
కొత్త సంవత్సరంలో కొరటాల శివ సినిమా
ప్రతిభ అనే పదానికి పర్యాయపదం తారక్. నూనూగు మీసాల ప్రాయంలోనే చిరంజీవి, బాలకృష్ణ లాంటి గ్రేటెస్ట్ మాస్ హీరోలు చేయాల్సిన పాత్రలను చేసేసి శభాష్ అనిపించుకున్నారాయన. అయితే... తారక్ టాలెంట్‌ని సరిగ్గా ఉపయోగించుకునే దర్శకులే ప్రస్తుతం కరువయ్యారు. కథ, కథనం, పాత్ర, దర్శకుడు.. ఇలా అన్నీ పర్‌ఫెక్ట్‌గా సెట్ అయితే... తెరపై తారక్ నట విశ్వరూపాన్నే చూడచ్చు. ఇందులో ఏ మాత్రం సందేహం లేదు. గత రెండేళ్ళ కాలంలో తారక్ నుంచి వచ్చిన సినిమాలు... గతంలో ఆయన చేసిన సినిమాల స్థాయిలో ఉండటంలేదన్నది పలువురి అభిప్రాయం.
ఆ మాటకొస్తే ప్రేక్షకాభిప్రాయం కూడా అదే. అందుకే... మాస్‌లో తారక్‌కు ఉన్న అనూహ్యమైన ఇమేజ్‌ని దృష్టిలో పెట్టుకొని అద్భుతమైన కథను తయారు చేశారు దర్శకుడు కొరటాల శివ. ‘మిర్చి’తో బాక్సాఫీస్‌కి ఘాటెక్కించిన శివ... తారక్‌ను ఆయుధంగా తీసుకొని ద్వితీయ విఘ్నాన్ని అధిగమించడానికి సమాయత్తమయ్యారు. వీరిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కబోతున్న చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మించబోతున్నారు. డిసెంబర్‌లో ఈ చిత్రం ముహూర్తం జరుపుకోబోతోంది. కొత్త సంవత్సరంలో చిత్రీకరణ మొదలుకానుంది. ఎన్టీఆర్ గత విజయాలకు దీటుగా అత్యంత శక్తిమంతంగా ఈ చిత్ర కథా కథనాలు ఉంటాయని సమాచారం. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి స్వరాలందించనున్నారు. ఇంకా ఈ సినిమాలో నటించే కథానాయిక, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు తెలియాల్సి ఉంది.