పవన్ కోసం చరణ్..?
రామ్ చరణ్ ఆన్ స్క్రీన్ మాత్రమే కాదు ఆఫ్ స్క్రీన్ కూడా చాలా హుందాగా వ్యవహరిస్తున్నాడు. గతంలో ఆవేశంగా మాట్లాడి వివాదాలను కొని తెచ్చుకున్న ఈ మెగా పవర్ స్టార్ ఇప్పుడు మాత్రం యువ కథానాయకులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. అంతేకాదు తన ఫ్యామిలీ హీరోలతో పోటి వస్తే తానే బరినుంచి తప్పుకొని అభిమానుల మనసు గెలుచుకుంటున్నాడు.
త్వరలో రిలీజ్కు రెడీ అవుతున్న రంగస్థలం 1985 విషయంలోనూ ఇలాంటి నిర్ణయమే తీసుకున్నాడు చెర్రీ. ముందుగా ఈ సినిమాను 2018లో జనవరిలో రిలీజ్ చేసేలా ప్లాన్ చేశారు. అయితే అక్టోబర్లో రిలీజ్ అవుతుందనుకున్న పవన్, త్రివిక్రమ్ సినిమా ఆలస్యమవుతుండటంతో ఆ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. దీంతో బాబాయ్ సినిమాతో పోటి పడటం ఇష్టం లేని చరణ్ తన సినిమా డిసెంబర్ నెలాఖరునే రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నాడట.
గతంలోనూ ఇలాంటి త్యాగమే చేశాడు చెర్రీ. 2017 సంక్రాంతి బరిలో ధృవ సినిమాతో సత్తా చాటలని భావించాడు. అయితే అదే సమయంలో మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ సినిమా ఖైదీ నంబర్ 150 రిలీజ్ చేయాల్సి రావటంతో ఒక నెల ముందుగానే ధృవ సినిమాను రిలీజ్ చేశాడు. ఇండస్ట్రీకి అన్సీజన్గా చెప్పుకునే డిసెంబర్లో కూడా ధృవ సినిమా 50 కోట్లకు పైగా వసూళ్లు సాధించి మెగా పవర్ చూపించింది. మరి మరోసారి అదే ఫీట్ రిపీట్ చేస్తాడేమో చూడాలి.