సాక్షి,న్యూఢిల్లీ: సంజయ్ లీలా భన్సాలీ చెక్కిన చారిత్రక దృశ్యకావ్యం పద్మావతి ప్రకంపనలు కొనసాగుతున్నాయి. సినిమాకు సీబీఎఫ్‌సీ సర్టిఫికేషన్ నిలిచిపోయిన క్రమంలో పాలక రాజస్ధాన్, యూపీ, గుజరాత్ బీజేపీ సర్కార్‌ల తీరుపై బాలీవుడ్ ప్రముఖులు మండిపడుతున్నారు. బీజేపీ ప్రభుత్వాలే పద్మావతి చిత్ర విడుదలలో జాప్యానికి కారణమని నటి, సామాజిక కార్యకర్త షబనా అజ్మీ ఆరోపించారు. పద్మావతి విషయంలో చిత్ర పరిశ్రమ ఏకతాటిపై నిలిచి గోవాలో సోమవారం ప్రారంభమవుతున్న అంతర్జాతీయ చలన చిత్రోత్సవాన్ని బహిష్కరించాలని పిలుపు ఇచ్చారు.
పద్మావతి మూవీపై రగడ జరుగుతుంటే రాజస్ధాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజె మౌన ప్రేక్షకురాలిలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. పద్మావతి మూవీని విడుదల చేస్తే హింసకు దిగుతామని హెచ్చరించిన వారిపై ఎలాంటి చర్యలూ చేపట్టలేదని ఆరోపించారు. రాష్ట్రంలో అసాంఘిక శక్తులను ఏరివేస్తామని ప్రకటించిన యూపీ ప్రభుత్వం శాంతిభద్రతల పేరుతో డిసెంబర్ 1న సినిమా విడుదలకు మోకాలడ్డుతోందని విమర్శించారు.పద్మావతి మూవీని కొన్ని లాంఛనాలు పూర్తికాలేదనే సాకుతో సీబీఎఫ్‌సీ తిప్పిపంపడాన్ని షబనా అజ్మీ తప్పుపట్టారు. దీనివెనుక గుజరాత్ ఎన్నికల్లో ఓట్లు దండుకునే రాజకీయం దాగున్నదన్నారు.
మరోవైపు రాజ్‌పుట్‌ల ప్రాబల్యం కలిగిన రాజస్ధాన్‌లో పద్మావతి మూవీపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ పెద్ద ఎత్తున ఆందోళనలు చోటుచేసుకుంటున్న విషయం తెలిసిందే. పద్మావతి మూవీలో ఏ వర్గం వారినీ కించపరిచే సన్నివేశాలు లేకుండా మార్పులు చేసేంతవరకూ సినిమా విడుదల చేయరాదని రాజస్ధాన్ సీఎం వసుంధరా రాజే కేంద్రాన్ని కోరారు. చరిత్రకారులు, సినీ వర్గాలు, రాజ్‌పుట్ ప్రతినిధులతో కూడిన ప్రత్యేక కమిటీతో చిత్ర కథ గురించి చర్చించిన తర్వాతే సినిమాను విడుదల చేయాలని, అప్పటివరకూ విడుదల వాయిదా వేయాలని కేంద్ర సమాచార ప్రసార మంత్రి స్మృతీ ఇరానీకి వసుంధర రాజే లేఖ రాశారు.
Comments
Please login to add a commentAdd a comment