కల్యాణ్ దేవ్
‘విజేత’ (2018) సినిమాతో హీరోగా తెలుగు పరిశ్రమకు పరిచయం అయ్యారు చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్ దేవ్. ప్రస్తుతం పులి వాసు దర్శకత్వంలో ‘సూపర్ మచ్చి’ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నారు. కరోనా ప్రభావం తగ్గకపోయినప్పటికీ కల్యాణ్ దేవ్ ‘సూపర్ మచ్చీ’ షూటింగ్‌లో పాల్గొన్నారు. సెట్‌లో తీసుకున్న కరోనా జాగ్రత్తలు, ‘సూపర్ మచ్చీ’ గురించిన విశేషాలను కల్యాణ్ దేవ్ ఈ విధంగా చెప్పారు.
► షూటింగ్ అంటేనే అందరం దగ్గర దగ్గరగా ఉంటూ మాట్లాడుకుంటూ చేసుకునే పని. అలా కాకుండా దూరం దూరంగా ఉంటూ మాస్క్‌లు ధరించి షూటింగ్ చేయడం కొత్తగా ఉంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ పనిలో లీనమైనప్పుడు కరోనా నియమాలను మర్చిపోయే అవకాశం ఉంది. అలా మర్చిపోతున్నాం అనుకున్నప్పుడల్లా సెట్‌లో ‘కరోనా కరోనా’ అనుకున్నాం. ఫన్నీగా ఉన్నా.. ఇలా ‘కరోనా జపం’ చేయడం వల్ల అందరూ అలర్ట్‌గా ఉండేవాళ్లం. వాసుగారు కూడా ‘ఇప్పుడు సెట్‌లోకి పోలీసులు వస్తారు. చెక్ చేస్తారు. అందరూ కరోనా జాగ్రత్తలను పాటించండి’ అని అలర్ట్ చేసేవారు. భౌతిక దూరం పాటించాలి కాబట్టి ఏవైనా సీన్స్‌లో సందేహాలు ఉంటే గట్టిగా మాట్లాడుకుని నివృత్తి చేసుకున్నాం.
► ‘సూపర్ మచ్చి’లో బయటకు రఫ్‌గా ఉంటూ లోపల సెన్సిటివ్‌గా ఉండి ఓ చిన్న బార్‌లో పని చేసే మాస్ సింగర్ పాత్రలో నటిస్తున్నాను. ఈ సినిమా షూటింగ్ పూర్తి కాలేదు. ఒక పాట, రెండు రోజుల టాకీపార్టు బ్యాలెన్స్ ఉంది. ఇప్పుడు లాక్‌డౌన్ అంటున్నారు. లొకేషన్ల పర్మిషన్స్ కూడా ఇబ్బందిగా ఉన్నాయి. పైగా షూటింగ్‌లో జాయిన్ కావడానికి అందరూ ధైర్యం చేయడం లేదు. అందుకే మిగిలిన ఆర్టిస్టులు, వారి కాల్షీట్లు వంటి వాటిని పరిశీలించుకుని ఆ తర్వాత మళ్లీ షూటింగ్ మొదలు పెట్టాలనుకుంటున్నాం. నిర్మాతల ఇబ్బందులను మనం అర్థం చేసుకోవాలి. నేను ఇంత ధైర్యంగా షూటింగ్‌లో పాల్గొనడానికి మా సినిమా నిర్మాతలు ముఖ్య కారణం. వారికి ఆర్థికపరమైన సమస్యలు రాకూడదని భావించాను.
► నా ఫ్యామిలీ సపోర్ట్ చేయడంవల్లే కరోనా ప్రభావం ఉన్న ఈ పరిస్థితుల్లో కూడా నేను షూటింగ్‌లో పాల్గొనగలిగాను. నేను షూటింగ్‌లో జాయిన్ అవ్వడం గురించి మామయ్యగారి (నటుడు చిరంజీవి)తో మాట్లాడాను. ‘ఎవరో ఒకరు ఎప్పుడో ఒకప్పుడు స్టార్ట్ చేయాలి కదా. నీకు ఓకే అనుకుంటే షూటింగ్‌కి వెళ్లు’ అన్నారు. అలాగే ఏయే జాగ్రత్తలు తీసుకోవాలో మామయ్య చెప్పారు. షూటింగ్ అంటే హెయిర్ స్టయిలిస్ట్‌లు, మేకప్‌మేన్ మన దగ్గరకు వస్తూనే ఉంటారు. వాళ్లు పీపీఈ సూట్స్ ధరించేలా జాగ్రత్తలు తీసుకున్నాం.
► సాధారణంగానే నేను ఆరోగ్య నియమాలను క్రమశిక్షణగా పాటిస్తుంటాను. నిజానికి షూటింగ్ ఆరంభం కాకముందే నా అంతట నేనే కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నాను. బయటికి వెళ్లి షూటింగ్ చేస్తాం కాబట్టి మనంతట మనమే సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉండాలని డిసైడ్ అయ్యాను. ఒక ప్రత్యేక గదిలో ఉంటూ ప్రస్తుతం నా పనులన్నీ నేనే చేసుకుంటున్నాను. టైమ్‌పాస్ కోసం బుక్స్, ఇంటర్‌నెట్ సౌకర్యాలను ఏర్పాటు చేసుకున్నాను. షూటింగ్‌కి వెళ్లడం మొదలుపెట్టాక నా పిల్లలకు దూరంగా ఉంటున్నాను. నాకది నిజమైన సవాల్. ఆదివారం మా ఫస్ట్ డాటర్ బర్త్‌డే. నేను ఇంట్లోనే ఉంటూ ఆ బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో పాల్గొనలేకపోవడం బాధగా ఉంది.
► శ్రీధర్ శ్రీపానగారితో ఓ సినిమా చేయాల్సి ఉంది. మరో మూడు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. త్వరలో ఆ వివరాలు చెబుతాను.
► సాధారణంగా నా సినిమాల గురించి మామయ్యతో చర్చిస్తుంటాను. మామయ్యకు తీరిక ఉన్నప్పుడు నా సినిమాల గురించి మాట్లాడుకుంటాం. ఆయనకు ఉన్న అనుభవంతో కొన్ని సలహాలు చెబుతారు. అయితే ‘సూపర్ మచ్చి’ స్క్రిప్ట్‌ను మామయ్యగారు వినలేదు.
Comments
Please login to add a commentAdd a comment