లక్కీ హీరోయిన్ కీర్తీసురేశ్
ఒకప్పటి పరిస్థితి ఏమో గానీ ప్రస్తుతం అధిక శాతం కథానాయికలు గ్లామర్‌నే నమ్ముకుంటున్నారన్నది నిజం. అలాగని అందర్నీ ఒకే గాడి కిందకు చేర్చలేం. నటి లక్ష్మీమీనన్, శ్రీదివ్య వంటి హీరోయిన్లు కొందరు అభినయంతోనే పేరు తెచ్చుకున్నారు. నిజం చెప్పాలంటే వీరి ఎలాంటి సినీ నేపథ్యం లేని కుటుంబాల నుంచి వచ్చిన వారే. అయితే కొందరు పెద్ద సినీ కుటుంబం నుంచి వచ్చినా రాణించలేరు. కానీ నటి కీర్తీసురేశ్ సినీ నేపథ్య కుటుంబం నుంచి వచ్చినా తన కంటూ గుర్తింపును సంపాదించుకుంటున్నారు. ఈమె సీనియర్ నటి మేనక వారసురాలన్న విషయం తెలిసిందే. మొదట్లో మాతృభాష మలయాళ చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టినా ఆ తరువాత తమిళ చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు.
ఇక్కడ తొలి చిత్ర రజనీ మురుగన్ అయినా మొదట తెరపైకి వచ్చింది ఇదు ఎన్న మాయం చిత్రం. ఈ చిత్రం ఆశించిన విజయం సాధించకపోయినా తొలుత అంగీకరించిన రజనీమురుగన్ మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటు కీర్తీసురేశ్‌కు మంచి పేరు సంపాదించింది. దీంతో అమ్మడికి అదృష్టం పట్టుకుంది. ధనుష్‌తో జతకట్టే అవకాశాన్ని దక్కించుకున్నారు. తొడరి పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది.
మూడో చిత్రంతోనే కీర్తీసురేశ్‌ను అగ్రనటుడు ఇళయదళపతి విజయ్‌కు జంటగా నటించే అవకాశం వరించింది. మరి ఈ బ్యూటీ లక్కీ హీరోయిన్‌నే కదా, అయితే మలయాళం మాతృభాష అయిన కీర్తీసురేశ్ తమిళ భాషను సరళంగా మాట్లాడగలరు. దీంతో ఈ రెండు భాషల్లోనూ తన పాత్రలకు తాను డబ్బింగ్ చెప్పుకుంటున్నారట. ఇక కీర్తీ తెలుగులోను నేను శైలజ చిత్రంలో నటించి ఆ చిత్ర విజయంతో అక్కడ అభిమానులను సంపాదించుకున్నారన్నది గమనార్హం. అలా అతి తక్కువ కాలంలోనే కీర్తీ త్రిభాషా నటిగా ఎదగడం అరుదైన విషయమనే చెప్పాలి.