
‘ఆర్‌ఆర్‌ఆర్’లో రామ్‌చరణ్ లుక్, కేక్ కట్ చేస్తున్న రామ్‌చరణ్
ఏడాది నుంచి ‘ఆర్‌ఆర్‌ఆర్’ (రౌద్రం రణం రుధిరం) షూటింగ్ చేస్తున్నారు రాజమౌళి. సినిమాకు సంబంధించిన ఏ విషయాన్నీ బయటకు రానీయకుండా ఆడియన్స్‌ని ఊరిస్తున్నారాయన. శుక్రవారం ఓ ఊర మాస్ టీజర్‌తో ఎన్టీఆర్, రామ్‌చరణ్ అభిమానులకు ఊరట కలిగించారు. శుక్రవారం రామ్‌చరణ్ బర్త్‌డే. ఎన్టీఆర్ వాయిస్‌తో చరణ్ పాత్రకు సంబంధించిన టీజర్‌ను విడుదల చేసింది చిత్రబృందం.
‘‘ఆడు కనవడితే నిప్పు కణం నిలవడినట్టుంటది. కలవడితే ఏగుసుక్క ఎగవడినట్టుంటది. ఎదురువడితే చావుకైనా చమట ధార కడతది. బాణమైనా బందూకైనా వానికి బాంచనైతది. ఇంటిపేరు అల్లూరి.. సాకింది గోదారి. నా అన్న మన్నెం దొర అల్లూరి సీతారామరాజు’’ అంటూ టీజర్‌లో రామ్‌చర ణ్ కసరత్తులు చేస్తుంటే ఎన్టీఆర్ పవర్‌ఫుల్ సంభాషణలు పలికారు.
తమిళ, హిందీ, కన్నడ భాషల్లోని టీజర్స్‌కి ఎన్టీఆరే స్వయంగా డబ్బింగ్ చెప్పారు. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరమ్ భీమ్‌గా, చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు. ఆలియా భట్, అజయ్ దేవగన్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 8న ఈ చిత్రం విడుదల కానుంది. ‘‘అందరూ ఇంట్లో ఉండటమే తనకి ఇచ్చే బెస్ట్ బర్త్‌డే గిఫ్ట్’’ అని చరణ్ ట్వీట్ చేశారు. అలాగే ఉపాసన తయారు చేసిన కేక్‌ని కట్ చేసి ఇంట్లోనే బర్త్‌డేని జరుపుకున్నారు చరణ్. ఆ ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు ఉపాసన.