
మహాభారతంలో నారద మునీంద్రుల వారు అందరికన్నా ఫేమస్. కలహ భోజనం లేనిదే ఆయనకు కునుకైనా పట్టదు. బాలీవుడ్‌లోనూ ఓ పిల్ల నారదుడు ఉన్నాడు.. కాకపోతే ఈయన కాస్త ట్రెండీ, ఎవరో గొడవ పడేలా చేయటం ఎందుకని, ఏకంగా తన తల్లిదండ్రుల మీదే అస్త్రం విసిరాడు. ఇద్దరి మధ్య చిచ్చు పెట్టి అగ్గి రాజేశాడు. ఇంకేముందీ.. భార్యాభర్తలిద్దరూ యుద్ధానికి దిగారు. ఇంతకీ వాళ్లెవరో కాదు.. బాలీవుడ్ నటి శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రా. వీరి ముద్దుల తనయుడు, ఏడేళ్ల వియాన్ ఒకరి గురించి మరొకరికి చాడీలు చెప్పాడు. తండ్రి దగ్గరికి వెళ్లి, అమ్మ తమరు లావుగా ఉన్నారంటోందని అతని బుర్రలో కోపాగ్ని రగిల్చాడు. అది అంటుకుందని తెలియగానే అక్కడ నుంచి జారుకుని తల్లి దగ్గర తేలాడు. "నాన్న, నిన్ను మహా బద్ధకస్తురాలు" అంటున్నాడని శిల్పా చెవినేశాడు. (శిల్పాశెట్టి భర్తకు ఈడీ మరోసారి షాక్)
ఇంకేముందీ... ఇద్దరూ యుద్ధానికి సిద్ధమయ్యారు. నారదుడు, అదే.. ఆ పిల్లవాడు తనకు కావాల్సింది ఇదే అన్నట్లుగా హాయిగా సినిమా చూస్తున్నట్లు చూస్తుండిపోయాడు. ఇంతలో ఇద్దరూ బాణాలు విసురుకుని ఎందుకలా అన్నావు? అంటూ పోట్లాట పెట్టకున్న సమయంలో చాడీలన్నీ అబద్ధమని తేలిపోయింది. దీంతో ఇది ఎవరి పన్నాగమో అర్థమై ఒక్కసారిగా బాణాల దిశను కొడుకు వైపు గురి పెట్టారు. ఇంకేముందీ, చచ్చాన్రా దేవుడోయ్ అనుకుంటూ ఆ పిల్లవాడు అక్కడి నుంచి పరారయ్యేందుకు ప్రయత్నించాడు.. ఇదీ శిల్పాశెట్టి ఇంట్లో జరిగిన మోడర్న్ మహాభారతం. ఇలా వారి ఇంట్లో ఆదివారం నాడు మహాభారతాన్ని అనుకరించి సరదాగా గడిపారు. ఈ వీడియోను 1 మిలియన్ మందికి పైగా వీక్షించారు. (రెండోసారి తల్లైన శిల్పాశెట్టి!)