ఈ డైలాగ్స్‌ ఇప్పుడే చెబితే క్లైమాక్స్‌లో ఏం చెబుతాం!! | Special interview with 'Srinivasa Kalyanam' team | Sakshi
Sakshi News home page

కల్యాణం శతమానం

Published Sun, Aug 12 2018 1:06 AM | Last Updated on Sun, Aug 12 2018 12:26 PM

Special interview with 'Srinivasa Kalyanam' team - Sakshi

సతీష్, రాశీఖన్నా, నితిన్, నందిత, ‘దిల్‌’ రాజు

నూతన వధువరులను ‘శతమానం భవతి’ అని దీవిస్తారు. గొప్ప సంప్రదాయాలను ‘నూరేళ్లు వర్థిల్లాల’ని కోరుకుంటారు. మన వివాహవ్యవస్థ ప్రపంచానికి ఆదర్శం. మన సినిమా భావోద్వేగాల సమ్మిళితం. మంచి విలువలను చెప్పే మంచి సినిమా వర్థిల్లాలి. మన సంస్కృతికి పదే పదే ఆయువు పోస్తూ ఉండాలి. శతమానం భవతి!

వేగేశ్న సతీష్‌గారితో ‘శతమానం భవతి’ వంటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ చేశాక మళ్లీ ఆయన దర్శకత్వంలోనే ఫ్యామిలీ బ్యాక్‌డ్రాప్‌ మూవీ ‘శ్రీనివాస కళ్యాణం’ని ఎందుకు ఓకే చేశారు?
‘దిల్‌’ రాజు: మేజర్‌గా నేను రెండు విషయాలు ఆలోచిస్తా. ఒకటి స్టోరీ. రెండోది స్టోరీ ఐడియా. కథ, ఐడియా ఇంట్రెస్ట్‌గా ఉంటే ఓకే చేస్తా. వర్కౌట్‌ అవుతుందా? లేదా? అనే విషయం గురించి ఆలోచించను. ‘శతమానం భవతి’ సినిమాను అలాగే పిక్‌ చేశాను. ‘శ్రీనివాస కళ్యాణం’ సినిమాను కూడా అలాగే ఎంపిక చేసుకున్నాను. ‘శతమానం భవతి’ అనేది ఒక కథ అని, ‘శ్రీనివాస కళ్యాణం’ అనేది ఒక మూమెంట్‌ అనే క్లారిటీ ఉంది. సినిమాలోని 8, 9 మూమెంట్స్‌ అద్భుతంగా ఉంటాయి. ఆడియన్స్‌ నుంచి వాటికి మంచి రెస్పాన్స్‌ వస్తోంది. సినిమాకు మంచి టాక్‌ రావడానికి కూడా ఆ సీన్సే కారణమని నా నమ్మకం.‘శతమానం భవతి’లో కథ వెంటనే స్టార్ట్‌ అవుతుంది.

‘శ్రీనివాస కల్యాణం’లో ప్రీ ఇంట్రవెల్‌ నుంచి స్ట్రాంగ్‌ కథ మొదలవుతుంది. ఫస్ట్‌ హాఫ్‌లోని మూమెంట్స్‌కు ఆడియన్స్‌ ఎంగేజ్‌ అవుతారనే నమ్మకం ఎలా కలిగింది?
‘దిల్‌’ రాజు: నిజం చెప్పాలంటే ఫస్ట్‌ హాఫ్‌ గురించి భయపడుతూనే ఉన్నాం. కానీ మంచి మూమెంట్స్‌ ఉన్నాయి కదా అనే ధైర్యం ఓ పక్కన ఉంది. ‘హ్యాపీ డేస్‌’ కథ కాదు. ఫోర్‌ ఇయర్స్‌ ట్రావెలింగ్‌ మూమెంట్స్‌. శేఖర్‌గారు చేసిన ‘ఫిదా’ సినిమా కూడా ట్రావెల్‌ ఫిల్మ్‌. ఈ సినిమాను కూడా నేను అలానే భావించాను. పెళ్లి మీద ట్రావెల్‌ ఫిల్మ్‌ అనే ఆలోచనపై నమ్మకం ఉంచాను. రషెష్‌ చూసినప్పుడు ఫీల్‌ గుడ్‌ ఫిల్మ్‌ అనిపించింది. ఇదే విషయాన్ని ఎడిటర్‌కు చెప్పాను. ఆ తర్వాత ఫస్ట్‌ కాపీ రెడీ అయ్యాక సినిమా చూసిన వారందరూ చాలా బాగుందని చెప్పడం స్టార్ట్‌ చేశారు. మంచి ఫీల్‌ కలిగింది. ఆడియన్స్‌ రెస్పాన్స్‌ చూశాక నా నమ్మకం నిజమైందని అనిపిస్తోంది.

ఓ నిర్మాతగా ఈ పెళ్లికి మీరే పెద్ద. పెళ్లిలో ఎన్నో అలకలు, గొడవలు ఉంటాయి. ఈ పెళ్లి తీసేటప్పుడు ఆన్‌సెట్స్‌లో ఏవైనా అలకలున్నాయా?
‘దిల్‌’ రాజు: చంఢీఘడ్‌లో షూటింగ్‌ చేసినప్పుడు సతీష్‌ అలిగినట్లు ఉన్నాడు.
నితిన్‌: నాకు తెలుసు.. నాకు తెలుసు(నవ్వులు).
‘దిల్‌’ రాజు: చండీఘడ్‌ షెడ్యూల్‌లో ఓ రోజు సెట్‌లో సీన్‌ పేపర్స్‌ చదివాను. నిజానికి షూటింగ్‌ ముందే అన్నీ ఓకే చేసుకుంటాం. కానీ సెట్‌లో ఆ రోజు నాకు ఎందుకో కొత్త కొత్త డౌట్స్‌ వచ్చాయి. డైలాగ్స్‌ లెంగ్త్‌ ఎక్కువగా ఉంది కదా అని సతీష్‌ని అడిగాను. ‘అవునా..సార్‌ అన్నాడు’. సరే అని నేను బ్రేక్‌ఫాస్ట్‌కి వెళ్లొచ్చి చూసే సరికి సతీష్‌ డైరెక్టర్‌ సీట్‌లో లేడు. చూస్తే పక్కకి వెళ్లి ఏదో రాస్తున్నాడు.

ఒక మనిషి ఎక్స్‌ప్రెషన్‌ అండ్‌ బాడీ లాంగ్వేజ్‌ సడన్‌గా మారవు. అప్పుడు సతీష్‌లో నాకు మార్పు కనిపించింది. ఏమైందో తెలుసుకుందామని అసోసియేట్‌ డైరెక్టర్‌ని పిలిచా. మీరు ‘సడన్‌గా సీన్‌ చేంజ్‌ చేయమంటే ఎవరైనా హర్ట్‌ అవుతారు కదా సార్‌’ అన్నాడు. ఆ తర్వాత హైదరాబాద్‌ వచ్చేశాను. చండీఘడ్‌ వెళ్లిన శిరీష్‌ కూడా హైదరాబాద్‌ తిరిగొచ్చి ‘సతీష్‌ ఎందుకో ఈ షెడ్యూల్‌ అంతా డిస్ట్రబ్డ్‌గా ఉన్నాడు’ అన్నాడు. సతీష్‌ హైదరాబాద్‌ వచ్చాక అడిగితే చెప్పలేదు. ఇప్పుడు చెబుతాడు. కారణం తెలుసుకుందాం.

నితిన్‌: నేను షూట్‌లో ఉన్నాను. అంతకుముందు చెప్పినది ఇవ్వకుండా వేరే సీన్‌ పేపర్స్‌ ఇచ్చారు. నేను షాక్‌ అయ్యాను. ఇది కాదు కదా అనుకున్నా.
సతీష్‌: సినిమాలో చండీఘడ్‌లో డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ ప్లాన్‌ చేస్తాం. పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు తరఫు బంధువులు, స్నేహితులు ఆ వేడుకలో కనిపించాలి. అయితే చండీఘడ్‌లో క్రౌడ్‌ని చూసినప్పుడు ఏదో నిరుత్సాహం కలిగింది. అక్కడి పంజాబీ లోకల్‌ ఆర్టిస్టులను తీసుకున్నాం. దాంతో నేటివిటీ మిస్‌ అవుతుందా? అని ఆలోచిస్తున్నాను. సెట్‌లో వేరే చిన్న చిన్న డిస్ట్రబెన్సెస్‌ ఉన్నాయి. అదే టైమ్‌లో ‘దిల్‌’ రాజుగారు సీన్‌ కాస్త మార్చుదామా అంటే, ఏదోలా అనిపించింది. ఇంతకుముందు ఎప్పుడు ఆయన అలా అనలేదు కదా అనుకున్నాను.
‘దిల్‌’ రాజు: యాక్చువల్లీ మా ఇద్దరి వేవ్‌లెంగ్త్‌ చాలా బాగుంటుంది. సతీష్‌తో ఈ రెండు సినిమాల ‘శతమానం భవతి, శ్రీనివాస కళ్యాణం’ 110 రోజుల జర్నీలో ఆ రోజు నాకు క్వశ్చన్‌ మార్క్‌లా మిగిలిపోయింది.
సతీష్‌: సెట్‌లో సీన్‌ కరెక్షన్‌ అంటే ఎవరికైనా కాస్త టైమ్‌ పడుతుంది కానీ నేను ఓ పది నిమిషాల్లో కరెక్ట్‌ చేసేస్తా. అది రైటర్‌గా నా అదృష్టం అనుకుంటున్నాను. ఈ సినిమాలో  రైటర్‌గా నేను ఇష్టపడి రాసుకున్న కొన్ని డైలాగ్స్‌ ఉంటాయి. సెట్‌ వాతావరణంలో ఆ రోజు నా మూడ్‌ సరిగా లేదు. ఆ టైమ్‌లో రాజుగారు వచ్చి.. ‘ఈ డైలాగ్స్‌ ఇప్పుడే చెబితే క్లైమాక్స్‌లో ఏం చెబుతాం’ అన్నారు.

నిజానికి ఫస్ట్‌ హాఫ్‌లో పెళ్లి గురించి నితిన్‌ మాట్లాడే స్ట్రాంగ్‌ డైలాగ్స్‌ అవి. కావాలంటే క్లైమాక్స్‌ కోసం మళ్లీ రాసుకోవచ్చు కదా అనిపించింది. అలా అని ‘దిల్‌’ రాజుగారికి ఎదురు చెప్పలేను. ఎందుకంటే నాకంటే సినిమా కథను ఆయన ఎక్కువగా ప్రేమిస్తారు. నా కంటే ఎక్కువగా ఆలోచిస్తారు. నిజానికి తెలుగువారిని తీసుకురమ్మని ప్రొడక్షన్‌ వారికి చెప్పకపోవడం నా తప్పే. దాంతో మూడాఫ్‌తో పక్కకు వెళ్లిపోయి రాస్తూ కూర్చున్నాను. అంతే. రాజుగారి మీద నాకేం ఉంటుంది (నవ్వుతూ).

ఓకే రాజుగారూ.. మ్యాటర్‌ క్లియర్‌ అయింది. ఇక, ఈ సినిమాలో డైలాగ్స్‌కి మంచి రెస్పాన్స్‌ వస్తోంది. నలుగురూ మీకు నచ్చిన ఒక్కో డైలాగ్‌ చెబుతారా. ముందు రాశీతో స్టార్ట్‌ చేద్దాం..
రాశీఖన్నా: ఓ సీన్‌లో సితార గారితో ఇప్పటికీ వాసు (సినిమాలోని నితిన్‌ క్యారెక్టర్‌) వాళ్లది జాయింట్‌ ఫ్యామిలీనే అమ్మా అన్నప్పుడు.. ‘ఎఫెక్షన్స్‌ ఉన్న దగ్గరే రిలేషన్స్‌ స్ట్రాంగ్‌గా ఉంటాయి’ అని చెబుతారు. ఆ డైలాగ్‌ నచ్చింది.
నందిత: నేను చెప్పిన డైలాగ్స్‌ అన్నీ నాకు ఇష్టమే. ముఖ్యంగా.. ‘నా అనే వాళ్ల దగ్గర ఏమీ దాచకూడదు. చెప్పాల్సిన టైమ్‌లో చెప్పకపోతే జీవితాంతం బాధపడటం తప్ప ఇంకా ఏమీ మిగలదు’ అనేవి నా మనసుకి బాగా దగ్గర అయ్యాయి.
 

మీ ఇంట్లో చెప్పకుండా దాచిన విషయాలు ఏమైనా ఉంటే షేర్‌ చేసుకోండి?
నందిత: ఏమీ లేవు. అమ్మానాన్నతో అన్నీ చెప్పేస్తా.

‘దిల్‌’ రాజు: నిజమే చెబుతున్నావా? ఫ్రెండ్స్‌ దగ్గర.. బాయ్‌ఫ్రెండ్స్‌ దగ్గర ఏమైనా దాచావా?
నందిత: అయ్యో.. నాకు బాయ్‌ఫ్రెండ్సే లేరండీ.
నితిన్‌: అబ్బా.. చా.. (నవ్వులు).

మీరు చెప్పండి నితిన్‌.. మీకు నచ్చిన డైలాగ్‌ ఏది?
నితిన్‌: ఫస్టాఫ్‌లో లవ్‌ ప్రాబ్లమ్‌తో ఫ్రెండ్‌ సూసైడ్‌ అటెంప్ట్ట్‌ చేసినప్పుడు..‘జాబ్‌ ఇచ్చినోడికి జాబ్‌ వదిలేసేటప్పుడు చెప్పావ్‌. ఇల్లు అద్దెకి ఇచ్చినోడికి ఇల్లు వదిలేసేటప్పుడు చెప్పావ్‌. మరి ప్రాణం ఇచ్చిన అమ్మకు ప్రాణాలు వదిలేసేటప్పుడు చెప్పాలి కదరా?’ అనే డైలాగ్‌కు కనెక్ట్‌ అయ్యాను.
‘దిల్‌’ రాజు: నాకు పర్టిక్యులర్‌గా ఓ సీన్‌కి కళ్లలో నీళ్లు తిరిగాయి. సెకండాఫ్‌లో ‘నానమ్మా.. నా పెళ్లిలో నీ 70 ఏళ్ల జీవితం కనిపిస్తుంది. రేపు నేను 70 ఏళ్ల జీవితం చూసుకోవాలి కదా. పెళ్లి గురించి మీ ఎక్స్‌పీరియన్స్‌ చెప్పండి’ అని జయసుధగారిని నితిన్‌ అడిగినప్పుడు... ‘మీ తాతయ్యగారు ఒక మాట చెప్పేవారు రా. మన కన్న తల్లిదండ్రులను ఎంత బాగా చూసుకుంటామో. మన లైఫ్‌లోకి వచ్చి, మన పిల్లలకు జన్మనిచ్చే భార్యను కూడా అంతే బాగా చూసుకోవాలి అని’. ఆ డైలాగ్‌ రాగానే నిజం కదా అనిపించింది.



సినిమాలో పెళ్లి గ్రాండ్‌గా జరిగింది. మీ ముగ్గురూ అలానే చేసుకోవాలనుకుంటున్నారా?
నితిన్‌: నాకైతే అలానే చేసుకోవాలని ఉంది. అంతా మన సంప్రదాయం ప్రకారం జరగాలనుకుంటున్నాను.
రాశీఖన్నా: కథ వింటున్నప్పుడే నాకు చాలా నచ్చింది. ఈ సినిమా చేసినందుకు చాలా గర్వంగా ఫీల్‌ అవుతున్నాను. ఈ మధ్యలో మనం గమనిస్తే చాలా డివోర్స్‌లు చూస్తున్నాం. ఈ సమయంలో ఇలాంటి కథ చెపాల్సిన అవసరం ఉందనిపించింది. నేను చాలా నేర్చుకున్నాను. నార్త్, సౌత్‌ చాలా డిఫరెంట్‌. బేసిక్‌గా నేను చాలా ట్రెడిషనల్‌. ఈ సినిమా చేశాక సౌత్‌లో పెళ్లి ఎలా చేస్తారో తెలిసింది. అన్నీ కుదిరితే అలానే చేసుకోవాలనుకుంటున్నాను. నేనైతే ఎమోషనల్‌గా కూడా ఈ మూవీకి కనెక్ట్‌ అయ్యాను.
నందిత: మా అమ్మనాన్నాలది లవ్‌ మ్యారేజ్‌. ఇద్దరి వైపు బంధువులు రాకపోకలు తక్కువ. అసలు లేదనే చెప్పాలి. దాంతో నాకు రిలేషన్స్‌ గురించి అంతగా తెలీదు. ‘శ్రీనివాస కళ్యాణం’ చేస్తున్నప్పుడు రిలేషన్‌షిప్‌ బాండింగ్‌ తెలిసింది. తెలుగు సంప్రదాయాలు నచ్చాయి. ఇలాగే పెళ్లి చేసుకోవాలన్న ఫీలింగ్‌ కలిగింది.

నితిన్‌.. మీరు క్లైమాక్స్‌లో పెద్ద పెద్ద డైలాగ్స్‌ చెప్పారు. ఏకంగా మంత్రాలు కూడా చెప్పారు. ఎటువంటి హోమ్‌ వర్క్‌  చేశారు?
నితిన్‌: ఫస్ట్‌ నాకు కథ చెప్పినప్పుడు  డైలాగ్స్‌ చాలా బావున్నాయి. సినిమా స్టార్ట్‌ అయ్యే వారం ముందు ప్రాక్టీస్‌ మొదలుపెడితే సరిపోతుందనుకున్నాం. కట్‌ చేస్తే.. తర్వాత ‘మీరు చెప్పడంలేదు. పంతులుగారితో చెప్పిస్తున్నాం’ అన్నారు. ఓకే అనుకున్నాను. లాస్ట్‌ మినిట్‌లో నువ్వే చెప్పాలన్నారు. పెళ్లి మంత్రాలంటే మామూలా? మాంగల్యం తంతునానేన.. ఈజీగానే వస్తుంది. అయితే మిగతావన్నీ అంత ఈజీ కాదు కదా. మనసులో ‘సార్‌ ఏంటి సార్‌ ఇదీ’ అనుకున్నాను.
సతీష్‌: ప్లస్‌ పాయింట్‌ ఏంటంటే నితిన్‌కి తెలుగు చదవడం బాగా వచ్చు. మా టీమ్‌లో చాలా మంది టింగ్లీష్‌ బ్యాచ్‌. (అంటే తెలుగు డైలాగ్స్‌ ఇంగ్లీష్‌లో రాసుకోవడం). పవిత్రత ఉన్న మంత్రాలు. సరిగ్గా పలకపోతే మంత్రాలు తప్పుగా ఉచ్చరించారు అని మా మీద పడిపోతారు. సో.. చాలా కేర్‌ తీసుకున్నాం. సింగిల్‌ టేక్‌లో చెప్పాడు నితిన్‌.  
నితిన్‌: ముందు నీకు ఎంత గుర్తుంటే అంత చెప్పు. కట్‌ షాట్స్‌ తీసుకుందాం అన్నారు. కానీ లాస్ట్‌ మినిట్‌లో సింగిల్‌ షాట్‌లో చేసేద్దామన్నారు. ఇక చూడండి.. చిన్నప్పుడు పద్యాలు బట్టీ పట్టినట్టు నేర్చుకున్నాను.

మీ పెళ్లికి మీరే మంత్రాలు చెప్పుకోవచ్చేమో!
నితిన్‌: ఆల్మోస్ట్‌. ఒకవేళ పంతులుగారు ఎక్కడైనా తప్పు చదివినా సార్‌ అది కాదు ఇలా అని చెప్పేస్తానేమో.

రైటర్, డైరెక్టర్‌గా ఉమ్మడి కుటుంబాలు అంతరించిపోతున్నాయి అని ‘శతమానం భవతి’,  ‘శ్రీనివాస కళ్యాణం’లో పెళ్లి విశిష్టతను గుర్తు చేస్తున్నారా?
సతీష్‌: గుర్తు చేయడం ఏం కాదు. హైందవ సంస్కృతి, సంప్రదాయం ప్రపంచంలోనే అందరికీ తలమానికం. అలాంటి సంప్రదాయాలని మనం కనీసం పాటించకుండా వేరే వేరే వాటిని పట్టుకొని  పోవడం పర్సనల్‌గా నాకు నచ్చలేదు. అలాగే నేను చెబితే ఆచరిస్తారా? లేదా అనేది వేరే విషయం. స్కూల్‌లో మాస్టర్‌ నీతి పద్యం అందరికీ ఒకలానే చెబుతాడు. కొంతమంది అర్థం చేసుకొని, పాటిస్తారు. కొందరు జస్ట్‌ విన్నాను, ఎగ్జామ్‌లో రాసి వదిలేస్తాను అనుకుని పాస్‌ అయిపోతారు. వాళ్లదీ తప్పుకాదు, వీళ్లదీ తప్పు కాదు.

‘శతమానం  భవతి’ని ఆదరించారు కాబట్టే ‘శ్రీనివాస కళ్యాణం’ వచ్చింది. ఒకవేళ ఆ సినిమా ఆడకపోయింటే ఈ సినిమా కచ్చితంగా వచ్చేది కాదు. నాతో చాలా మంది అన్నారు ఇంతకు ముందు అమ్మానాన్నల దగ్గరకు సంవత్సరానికి ఒకసారి వెళ్లేవాళ్లం. ఇప్పుడు వీలు కుదిరినప్పుడల్లా ఇంటికి వెళ్లిపోతున్నానని అంటున్నారు. కొందరినైనా కదిలించాం కదా. కొంతమందైనా ఆచరించారు కదా అనే సంతృప్తి. ఇప్పుడు ‘శ్రీనివాస కళ్యాణం’ గురించి ఓ ఎగ్జాంఫుల్‌ చెబుతాను.

పెళ్లి సీన్‌లో చెప్పులు వదిలేసి హీరో హీరోయిన్‌ మండపం మీదకు వెళ్లాలి. కథ చెప్పినప్పుడు కెమెరామేన్‌ సమీర్‌ రెడ్డికి మండపం మీద అష్టదిక్పాలకులు ఉంటారు, ఋషులు ఉంటారు అని చెప్పా. షూట్‌ చేస్తున్నప్పుడు ఆయన ఆ ఫీల్‌తోనే చేశారు. ఆ తర్వాత రాజమండ్రిలో ఆయన రిలేటివ్స్‌ పెళ్లికి వెళ్లారు. అక్కడ మండపంలో ఎవరో చెప్పులు వేసుకొని తిరిగేస్తున్నారంట. వాళ్లను పిలిచి ‘పైన దేవుళ్లుంటారంట. చెప్పులు వేసుకొని తిరగకూడదు’ అని చెప్పారట. ఇలా కొంత మంది చేయగలిగినా పెళ్లి మీద ఒక విలువ పెరుగుతుంది.

క్రియేటీవ్‌ సైడ్‌ రాజుగారు ఎక్కువ క్రెడిట్‌ తీసుకుంటున్నారని మీకు అనిపించిందా?
సతీష్‌: అనిపించలేదు. ఎందుకంటే నాకంటే ఎక్కువ ఆయన ఆలోచిస్తారు సినిమా గురించి. ఆల్రెడీ ‘దిల్‌’ రాజు అంటే ఎస్టాబ్లిష్డ్‌ బ్రాండ్‌. వేగేశ్న సతీశ్‌కి జస్ట్‌ సెకండ్‌ మూవీ. ‘శతమానం భవతి’ నుంచి నేను ఆయనలో చూసిందేంటంటే సినిమాను ప్రేమిస్తారు. చిన్న చిన్నవి కూడా పట్టించుకుంటారు. ఇలా ఉంటే బావుండు అని సలహాలు ఇస్తారు. ‘సతీశ్‌ ఇలా చెయ్‌.. ఇలా చేయ్‌’ అనరు. ఒకవేళ అలానే ఉంటే ‘శతమానం భవతి’ తర్వాత ఈ జర్నీ ఉండదు కదా.

ఆయన డామినేట్‌ చేస్తున్నారు అన్న విషయం కరెక్ట్‌ అయ్యుంటే ఈ సినిమా చేయను కదా. ఇక్కడ ఎవ్వరి క్రెడిట్‌నీ ఎవ్వరూ తీసుకెళ్లరు. రాజు గారి కాంపౌండ్‌లో అలానే జరిగితే డైరెక్టర్స్‌ బయటకు వెళ్లి సినిమాలు ఎలా తీస్తారు? ఇప్పుడీ సినిమాకి డైలాగ్స్‌కు మంచి పేరొస్తోంది కదా. అవి నేనే రాసుకోవాలి. యాక్టర్స్‌కి సీన్‌ నేనే వివరించాలి. రాజుగారు సీన్‌ బావుందా? బాలేదా అనే సజెషన్‌ ఇస్తారు. అప్పుడు కూదా కొత్త సీన్‌ రాసేది నేనే కదా.

‘దిల్‌’ రాజు: సినిమా అంటే ట్రైన్‌. దర్శకుడు, నిర్మాత పట్టాలు. పాత రోజుల్లో గొప్ప జర్నీ సాగిందంటే ఇద్దరి మధ్యా మంచి సింక్‌ ఉండబట్టే. ఏడిద నాగేశ్వరరావు– కె.విశ్వనా«ద్, నాగిరెడ్ది–కేవి రెడ్డి, శ్యామ్‌ప్రసాద్‌–కోడి రామకృష్ణ.. వీళ్ల జర్నీని తీసుకుందాం. దర్శక–నిర్మాతలిద్దరూ బాగా కనెక్ట్‌ అయ్యారు కాబట్టే జర్నీ బాగుంది. నిర్మాత చెబితే ఎందుకు వినాలిరా అంటే కుదరదు. ఇప్పుడు చాలా మంది అలానే ఉన్నారు. నేను సలహాలైతే ఇవ్వగలను కానీ సతీష్‌ చేసే పని చేయలేను కదా. నేను రాయలేను కదా. కథ తనే రాయాలి. డైలాగ్స్‌ తనే రాసుకోవాలి. సినిమా తీయాల్సిందీ తనే కదా.

ఈ సినిమాకి ముందుగా నితిన్‌ని అనుకోలేదట?
‘దిల్‌’ రాజు: మా ప్రొడక్షన్‌లో సినిమాలు ఎలా ఉంటాయంటే ఒక స్టోరీ కుదరగానే, దానికి ఎవరు బాగుంటారా? అని ఓ ముగ్గురు హీరోలను పేర్లను పేపర్‌ మీద రాసుకుంటాను. ఈ కథకు ఎన్టీఆర్, రామ్‌చరణ్, నితిన్‌ పేర్లను రాసుకున్నాను. ఎన్టీఆర్‌కు చెప్పాం కూడా. తర్వాత మాకే అనిపించింది. స్టార్‌ హీరోతో చే స్తే కొన్ని సార్లు ఫ్యాన్స్‌ కోసం ఫైట్లు, మాస్‌ ఎలిమెంట్స్‌ అంటూ కాంప్రమైజ్‌ అవ్వాలి.  వెంటనే నితిన్‌కు కథ చెప్పాం. సూపర్‌గా ఉంది. చేసేద్దాం అన్నాడు

మీ సంస్థలో వచ్చిన ‘బొమ్మరిల్లు’ మ్యాజిక్‌ రిపీట్‌ అవుతుందనుకుంటున్నారా?  
‘దిల్‌’ రాజు: ‘బొమ్మరిల్లు’తో పోల్చలేం. మంచి సినిమా ఇవ్వగలిగాం అన్న సంతృప్తి ఉంది.
నితిన్‌: త్రివిక్రమ్‌ నాతో ఓ మాట చెప్పారు. మంచి కంటే చెడు ఎక్కువ స్పీడ్‌గా ట్రావెల్‌ చేస్తుంది. మంచి అనేది స్లోగా వెళ్తుంది.. కానీ వెళ్తుంది. నా నమ్మకం ఏంటంటే ఈ సినిమా మెల్లి మెల్లిగా రీచ్‌ అవుతుంది.
‘దిల్‌’ రాజు: సొసైటీలో నెగటివ్‌ వైబ్రేషన్స్‌ ఎక్కువ. రివ్యూలు, ఇండస్ట్రీ, ఆడియన్స్‌లో కొంతమంది.. ఒక వైపు మంచి. ఒకవైపు చెడు. మంచి సినిమాను ఎవరు ఆపుతారు. షో షోకి మౌత్‌ టాక్‌ పెరుగుతుంది. ‘కేరింత’ సినిమాని రిలీజైన రోజున దేవీ థియేటర్‌లో చూశాను. కలెక్షన్స్‌ లేవు. కానీ ఆడియన్స్‌ ఎంజాయ్‌ చేస్తున్నారు. అప్‌సెట్‌ అయ్యాను. ఆఫీసులో కూర్చుని ఆలోచిస్తుంటే థియేటర్‌ ఫుల్‌ అని శ్రీకాకుళం నుంచి ఫోన్‌. వెంటనే సినిమాలో ఏదో స్పార్క్‌ ఉందని ప్రమోషన్‌ స్టార్ట్‌ చేశాను. సినిమా హిట్టయింది. 

‘శ్రీనివాస కళ్యాణం’ను వదలను. కొంచెం పుష్‌ చేయాలి.  ఈ సినిమా చూసి, చాలామంది ‘మంచి ఫీల్‌ కలిగింది. బాగుంది’ అని మెసేజ్‌ చేశారు. సినిమా సరిగ్గా లేకపోతే ప్రమోట్‌ చేసి రుద్దడానికి ట్రై చేయను. నేనే సినిమా నుంచి షిఫ్ట్‌ అయిపోతా. కనెక్ట్‌ అవుతుంది అని నమ్మితేనే ప్రమోట్‌ చేస్తాను. ఇది బాగా కనెక్ట్‌ అయ్యే సినిమా.

ముగ్గురు బ్యాచిలర్స్‌ (నితిన్, నందిత, రాశీ ఖన్నా) పెళ్లి ఎప్పుడు చేసుకుంటారో చెప్పాలి?
రాశీఖన్నా: పెళ్లి ప్లాన్స్‌ ఇప్పుడు లేవు. అబ్బాయిలు కూడా లేరు (నవ్వుతూ)..
‘దిల్‌’ రాజు: ప్లాన్‌ లేదని చెప్పు. అంతేకానీ అబ్బాయిలు లేరని అనకు (నవ్వుతూ) రాశీని చేసుకోవడానికి అబ్బాయిలు లేరా? (నవ్వుతూ)
రాశీఖన్నా: అబ్బాయిలు నిజంగానే లేరండీ.. నమ్మాలి.

‘సాక్షి’: ఇంత అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి అబ్బాయిలు ముందుకు రారా. కావాలంటే స్వయంవరం పెడదామా?

‘దిల్‌’ రాజు, నితిన్‌: అవును.. స్వయంవరం పెడదాం (నవ్వులు).
నితిన్‌: మా అమ్మవాళ్లు మ్యాచెస్‌ చూస్తున్నారు. ఇంకో 8 నెలలు టైమ్‌ పడుతుంది.
‘దిల్‌’ రాజు:  2019లోపే నీ పెళ్లి ఉంటుందేమో.
నితిన్‌: 2019 ఇయర్‌ క్లోజింగ్‌ లోపు చేసుకోకపోతే మా ఇంట్లో వాళ్లు చంపేస్తారు.
నందిత: తెలుగు ఇండస్ట్రీలోకి ఇప్పుడే వచ్చాను కదా. ఆర్టిస్ట్‌గా శాటిస్‌ఫ్యాక్షన్‌ దక్కాలి. అప్పుడే పెళ్లి.
సతీష్‌: అంటే తెలుగు ఇండస్ట్రీలోకి ఎప్పుడో వచ్చి ఉంటే ఇప్పుడు చేసుకునేదానివా?
నందిత: (నవ్వేస్తూ). తెలియదు. అయినా పెళ్లికి ఇప్పుడు తొందరపడటంలేదు.

– సినిమా డెస్క్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement