వరుణ్ తేజ్, వెంకటేశ్వరరావు, తబిత, సుకుమార్, రవి శంకర్, బుచ్చిబాబు, మనీషా, వైష్ణవ్, చిరంజీవి, అల్లు అరవింద్, అల్లు అర్జున్, నవీన్, నాగబాబు, సాయిధరమ్
చిరంజీవి కుటుంబం నుంచి మరో హీరో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నారు. చిరంజీవి మేనల్లుడు, సాయిదరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్‌లు నిర్మించనున్న ఈ చిత్రాన్ని సుకుమార్ అసిస్టెంట్ బుచ్చిబాబు సన దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రం ప్రారంభోత్సవం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో హీరో హీరోయిన్స్ వైష్ణవ్ తేజ్, మనీషా రాజ్‌లపై తీసిన ముహూర్తపు సన్నివేశానికి అల్లు అరవింద్ కెమెరా స్విచ్చాన్ చేయగా, చిరంజీవి క్లాప్ ఇచ్చారు.
నాగబాబు, అల్లు అర్జున్ స్క్రిప్ట్‌ను టీమ్‌కు అందించారు. ఈ సినిమా షూటింగ్ మార్చి మొదటి వారం నుంచి స్టార్ట్ కానుంది. ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న చిరంజీవి మాట్లాడుతూ – ‘‘మైత్రీ మూవీస్ గురించి, ఆ సంస్థ అందించిన విజయాల గురించి అందరికీ తెలిసిందే. సుకుమార్ రైటింగ్స్ ద్వారా కొత్తవాళ్లను ప్రోత్సహిస్తున్నందుకు సుకుమార్‌ని అభినందిస్తున్నాను. ‘రంగస్థలం’ సినిమాతో సుకుమార్, మైత్రీ వాళ్లతో నాకు అనుబంధం ఏర్పడింది.
వైష్ణవ్‌కి ఇంత మంచి అవకాశం రావడం అదృష్టం. ఈ అవకాశాన్ని వైష్ణవ్ సద్వినియోగం చేసుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. బుచ్చిబాబు కొత్త కథ రాశాడు. ‘రంగస్థలం’ కథా చర్చల్లో బుచ్చిబాబు పాత్ర ఎంతో ఉందని సుకుమార్ నాతో చెప్పారు’’ అన్నారు. ‘‘ఈ ప్రాజెక్ట్‌లో సుకుమార్ కూడా భాగమైనప్పుడు ఈ సినిమా డిఫరెంట్‌గా ఉంటుందనుకున్నాను. వైష్ణవ్, మనీషాకు నా అభినందనలు. దర్శకుడు అడిగిందల్లా ఇచ్చే నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్.
దేవిశ్రీ కూడా తోడై ఈ సినిమా స్టామినా పెంచేశారు’’ అన్నారు అల్లు అరవింద్. ‘‘బుచ్చిబాబు అద్భుతమైన కథ రాశాడు. నా శిష్యుడు ఈ సినిమా చేస్తున్నందుకు గర్వంగా ఉంది. వైష్ణవ్ కోసమే ఈ కథ పుట్టింది. కథ రాస్తున్నప్పుడే వైష్ణవ్ హీరో అని ఫిక్స్ అయ్యాడు బుచ్చి. మైత్రీ వాళ్లకు థ్యాంక్స్. పెద్ద సినిమాలు నిర్మిస్తూ, చిన్న సినిమాలనూ నిర్మించడం వారికే సొంతం. దేవిశ్రీ ప్రసాద్‌కు థ్యాంక్స్. వైష్ణవ్‌కి మంచి భవిష్యతు ఉంది. కథ ఇంత బాగా రావడానికి కారణం చిరంజీవిగారే.
ఆయన చాలా ఇన్‌ఫుట్స్ ఇచ్చారు’’ అన్నారు సుకుమార్. ‘‘కథ చాలా అద్భుతంగా వచ్చింది. హీరో, హీరోయిన్ సినిమాకు సరిగ్గా సరిపోయారు’’ అన్నారు నిర్మాత నవీన్ యర్నేని. ‘‘సుకుమార్‌గారికి థ్యాంక్స్ అని చెప్పడం చిన్న పదం అయిపోతుంది. నన్ను నమ్మిన అమ్మా నాన్నలకు, చిరంజీవిగారికి థ్యాంక్స్. ఈ సినిమా కొత్తగా ఉంటుంది. నిర్మాతలకు, దేవిశ్రీ ప్రసాద్‌గారికి థ్యాంక్స్’’ అన్నారు దర్శకుడు బుచ్చిబాబు. ఈ కార్యక్రమంలో సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్, నిహారికా, దేవిశ్రీ ప్రసాద్, వైష్ణవ్ తేజ్ తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment