బాహుబలి, రోబో 2లను మించిపోతుందా.. ?
తమిళ ఇళయదళపతి విజయ్కు భారీ ఆఫర్ వచ్చింది. సి సుందర్ దర్శకత్వంలో దేశంలోనే అత్యంత భారీ బడ్జెట్తో నిర్మించే సినిమాలో విజయ్ నటించనున్నట్టు సమాచారం. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటిన బాహుబలి, తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రతిష్టాత్మక చిత్రం రోబో 2 బడ్జెట్లను ఈ సినిమా దాటిపోతుందని సినీ వర్గాల టాక్. సి సుందర్-విజయ్ కాంబినేషన్లో రానున్న ఈ సినిమాను 350 కోట్ల రూపాయలకుపైగా బడ్జెట్తో నిర్మించనున్నారనే వార్త కోలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. ఈ హిస్టారికల్ ఫాంటసీ థ్రిల్లర్కు ఇంకా టైటిల్ను ఖరారు చేయలేదు.
శ్రీ తెనండల్ ఫిల్మ్స్ నిర్మించనున్న ఈ ప్రాజెక్టుకు దర్శకత్వం వహించేందుకు సి సుందర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమాలో మరో హీరో సూర్య నటించనున్నట్టు మొదట్లో వార్తలు వచ్చాయి. అయితే సూర్య వీటిని ఖండిస్తూ.. పా రంజిత్ దర్శకత్వంలో తన తర్వాతి సినిమా ఉంటుందని స్పష్టత ఇచ్చాడు. శ్రీ తెనండల్ ఫిల్మ్స్ నిర్మించే భారీ చిత్రంలో విజయ్ నటించనున్నట్టు తాజా సమాచారం. కాగా దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. విజయ్ ప్రస్తుతం భరతన్ దర్శకత్వం వహిస్తున్న సినిమాలో నటిస్తున్నాడు.