ఎవరి సంపాదన ఎక్కువ? | salmankhan, deepika padukone richest stars in bollywood | Sakshi
Sakshi News home page

ఎవరి సంపాదన ఎక్కువ?

Published Thu, Dec 6 2018 12:25 AM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM

salmankhan, deepika padukone richest stars in bollywood - Sakshi

నయనతార, సల్మాన్‌ఖాన్‌, విజయ్‌ దేవరకొండ, దీపికా పదుకోన్‌, రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌, మహేశ్‌బాబు, అల్లు అర్జున్‌

‘షారుక్‌ఖాన్‌ సినిమాకు ఇన్ని కోట్లు తీసుకుంటారట, సల్మాన్‌ అయితే ‘బిగ్‌ బాస్‌’ ఒక్క ఎపిసోడ్‌కే అన్ని కోట్లు పుచ్చుకుంటారట!’ అని మాట్లాడుకుంటూనే ఉంటాం. సామాన్యుల్లో స్టార్స్‌ సంపాదన ఎప్పుడూ ఓ హాట్‌ టాపిక్కే. ఇదే సంభాషణలకు సర్వే రూపం ఇచ్చి ఓ జాబితాను ప్రతి ఏడాదీ రిలీజ్‌ చేస్తుంటుంది ఫోర్బ్స్‌ మేగజైన్‌. సినిమా తారలు, క్రికెటర్స్‌ ఆ ఏడాది (సర్వే నిర్వహించే కాలం)లో  ఎంత సంపాదిస్తున్నారో లెక్క కట్టి ఏడాది చివర్లో ఓ లిస్ట్‌ను రిలీజ్‌ చేస్తుంది. ఈ ఏడాది కూడా తన టాప్‌ 100 జాబితాను విడుదల చేసింది.  2017 అక్టోబర్‌ 1 నుంచి సెప్టెబర్‌ 30, 2018 వరకూ తారల సినిమాల రిలీజ్‌లు, చేసిన బ్రాండ్‌ ప్రమోషన్స్‌ అన్నింటినీ లెక్కకట్టి ఎక్కువగా సంపాదించే వంద మంది ఇండియన్‌ సెలబ్రిటీల లిస్ట్‌ ఇచ్చింది. ఈ ఏడాది అత్యంత సంపాదించిన వాళ్లలో సల్మాన్‌ ఖాన్‌ నిలిచారు. వరుసగా మూడోసారి ఈ లిస్ట్‌లో టాప్‌లో నిలిచారు సల్మాన్‌ ఖాన్‌.  ఈ కండలవీరుడు సుమారు 253 కోట్ల రూపాయలను ఆర్జిస్తున్నట్టు పేర్కొంది ఫోర్బ్స్‌.

మూడో స్థానంలో అక్షయ్‌ కుమార్‌ (185 కోట్లు) ఉన్నారు. ఈ జాబితాలో సౌత్‌ హీరోల్లో రజనీకాంత్‌ టాప్‌లో ఉన్నారు. 50 కోట్లు సంపాదిస్తూ 14వ పొజిషన్‌లో నిలిచారు రజనీ. ఆ తర్వాత 31కోట్ల సంపాదనతో పవన్‌ కల్యాణ్‌ 24వ పొజిషన్‌లో నిలిచారు. 28 కోట్లు సంపాదిస్తూ ఎన్టీఆర్‌ 28వ స్థానంలో నిలిచారు. 33, 34, 36 స్థానాల్లో మహేశ్‌బాబు (24.33 కోట్లు), సూర్య (23. 67 కోట్లు), నాగార్జున (22.25 కోట్లు) నిలిచారు. బ్లాక్‌బస్టర్‌ సినిమాల దర్శకుడు కొరటాల శివ కూడా ఈ లిస్ట్‌లో చోటు సంపాదించుకున్నారు.20 కోట్ల సంపాదనతో 39వ స్థానంలో ఉన్నారు. ఆ తర్వాత అల్లు అర్జున్‌  (15.67 కోట్లు), రామ్‌చరణ్‌ (14 కోట్లు), లేటెస్ట్‌ సెన్సేషన్‌ విజయ్‌ దేవరకొండ (14 కోట్లు) 64,72, 72 స్థానాల్లో ఉన్నారు. గతేడాది రెండో స్థానంలో నిలిచిన షారుక్‌ ఈ ఏడాది 13వ స్థానంలోకి వెళ్లారు. ఈ ఏడాది ఒక్క సినిమా రిలీజ్‌ కూడా లేకపోవడమే దానికి కారణం. అలాగే గతేడాది 7వ స్థానంలో నిలిచిన ప్రియాంక ఈ సంవత్సరం 49వ స్థానానికి చేరుకున్నారు.

దీపికా రికార్డ్‌.. నయన కూడా!
112.8 కోట్లతో దీపికా పదుకోన్‌ నాలుగో స్థానంలో నిలిచారు. 2012 నుంచి ఫోర్బ్స్‌ విడుదల చేస్తున్న ఈ జాబితాలో టాప్‌ 5లో చోటు సంపాదించుకున్న తొలి మహిళగా దీపికా పదుకోన్‌ రికార్డ్‌ సృష్టించారు. ‘పద్మావత్‌’ లో హీరోల కంటే కూడా ఎక్కువ రెమ్యునరేషన్‌ అందుకోవడం, అలాగే తను చేసే బ్రాండ్‌ ప్రమోషన్స్‌ కూడా ఆమెను టాప్‌ 5లో నిలిచేలా చేశాయని ఊహించవచ్చు. సౌత్‌ నుంచి హీరోయిన్స్‌లో నయనతార మాత్రమే ఈ లిస్ట్‌లో నిలవడం విశేషం. 15.17 కోట్లు సంపాదించి 69వ స్థానంలో నిలిచారు నయన్‌.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement