ఆ ఆదాయమే బాగుంది
నటి ప్రణీత బహుభాషా నటే. అయినా కథానాయకిగా ఏ రంగంలోనూ ఉన్నత స్థాయికి చేరుకోలేకపోయింది. తమిళం, తెలుగు, కన్నడం భాషల్లో నటిస్తున్నా అవకాశాలూ అంతంత మాత్ర మే. అయితే ఈ మూడు భాషల్లోనూ కథానా యకిగానే పరిచయమైంది. కోలీవుడ్‌లో ఉదయం చిత్రం ద్వారా అరుళ్‌నిధికి జంటగా పరిచయమైనా ఆ చిత్రం పెద్దగా గుర్తింపునివ్వలేదు. ఆ తరువాత కార్తీతో జతకట్టే లక్కీచాన్స్ అందుకుంది. అదీ అమ్మడికి నిరాశే మిగిల్చింది. ఇక ఈ తరువాత ఇక్కడ హీరోయిన్‌గా అవకాశాలే అందుకోలేకపోయింది.
ఆ మధ్య సూర్యకు జంటగా మాస్ అనే చిత్రంలో రెండో హీరోయిన్‌గా నటించినా ఉపయోగం లేకపోయింది. ఇటీవల జై హీరోగా నటించిన ఎనక్కు వాయ్‌ంద అడిమైగళ్ చిత్రంలో ప్రతినాయకిగా నటించింది. అదీ వర్కౌట్ కాలేదు. ఇక్కడే కాదు ఇతర భాషల్లోనూ ప్రణిత పరిస్థితి సేమ్ టు సేమ్. అయితే ఇప్పటికే వ్యాపారం రంగంలోకి దిగిన ఈ బ్యూటీ బెంగళూర్‌లో ఒక రెస్టారెంట్‌లో భాగస్వామిగా బాధ్యతలు నిర్వహిస్తోంది.
ఇక అవకాశాల కోసం నిరీక్షించడం అనవసరం అనుకుందేమో తాజాగా మోడలింగ్ రంగంలోకి రంగప్రవేశం చేయాలని నిర్ణయించుకుందట. ఇందుకు కారణాన్ని వెతుకున్న ప్రణీత ఆ రంగంలోనే ఆదాయం బాగుందని అంటోందట. సాధారణంగా హీరోయిన్లు మోడలింగ్ రంగం నుంచే సినీరంగానికి పరిచయం అవుతుంటారు. అలా మోడలింగ్ రంగం నుంచి మరోసారి సినీ ప్రముఖులను ఆకర్షించే ప్రయత్నం చేయాలనుకుంటుందనుకుంటా. ఈ అమ్మడు ఇప్పటికే పలు కమర్షియల్ యాడ్స్‌లో నటిస్తోందన్నది గమనార్హం.