
సాయిధరమ్ తేజ్‌కి పెద్ద స్టార్‌డమ్ వస్తుంది!
‘‘నా నిర్మాతలు, నా కెమేరామన్, నా ఎడిటర్, నా రైటర్... వీళ్లందరితో గోపీ (గోపీచంద్ మలినేని) తీసిన చిత్రమిది. ట్రైలర్ చూస్తుంటే... నా సినిమాలానే అనిపించింది. సాయిధరమ్ తేజ్ గుర్రంతో పరిగెత్తే షాట్ అద్భుతంగా ఉంది. అతనికి ఈ సినిమా పెద్ద స్టార్‌డమ్ తీసుకొస్తుందని ఆశిస్తున్నా’’ అన్నారు ప్రముఖ దర్శకులు వీవీ వినాయక్. సాయిధరమ్ తేజ్, రకుల్‌ప్రీత్ సింగ్ జంటగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), ‘ఠాగూర్’ మధు నిర్మించిన సినిమా ‘విన్నర్’. శివరాత్రి సందర్భంగా ఈ నెల 24న సినిమాను విడుదల చేస్తున్నారు.
ఆదివారం వీవీ వినాయక్ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ – ‘‘బడ్జెట్ గురించి నిర్మాతలు ఎక్కడా ఆలోచించలేదు. టర్కీ వెళ్లి హార్స్ రేస్ సీన్లు తీశారు. ఆ కష్టమంతా స్క్రీన్‌పై కనిపించింది. సంతోశ్ శివన్, పీసీ శ్రీరామ్ స్థాయి కెమేరామాన్ ఛోటా కె.నాయుడు. గోపీ గత సినిమాలన్నీ హిట్టే. ఈ సినిమా వాటికి మించి హిట్టవ్వాలని కోరుకుంటున్నా’’ అన్నారు. సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ – ‘‘కథ చెప్పగానే గుర్రాలు, హార్స్ రేసింగ్ అంటే నాకు అర్థం కాలేదు. కానీ, షూటింగ్ చేసినప్పుడు దర్శక, నిర్మాతలు, ఛోటాగారు తీసుకున్న జాగ్రత్తల వల్లే నేను సేఫ్‌గా ఉన్నా.
సినిమా కోసం చాలా కష్టపడ్డాం. నేను చాలా ఫాస్ట్‌గా మాట్లాడతా. నా స్పీడ్‌ని కంట్రోల్ చేసిన గోపీ అన్న మంచి నటన రాబట్టుకున్నారు. తమన్ మంచి పాటలిచ్చాడు’’ అన్నారు. ‘‘నన్నూ, తేజూనీ నెక్ట్స్ లీగ్‌కి తీసుకువెళ్లే సినిమా అవుతుందని ఆశిస్తున్నా’’ అన్నారు గోపీచంద్ మలినేని. ఎడిటర్ గౌతంరాజు, కెమేరామన్ ఛోటా కె. నాయుడు, రచయిత వెలిగొండ శ్రీనివాస్, ‘ఏషియన్’ సునీల్ నారంగ్ పాల్గొన్నారు.