
బాలీవుడ్ నటుడు, దర్శకనిర్మాత రిషి కపూర్ అకాల మరణం పట్ల సినీ హీరో పవన్ కల్యాణ్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ‘దిగ్గజ నటుడు రిషి కపూర్ ఆకస్మిక మరణం నన్ను ఎంతగానో కలచివేసింది. ఆయన మరణం భారతీయ సినిమాకు తీవ్ర నష్టం. రిషి కపూర్ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా’ అంటూ పవన్ ట్వీట్ చేశారు.
‘రిషి కపూర్.. సినీవినీలాకాశంలో తళుక్కుమని మెరిసిన సంచలన తార. ఆ తార ఇప్పుడు కనుమరుగైపోయారని తెలిసి చాలా బాధనిపించింది. రిషి కపూర్ మరణంతో భారతీయ చిత్ర పరిశ్రమ ఒక ఆణిముత్యాన్ని కోల్పోయింది. ఆయన మృతి చిత్ర పరిశ్రమకు తీరని లోటు. సినిమా యవనికపై ఆయన ఒక సంచలనం. తొలి సినిమాతోనే ఆగ్రస్థాయి నాయకునిగా ఆగ్రపథానికి చేరుకున్న ఆయన ఎందరో ఔత్సాహిక కథానాయకులకు స్పూర్తిగా నిలిచారు. తండ్రి రాజ్ కపూర్‌తో పాటు కపూర్ కుటుంబంలో అప్పటికే ఎందరో హీరోలు, గొప్ప నటులు ఉన్నప్పటికీ తనకంటూ ఒక ప్రత్యేక స్టైల్‌ను సృష్టించుకున్నారు. 70వ దశకంలో బాబీ సినిమా ద్వారా హీరోగా తెరంగేట్రం చేసి యువతను తనదైన మాయలో ముంచేశారు.
ఆ రోజుల్లో ఆయన స్టైల్‌ను అనుసరించని యువకులు ఉండరని చెప్పడం అతిశయోక్తికాదు. నటన, నాట్యం, ఆహార్యం, ప్రతీ అంశంలోనూ ఆయన తనదైన ముద్రను బలంగా వేశారు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలను భారతీయ సినీ ప్రేక్షకులకు అందించారు. ఒక గొప్ప నటుడు ఇర్ఫాన్ ఖాన్ మరణించి ఒక్క రోజు కూడా గడవకముందే రిషి కపూర్ మరణ వార్త వినవలసి రావడం దురదృష్టకరం. రిషి కపూర్‌కు భారమైన హృదయంలో కళాంజలి ఘటిస్తున్నా. ఆయన సతీమణి నీతూ కపూర్, కుమారుడు రణబీర్ కపూర్ ఇతర కుటుంబసభ్యులకు ఈ విషాద ఘటనను తట్టుకునే మనోధైర్యాన్ని ఆ భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటున్నాను’అంటూ మరో ప్రకటనలో పవన్‌కల్యాణ్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.
గత కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న రిషి కపూర్ ఈరోజు తుదిశ్వాస విడిచారు. మరణ వార్త తెలిసి బాలీవుడ్, టాలీవుడ్ లోని పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేస్తున్నారు. 'మేరా నామ్ జోకర్' సినిమాతో బాలనటుడిగా తెరంగేట్రం చేశారు రిషి కపూర్. 1974 లో ఆయన నటించిన 'బాబీ' సినిమాకు గాను ఫిలిం ఫేర్ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నారు. ఇటీవల ముల్క్ అనే సినిమాలో నటించి మరోసారి తన దైన రీతిలో ఆకట్టుకున్నారు. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో ‘ది బాడీ’ అనే సినిమాలో, ఓ వెబ్ సిరీస్‌లో కూడా ఆయన నటించారు.
చదవండి:
‘ఈ దుర్వార్త బాధిస్తోంది! నమ్మలేకపోతున్నా’
‘నా ప్రేయసితో బ్రేకప్.. నీతూ సాయం కోరాను’
24 గంటల్లోనే ఇలా జరిగితే ఎలా.. ?