సెట్లోకి సై | Shootin Work Has Been Started For Star Heroes In Bollywood Industry | Sakshi
Sakshi News home page

సెట్లోకి సై

Published Tue, Jul 21 2020 3:37 AM | Last Updated on Tue, Jul 21 2020 3:42 AM

Shootin Work Has Been Started For Star Heroes In Bollywood Industry - Sakshi

కండలవీరుడు సల్మాన్‌ ఫామ్‌హౌస్‌ నుంచి సెట్లోకి వచ్చే టైమ్‌ దగ్గరపడింది. నేను కూడా అంటూ అజయ్‌ దేవగన్‌ సెట్లోకి అడుగుపెట్టబోతున్నారు.మేం కూడా అంటున్నారు జాన్‌ అబ్రహాం, ఇమ్రాన్‌ హష్మీ వీళ్లంతా ముంబైలో షూటింగ్‌ చేయబోతున్నారు. అక్షయ్‌కుమారేమో ఏకంగా ఫారిన్‌ వెళ్లడానికి రెడీ అవుతున్నారు. త్వరలో ఈ హీరోలందరూ షూటింగ్స్‌లో పాల్గొనబోతున్నారు.

థియేటర్స్‌కు కరోనా తాళం వేసింది. నటీనటులు సెట్‌లోకి అడుగుపెట్టకుండా షూటింగ్‌కు ప్యాకప్‌ చెప్పేలా చేసింది. కానీ ప్రభుత్వం షూటింగ్స్‌కు అనుమతులు ఇచ్చిన తర్వాత కొంతమంది యాక్టర్స్‌ సరైన జాగ్రత్తలతో వాణిజ్య ప్రకటనలు చేశారు. ఇప్పుడు ఆ ధైర్యంతోనే మరిన్ని జాగ్రత్తలను పాటిస్తూ షూటింగ్స్‌ చేయాలని స్టార్‌ హీరోలు కొందరు ‘రెడీ టు షూట్‌’ అంటున్నారు. అందుకు తగ్గ సన్నాహాలు బాలీవుడ్‌లో ఊపందుకున్నాయి. బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ఖాన్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘రాధే: యువర్‌ మోస్ట్‌ వాంటెడ్‌ భాయ్‌’. ప్రభుదేవా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో దిశా పటానీ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఒక్క ఫారిన్‌ షెడ్యూల్‌ పూర్తి చేస్తే షూటింగ్‌కు గుమ్మడికాయ కొట్టేవారు సల్మాన్‌ అండ్‌ కో. కానీ కరోనా కన్నెర్ర చేయడంతో షూటింగ్‌  ఆగిపోయింది. దీంతో మిగిలిపోయిన ఆ ఫారిన్‌ షెడ్యూల్‌ను ముంబైలోనే పూర్తి చేయాలని చిత్రబృందం భావిస్తోంది. బ్యాలెన్స్‌ షూట్‌కు తగ్గట్లుగా ముంబైలోని ఓ స్టూడియోలో సెట్‌ వర్క్స్‌ జరుగుతున్నాయని సమాచారం.

ఈ సెట్‌వర్క్‌   పూర్తయితే ప్రస్తుతం ఫామ్‌హౌస్‌లో ఉన్న సల్మాన్‌ఖాన్‌ ‘రాధే’గా కెమెరా ముందుకు వస్తారు. ఇప్పుడు ఫారిన్‌ షెడ్యూల్‌ అంటేనే సినిమా పరిశ్రమ అంతా ఆలోచనలో పడే పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయి. కానీ బాలీవుడ్‌ కిలాడీ అక్షయ్‌కుమార్‌ మాత్రం ఫారిన్‌ షెడ్యూల్‌కు సై అంటున్నారు. ప్రస్తుతం అక్షయ్‌కుమార్‌ చేతిలో ఉన్న చిత్రాల్లో ‘బెల్‌ బాటమ్‌’ ఒకటి. రంజిత్‌ ఎమ్‌. తివారి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో కథానాయికలు వాణీ కపూర్, హ్యూమా ఖురేషీ నటిస్తున్నారు. స్కాట్‌ల్యాండ్‌లో సెప్టెంబరులో ఈ సినిమా షూటింగ్‌ను ఆరంభించాలనుకుంటున్నారు. యూనిట్‌ సభ్యులంతా ప్రైవేట్‌ జెట్స్‌లో ఫారిన్‌ లొకేషన్స్‌కు చేరుకుంటారని బాలీవుడ్‌ టాక్‌.

ఇక కరోనా అలజడి లేకపోతే ఈపాటికే ‘థ్యాంక్‌ గాడ్‌’ చిత్రం షూటింగ్‌ సగం పూర్తయ్యేది. కానీ కరోనా కారణంగా ఇంకా మొదలే కాలేదు. అజయ్‌ దేవగన్, సిద్ధార్థ్‌ మల్హోత్రా హీరోలుగా ఇంద్రకుమార్‌ డైరెక్షన్లో తెరకెక్కనున్న చిత్రం ‘థ్యాంక్‌ గాడ్‌’. ఇందులో రకుల్‌ప్రీత్‌సింగ్‌ హీరోయిన్‌గా నటిస్తారు. ఈ సినిమా షూటింగ్‌ కూడా సెప్టెంబరులో ముంబైలో ఆరంభం కానుంది. ప్రస్తుతం సెట్‌ వర్క్‌ జరుగుతోంది. జాన్‌ అబ్రహాం, ఇమ్రాన్‌ హష్మీ హీరోలుగా సంజయ్‌ గుప్తా తెరకెక్కిస్తోన్న చిత్రం ‘ముంబై సాగ’. ఇందులో కాజల్‌ అగర్వాల్‌ ఓ హీరోయిన్‌గా కనిపిస్తారు. నిజానికి ఈ సినిమా షూటింగ్‌ ఈపాటికే హైదరాబాద్‌లో ప్రారంభం కావాల్సింది. కానీ కొన్ని కారణావల్ల కుదరలేదు.

తాజాగా ముంబైలోనే ఈ సినిమా షూటింగ్‌ను పూర్తి చేయాలని భావిస్తున్నారు చిత్రబృందం. ఇందుకోసం ముంబైలోని ఓ ప్రముఖ స్టూడియోలో సెట్‌వర్క్‌ జరుగుతోందని తెలిసింది. వచ్చే నెల 15నుంచి షూటింగ్‌ స్టార్ట్‌ అయ్యేలా ప్లాన్‌ చేస్తున్నారు జాన్‌ అబ్రహాం అండ్‌ టీమ్‌. వీటితో పాటుగా మరికొన్ని హిందీ సినిమాలు కరోనా జాగ్రత్తలను పాటిస్తూ షూటింగ్స్‌ను షురూ చేసే ఆలోచనల్లో ఉన్నట్లు సమాచారం.                      

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement