జల్లికట్టుకు నేను సైతం..
జల్లికట్టు పోరాటంలో ఎప్పుడైతే యువత పాల్గొందో అప్పటి నుంచి విశ్వరూపం దాల్చిందనే చెప్పాలి. రెండేళ్లుగా తమిళ సంఘాలు, రాజకీయనాయకులు జల్లికట్టు కోసం గొంతు విప్పినా, పెద్దగా ప్రభావం చూపలేదు. అలాంటిది సమీపకాలంలో రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులతో కలిసి యువత జల్లికట్టు కోసం నడుంబిగించిందో అప్పటి నుంచి జల్లికట్టు పోరాట ముఖ చిత్రమే మారిపోయింది. విశేషం ఏమిటంటే ఇప్పటి వరకూ మనకెందుకులే వివాదం అంటూ ముఖం చాటేసిన తమిళ చిత్రపరిశ్రమ వర్గాలు జల్లికట్టు కోసం ఘోషిస్తున్నాయి. అయినా ఇప్పటికీ కొందరు కప్ప చావకూడదు, కర్ర విరగ కూడదు అన్న చందంగా ప్రవర్తిస్తున్నారని చెప్పవచ్చు. ఇక ఆచితూచి అడుగేసే నటుడు విజయ్ మంగళవారం ఎట్టకేలకు తన మౌన ముద్రను వీడి జల్లికట్టుకు వంత పాడారు. పెటాను మన ఊరు నుంచి తరిమి కొడదాం అని స్టేట్‌మెంట్ ఇచ్చారు. అంతకు ముందే రజనీకాంత్, కమలహాసన్, సూర్య, కార్తీ, విశాల్ జల్లికట్టుకు మద్దతు పలికారన్నది తెలిసిన విషయమే. తాజాగా దక్షిణాదిలో అగ్ర నటిగా రాణిస్తున్న నటి నయనతార జల్లికట్టుకు తాను సైతం అంటూ అందుకోసం పోరాడుతున్న యువతకు మద్దతు పలికారు. బుధవారం నయనతార విడుదల చేసిన ఒక ప్రకటనలో ఎమన్నారో చూద్దాం.
యువతరం బలం మరోసారి నిరూపణ అయ్యింది. సమీప కాలంలో తమిళనాడు చరిత్రలో ఇంతకు ముందెప్పుడూ లేని విధంగా ఒక విప్లవం రగులుతుందని చెప్పవచ్చు. ఇలాంటి పరిస్థితి చూస్తుంటే ఇక్కడ పుట్టకపోయినా, ఆలోచన, అనుబంధాల పరంగా నేనూ ఈ రాష్ట్రానికి చెందిన అమ్మాయిననే భావంతో గర్వంగా తలెత్తుకునేలా చేసింది. జల్లికట్టు కోసం యువత శాంతియుతంగా పోరాటం చేయడం మరింత ఘనతను చాటుతోంది. నేనిక్కడ పుట్టకపోయినా, నాకు గుర్తింపును ఇచ్చింది తమిళప్రజలే. అలాంటి వారి ఈ భావోద్రేక పోరాటానికి నేనూ అండగా నిలబడతాను. మన సంస్కృతి, సంప్రదాయాలు తెలి యని వారి అసత్య వాదనను నమ్మిన న్యాయ, ప్రభుత్వ రంగాలకు మన గొంతు వినిపిస్తుందని నమ్ముతున్నాను. జల్లికట్టు కోసం భావోద్రేక పోరాటం చేస్తున్న తమిళుల గొంతు ప్రపంచానికి వినిపిస్తుందని నమ్ముతున్నాను. తమిళనాడు ప్రజలు ఎలాంటి ఆటంకాలు ఎదురైనా ఎదురొడ్డి నిలిచి లక్ష్యం కోసం పోరాడుతున్నారు. ఒక పౌరురాలిగా వారి సమైక్యత, ధైర్యానికి శిరసు వంచి ప్రణమిల్లుతున్నాను. వారి ప్రయత్నం ఎలాంటి జాప్యం లేకుండా ఫలిస్తుందని నమ్ముతున్నాను. అని పేర్కొన్నారు.