్వాత చిన్మయి తన కెరీర్‌ని కొనసాగిస్తారా?
పెళ్లికి, కెరీర్‌కి సంబంధం లేదు. ఇప్పుడు ఎలా కెరీర్ ఉందో, పెళ్లి తర్వాత కూడా అలాగే కొనసాగుతుంది.
** మరి మీ కెరీర్ ఎలా ఉంది?
రామానాయుడిగారి సంస్థలో ‘నేనేం చిన్నపిల్లనా’ చేశాను. వచ్చే వారమే ఆ సినిమా విడుదలవుతుంది. ఇంకొన్ని సినిమాలు చేతిలో ఉన్నాయి. నేనిక్కడ చాలా హ్యాపీ. అందుకే హైదరాబాద్‌కు షిఫ్ట్ అయిపోయాను కూడా!
Advertisement
Advertisement