
కన్నడ హీరో, యాక్షన్ కింగ్ అర్జున్ బంధువు చిరంజీవి సర్జ
తమిళసినిమా: నటుల వారసులు, బంధువులు సినీ రంగప్రవేశం చేయడం కొత్తేమీ కాదు. అలా తమ ప్రతిభను నిరూపించుకున్న వారు చాలా మందే ఉన్నారు. తాజాగా యాక్షన్‌కింగ్‌గా ముద్రవేసుకున్న నటుడు అర్జున్ బంధువు చిరంజీవి సార్జా ఇప్పుడు హీరోగా కోలీవుడ్‌కు రావడానికి సిద్ధం అవుతున్నారు. ఈయన నటిస్తున్న చిత్రానికి సీజర్ అనే టైటిల్‌ను నిర్ణయించారు. పరూల్ యాదవ్ హీరోయిన్‌గా నటిస్తున్న ఇందులో వి.రవిచందర్, ప్రకాశ్‌రాజ్, నాగినీడు ముఖ్యపాత్రలను పోషిస్తున్నారు.
ఈ సినిమాకు కథ, దర్శకత్వం బాధ్యతలను వినయ్‌కృష్ట నిర్వహిస్తున్నారు. చిత్ర వివరాలను ఈయన తెలుపుతూ ఇది ఒక నేరం నేపథ్యంలో సాగే యాక్షన్ థ్రిల్లర్ కథా చిత్రంగా ఉంటుందని చెప్పారు. కథ, కథనాలు జెట్ స్పీడ్‌లో సాగుతూ ఉత్కంఠతను రేకిస్తాయని తెలిపారు. తృతీ క్రియేషన్స్ పతాకంపై నిర్మాత త్రివిక్రమ్ సాఫల్య నిర్మిస్తున్న ఈ చిత్ర షూటింగ్‌ను బెంగళూర్, మైసూర్ ప్రాంతాల్లో చిత్రీకరించినట్లు చెప్పారు.
మరో ముఖ్య విషయం ఏమిటంటే ఈ చిత్ర తుది ఘట్ట సన్నివేశాలను శబరిమలైలో ఇంతవరకూ ఎవరికీ అనుమతించని ప్రాంతాల్లో చిత్రీకరించినట్లు తెలిపారు. ఇలా పలు విశేషాలతో, భారీ తారాగణంతో రూపొందిస్తున్న సీజర్ చిత్ర షూటింగ్ పూర్తి అయ్యిందని, ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని త్వరలోనే విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు దర్శకుడు చెప్పారు. సీజర్ చిత్రం తమిళ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగిస్తుందనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. దీనికి అంజి, రాజేశ్ కట్టాల ద్వయం ఛాయాగ్రహణం, శాంతన్‌శెట్టి సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్ర దర్శకుడు వినయ్‌కృష్ణ సహ నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారన్నది గమనార్హం.