ఆ సినిమాలో ఎన్ని ముద్దులున్నా బాధలేదు
ముంబై: కేంద్ర సెన్సార్ బోర్డు (సీబీఎఫ్సీ) చైర‍్మన్ పహ్లాజ్ నిహలానీ బాలీవుడ్ దర్శక, నిర్మాత విక్రమ్ భట్పై విరుచుకుపడ్డారు. బాలీవుడ్లో భట్ క్యాంప్ వారి సినిమాల విడుదలకు ముందు సెన్సార్ బోర్డుపై విమర్శలు చేయడం పబ్లిసిటీ కోసమేనని విమర్శించారు. విక్రమ్ భట్ సినిమాలో ఎన్ని ముద్దు సన్నివేశాలున్నా, లేకున్నా తనకు బాధలేదంటూ నిహలానీ ఘాటైన వ్యాఖ్యలు చేశారు.
తన తాజా హర్రర్ మూవీలో ఎఫ్ పదం వాడటాన్ని 32 నుంచి 16 సార్లుకు తగ్గించాలని సెన్సార్ బోర్డు సూచించిందని ఇటీవల విక్రమ్ భట్ చెప్పాడు. అంతేగాక ఈ సినిమా ట్రైలర్కు థియేటర్లలో ప్రదర్శించడానికి యూ/ఏ, టీవీల కోసం ఏ సర్టిఫికెట్ ఇచ్చారని విమర్శించాడు. నిహలానీ ఈ వ్యాఖ్యలపై స్పందిస్తూ విక్రమ్ భట్ సహా భట్ క్యాంప్ సినిమా విడుదలకు ముందు పబ్లిసిటీ కోసం సెన్సార్ బోర్డును, తనను టార్గెట్ చేస్తున్నారని చెప్పారు. వాళ్లకు సెన్సార్ బోర్డు మార్కెటింగ్ సాధనంగా మారిందని, ముఖ్యంగా సినిమా విడుదలకు ముందు ప్రేక్షకుల్లో ఆసక్తిలేకపోతే కావాలనే విమర్శలు చేస్తారని మండిపడ్డారు. భట్ క్యాంప్నకు కానీ ఇతరులకు కానీ సెన్సార్ బోర్డు ఉచిత పబ్లిసిటీ ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించారు. మొదట సెన్సార్ బోర్డుపై విమర్శలు చేసి, తర్వాత మమ్మల్ని రెచ్చగొట్టాలని చూస్తారని నిహలానీ విమర్శించారు.