
షారుక్ ఖాన్ - ప్రియాంక చోప్రా (ఫైల్ ఫోటో)
నాకు కూడా వివాహం అవ్వబోతుంది.. మీకు ఆహ్వానం పంపిస్తాను తప్పకుండా రావాలి
ప్రస్తుతం బాలీవుడ్‌లో హాట్ టాపిక్ అంటే ప్రియాంక చోప్రా నిశ్చితార్ధమే. ప్రియాంక - నిక్ జోనాస్‌ల ఎంగేజ్‌మెంట్ ఎక్కడ, ఎప్పుడు, ఎలా అయ్యింది లాంటి ప్రశ్నలు అటు అభిమానులనే కాక ఇటు ఇండస్ట్రీ వర్గాల వారి బుర్రలను కూడా తొలిచేస్తున్నాయి. రెండు రోజుల క్రితం జరిగిన ఒక అవార్డుల ఫంక్షన్ కార్యక్రమంలో కూడా దీని గురించే గుసగుసలు. కానీ ఈ వార్తలపై ఇటు ప్రియాంక, అటు ఆమె బాయ్‌ఫ్రెండ్ నిక్ జోనాస్ నుంచి ఎటువంటి స్పందన లేదు.
అయితే మీడియా మాత్రం ప్రియాంక నిశ్చితార్ధానికి సంబంధించిన సమాచారం రాబట్టేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే పలువురు సెలబ్రిటీలను ‘ప్రియాంకకు ఎంగేజ్‌మెంట్ అయ్యిందంటగా.. మీకు ఏమైనా తెలుసా’ అంటూ అడుగుతోంది. కొందరు మాకు తెలియదు అనగా, కొందరు మాత్రం చాలా వెరైటీగా స్పందిస్తూ మరిన్ని అనుమానాలకు తావిస్తున్నారు. వీరిలో కంగనా రనౌత్, షారుక్ ఖాన్‌లు కూడా ఉన్నారు.
మంగళవారం జరిగిన అవార్డుల ఫంక్షన్ సందర్భంగా మీడియా ప్రియాంక - నిక్ జోనాస్‌ల ఎంగేజ్‌మెంట్ గురించి షారుఖ్ దగ్గర ప్రస్తావించగా ఆయన చాలా తెలివిగా సమాధానం చెప్పారు. ‘నాకు కూడా వివాహం అవ్వబోతుంది.. మీకు ఆహ్వానం పంపిస్తాను.. రిసెప్షన్‌కు కూడా ఆహ్వానిస్తాను. మెహందీకి కూడా హాజరవ్వాలి మర్చిపోవద్దు’ అంటూ వింత సమాధానం ఇచ్చారు.
కంగనా రనౌత్ అయితే ఏకంగా ‘నన్ను పిలవకుండానే ఎంగేజ్‌మెంట్ చేసుకుందా. అయితే నేను తన మీద అలిగాను. కానీ తన జీవితం సంతోషంగా సాగాలి’ అంటూ సమాధానమిచ్చారు. ఇంతకు వీళ్లంతా ప్రియాంకకు ఎంగేజ్‌మెంట్ అయ్యిందంటున్నారా..? లేదంటున్నారా అన్నది అర్ధం కాక బుర్ర బద్దలు కొట్టుకుంటున్నారు జనాలు.
అసలు ఎంగేజ్‌మెంట్ గురించే సరైన స్పష్టత లేదంటే.. మరి కొందరు పుకారు రాయళ్లు మాత్రం ఏకంగా పెళ్లి డేట్‌ను కూడా ఫిక్స్ చేశారు. ప్రియాంక బాయ్ ఫ్రెండ్ నిక్ జోనాస్ పుట్టిన రోజైన సెప్టెంబర్ 16న వీరిద్దరూ వివాహ బంధంతో ఒక్కటవ్వబోతున్నట్లు వార్తలు ప్రచారం చేస్తున్నారు.