పెరంబూరు: తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని ప్రముఖ నటుడు రజనీకాంత్ అన్నారు. కరోనా వైరస్ గురించి గత శనివారం ఆయన ట్వీట్ చేసిన తెలిసిందే. అయితే కొద్ది గంటల్లోనే రజనీ ట్వీట్‌ను.. ఏకంగా ట్విటరే తొలగించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రజనీకాంత్ వ్యాఖ్యలపై పెద్దఎత్తున విమర్శలు రావడం వల్లే ఆయన ట్వీట్‌ను తొలగించినట్లు ట్విటర్ వివరణ ఇచ్చింది. దీంతో నటుడు రజనీకాంత్ ఈ విషయమై సోమవారం స్పందించారు.
కరోనా వైరస్ కారణంగా ప్రజలు 12 నుంచి 14 గంటల వరకు బయటకు వెళ్లకుండా ఉంటే దాన్ని మూడో స్టేజ్‌కు వెళ్లకుండా అడ్డుకోవచ్చుననే తాను చెప్పానన్నారు. అయితే తన వ్యాఖ్యలను ఆ రోజు మాత్రమే చాలు అన్నట్లు తప్పుగా అర్థం చేసుకున్నారని వాపోయారు. అందుకే ట్విటర్ తన వ్యాఖ్యలను తొలగించిందని వివరణ ఇచ్చారు. అలాగే ప్రభుత్వం చెప్పినట్టుగా కరోనా వైరస్ బారి నుంచి బయట పడటానికి తగిన జాగ్రత్తలను పాటిద్దామని ఆయన పేర్కొన్నారు. ఇప్పటి మాదిరిగానే ప్రజలందరూ తమకు తాముగా నిర్బంధాన్ని విధించుకుని కరోనా వైరస్‌ను వ్యాప్తి చెందకుండా తీసుకునే జాగ్రత్తలపై దృష్టి పెట్టాలని పిలుపునిచ్చారు. అదే విధంగా తన వ్యాఖ్యలను ప్రజల్లోకి తీసుకెళ్లిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment