మంటలు చల్లారడం లేదు!
ఏ ముహూర్తాన ‘రాణీ పద్మావతి’ సినిమాని ప్రారంభించారో గానీ... ఎక్కడికక్కడ ఏవో చిక్కులు తప్పడం లేదు. చిత్రీకరణ సజావుగా సాగడం లేదు. పద్మావతిపై చెలరేగిన మంటలు ఇప్పట్లో చల్లారేట్లు కనిపించడం లేదు. పద్మావతి చరిత్రను వక్రీకరిస్తున్నారంటూ... జైపూర్‌లో షూటింగ్ చేస్తున్నప్పుడు దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీపై కొందరు దాడి చేశారు. అప్పుడు హిందీ ప్రముఖులందరూ ముక్త కంఠంతో సంజయ్‌పై దాడిని ఖండించారు.
ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. ఆ మంటలు చల్లారకముందే ‘రాణీ పద్మావతి’ సెట్‌లో మరో ఘటన చోటు చేసుకుంది. ఈసారి కొల్హాపూర్‌లోని షూటింగ్ సెట్‌లో చొరబడిన కొందరు వ్యక్తులు కాస్ట్యూమ్స్‌ను తగలబెట్టేశారు. తెల్లవారుజామున ఈ ఘటన జరగడంతో సెట్‌లో మంటలు చెలరేగే వరకూ ఎవరూ గమనించలేదట! అదృష్టవశాత్తూ... ప్రాణనష్టం, ఆస్తినష్టం జరగలేదు.
కానీ, జూనియర్ ఆర్టిస్టుల కాస్ట్యూమ్స్ మాత్రం పూర్తిగా నాశనమయ్యాయి. ఘటన జరిగిన సమయంలో పద్మావతిగా నటిస్తున్న దీపికా పదుకొనే గానీ... హీరోలు షాహిద్ కపూర్, రణవీర్ సింగ్‌లు గానీ సెట్‌లో లేరు. ఈ ఘటనపై భన్సాలీ ప్రొడక్షన్స్ సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సినిమా పూర్తయ్యేలోపు ఇంకెన్ని ఘటనలు చోటు చేసుకుంటాయో!