
టామ్ క్రూయిజ్, ఫాల్ ఔట్‌లో ఓ దృశ్యం
ఆగస్టు నెల. 2017. ‘మిషన్ ఇంపాజిబుల్ 6’ షూటింగ్ జరుగుతోంది. టామ్ క్రూయిజ్ ఒక బిల్డింగ్ మీద నుంచి పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. ఆ యాక్షన్ సీన్‌కు అనుగుణంగా ఆయనకు వైర్లు కట్టి ఉంచారు. పరిగెత్తుకుంటూ వచ్చి క్రూయిజ్ ఒక బిల్డింగ్ మీది నుంచి ఇంకో బిల్డింగ్ మీదకు దూకాలి. క్రూయిజ్ పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. ఒక్క ఉదుటున గాల్లో ఎగిరి పక్క బిల్డింగ్ మీద లాండ్ అవ్వబోతున్నాడు. చిన్న గ్యాప్. అంతే పక్క బిల్డింగ్ మీద ల్యాండ్ అవ్వాల్సిన వాడు కాస్తా ఆ గోడకు గట్టిగా గుద్దుకున్నాడు. ముందు పాదం గట్టిగా గోడను తాకింది. ఆ తర్వాత బాడీ కూడా. చుట్టూ కెమేరాలున్నాయి.
వైర్లతో కట్టి ఉంచారు కాబట్టి క్రూయిజ్ కిందపడడు. అలాగే అంత పెద్ద దెబ్బ తగిలినా వెంటనే లేచి, ఆ బిల్డింగ్‌పైకి అడుగుపెట్టి మళ్లీ పరిగెడుతూ ఆ సీన్ పూర్తి చేశాడు క్రూయిజ్. అప్పటికే చీలమండకు పెద్ద గాయమైంది. ఈ సీన్ అయితే పూర్తి చేశాడు కానీ, ఆ తర్వాత కొంతకాలం పాటు షూటింగ్ అంతా పక్కన పెట్టాల్సినంత పరిస్థితి వచ్చింది. ఇప్పుడిప్పుడే మళ్లీ కోలుకోవడంతో షూట్ మళ్లీ మొదలుపెట్టారు. జూలై 27న ఎలాగైనా సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు టీమ్ పనులన్నీ వేగవంతం చేసింది.
ఈ సంఘటన జరిగి ఇన్ని నెలలయ్యాక టామ్ క్రూయిజ్, ఆ వీడియోను విడుదల చేస్తూ అసలు విషయం చెప్పుకొచ్చాడు. ఈ సందర్భంగానే సినిమాకు ‘మిషన్ ఇంపాజిబుల్ : ఫాల్ ఔట్’ అన్న పేరును ఖరారు చేసినట్టు తెలిపాడు. అంతపెద్ద దెబ్బ తగిలినా, తన పనిపట్ల టామ్ క్రూయిజ్ చూపించిన డెడికేషన్‌కు ఫ్యాన్స్ అయితే ఫిదా అయిపోయారు. ‘ఇది చిన్న విషయమేలే!’ అన్నట్టు క్రూయిజ్ నవ్వి ఊరుకుంటున్నాడు కానీ, ఆయన వయసు ఇప్పుడు 55! ఇదేం చిన్న విషయమైతే కాదు!!
Comments
Please login to add a commentAdd a comment