రూ.50 లక్షలు ఇస్తే నేను ఒకే!
నాలుగేళ్ల క్రితం దక్షిణాదిలో టాప్ కథానాయికల్లో ఒకరు ఇలియానా. ఇప్పుడు పారితోషికం ఇంతిస్తే చాలు అంటూ అవకాశాల కోసం దక్షిణాది దర్శక నిర్మాతలకు రాయబారం పంపుతున్నారనే ప్రచారం మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఒకప్పటి కథానాయికల పారితోషికాలు వేరు. ఇప్పటి నాయికల పారితోషికాలు బేజారు. కథానాయకుల పారితోషికాలకు దీటుగా నాయికలు పెంచేస్తున్నారు. ఇంతకు ముందు నాయికల పారితోషికాలు లక్షల్లోనే ఉండేవి. ఇప్పుడు కోట్లకు పెరిగిపోయాయి. కథానాయకులు 30 నుంచి 40 కోట్లకు పెంచేస్తే తామేమీ తక్కువ కాదన్నట్లు నాయికలు కోట్లకు పెంచేశారు.
ప్రముఖ కథానాయికలిప్పుడు కోటి నుంచి నాలుగు కోట్ల వరకూ పారితోషికాన్ని పుచ్చుకుంటున్నారు. వరుస విజయాలతో దూసుకుపోతున్న టాప్ హీరోయిన్ నయనతార ఇప్పటి వరకూ మూడు కోట్లు పారితోషికం వసూలు చేసేవారని, తాజాగా తెలుగులో చిరంజీవికి జంటగా నటించడానికి నాలుగు కోట్లు డిమాండ్ చేసినట్లు ప్రచారం హోరెత్తుతోంది. ఇక గోవా సుందరి ఇలియానా నాలుగేళ్ల క్రితమే కోటికి పైగా పారితోషికం పుచ్చుకుని దక్షిణాదిలో అగ్రకథానాయిల పట్టికలో చేరారు.
అయితే అంతకంటే అధిక పారితోషికం ఆశిస్తూ, మరింత పాపులారిటీని కోరుకుంటూ తెలుగు,తమిళ భాషల్లో అవకాశాలు తలుపుతడుతున్నా కాదని బాలీవుడ్‌లో మకాం వేశారు.అక్కడ తొలిరోజుల్లో పరిస్థితి ఆశాజనకంగా ఉన్నా రానురానూ అది మిథ్యగా మారింది. నాలుగేళ్లలో ఇలియానా ఐదు హిందీ చిత్రాలు మాత్రమే చేయగలిగింది.ప్రస్తుతం అవకాశాలు నిల్. దీంతో పీచేముడ్ అంటూ ఇప్పుడు తమిళం, తెలుగు భాషల్లో అవకాశాలు వెతుక్కునే పనిలో పడ్డారని సమాచారం.
ఇందుకు తన పారితోషికంలో కూడా రిబేట్ ఇచ్చేయడానికి సిద్ధమయ్యారట. రూ.50 లక్షలు పారితోషికం ఇస్తే చాలు అంటూ తమిళ, తెలుగు దర్శక నిర్మాతలకు రాయబారం పంపుతున్నారని సమాచారం. దీంతో కొందరు దర్శకనిర్మాతలు ఆమెను తమ చిత్రాల్లో ఎంపిక చేసే విషయమై చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. తమిళంలో నన్భన్ చిత్రం తరువాత కొన్ని భారీ అవకాశాలు వచ్చినా ఇలియానా అప్పట్లో నటించడానికి అంగీకరించలేదన్న ప్రచారం జరిగిందన్నది గమనార్హం.