గడ్డం అడ్డం కాదంటున్న హీరోలు | Special Story Of Tollywood Heros Beard | Sakshi
Sakshi News home page

‘గడ్డం’ గ్యాంగ్‌

Published Sun, Nov 25 2018 9:46 AM | Last Updated on Sun, Nov 25 2018 12:21 PM

Special Story Of Tollywood Heros Beard - Sakshi

పోకిరి.. జులాయి.. రఫ్‌.. రౌడీ.. గడ్డంతో కనిపించే హీరోలు అందుకున్న వెండితెర బిరుదులు ఇవి. మీసాలు గుచ్చకుండా ముద్దాడతావా నన్ను అని హీరోయిన్స్‌ పాడుకోవడం వల్లో లేక రాముడు మంచి బాలుడు అనే ట్యాగ్‌ కోసమో మన హీరోలు ఎక్కువ శాతం గడ్డం జోలికి వెళ్లడంలేదు. అయితే ఇప్పుడు క్లీన్‌ షేవ్‌కు కాలం చెల్లినట్టుంది. ట్రెండ్‌ మారింది. పాత్ర అడిగితే గడ్డం అసలు అడ్డమే కాదంటున్నారు మన హీరోలు. మీసాలు తిప్పుతున్నారు. గడ్డం దువ్వుతున్నారు. రాబోతున్న సినిమాల్లో సరికొత్త పాత్రల కోసం గడ్డాలు పెంచుతున్న ఈ గడ్డం గ్యాంగ్‌పై ఓ లుక్‌ వేయండి.

చిరు గడ్డం కాదు
పీరియాడికల్‌ సినిమాలంటే కచ్చితంగా పొడవైన జుత్తు, గడ్డంతో కనిపించాల్సిందే. స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్ర కోసం చిరంజీవి గడ్డం పెంచారు. గడ్డంతో కనిపించడం చిరుకు కొత్త కాదు. అయితే ‘సైరా’లో ఎక్కువ గడ్డంతో కనిపించనున్నారు. కోర మీసం అదనం. మీసం తిప్పి బ్రిటీష్‌ సైనికుల మీద సమర శంఖం పూరిస్తారు. ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్‌ కానుందని టాక్‌.
 
మాస్‌ స్టూడెంట్‌
‘మహేశ్‌బాబు చూడటానికి ఎలా ఉంటాడు? మిల్క్‌బాయ్‌లా ఉంటాడు’.  ‘ఢీ’ సినిమాలో వచ్చే సరదా సంభాషణ ఇది. నిజమే... మహేశ్‌ మిల్క్‌బాయ్‌లా పాల బుగ్గలతో కనిపిస్తారు. కెరీర్‌లో ఫస్ట్‌ టైమ్‌ ‘మహర్షి’ సినిమా కోసం గడ్డంలో కనిపించనున్నారు. ఇది చాలదా.. ప్రిన్స్‌ ఫ్యాన్స్‌ రెట్టించిన ఉత్సాహంతో థియేటర్‌ గడప తొక్కడానికి. ఈ సినిమాలో స్టూడెంట్‌ పోర్షన్‌ వరకూ మహేశ్‌ గడ్డంలోనే కనిపిస్తారు. మిగతా సన్నివేశాల్లో క్లీన్‌ షేవ్‌తో కనిపిస్తారు. ‘మహర్షి’ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్‌ 5న రిలీజ్‌ కానుంది.

మళ్లీ పెంచుతున్నారు
 మీసాలు మెలేయడం ఎన్టీఆర్‌కు కొత్త కాదు. ‘దమ్ము’లో కోర మీసం తిప్పి ప్రత్యర్థి మీద సవాల్‌ విసిరారు. ‘నాన్నకు ప్రేమతో’లో ఫారిన్‌ కుర్రాడిలా కొత్త గడ్డంలో అలరించారు. తాజాగా రాజమౌళి తెరకెక్కించే ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (వర్కింగ్‌ టైటిల్‌)లో కూడా ఎన్టీఆర్‌ గడ్డంతోనే కనిపించనున్నారు. ఆ పాత్ర కోసం గడ్డం పెంచారాయన.

రెట్రో లుక్‌
లవర్‌బాయ్‌ నాగచైతన్య కూడా గడ్డం గ్యాంగ్‌కి   తోడయ్యారు. కెరీర్‌లో ఎక్కువ శాతం లవర్‌బాయ్‌లా కనిపించిన చైతూ ‘మజిలీ’లో పూర్తి స్థాయి గడ్డంతో కనిపించనున్నారు. పెళ్లి తర్వాత భార్య సమంతతో చేస్తున్న ఫస్ట్‌ సినిమా ఇది. సాధారణంగా మాస్‌ సినిమాల్లో మన హీరోలు ఇలా గుబురు గడ్డంతో కనిపిస్తుంటే చైతన్య క్లాస్‌ లవ్‌స్టోరీలో గడ్డంతో అభిమానులను అలరించనున్నారు.

గేర్‌ మారింది
ఈ మధ్య లవ్‌స్టోరీలు, లైట్‌హార్ట్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సినిమాల మీద శ్రద్ధ పెట్టిన శర్వానంద్‌ గేర్‌ మార్చారు. సుధీర్‌వర్మ దర్శకత్వంలో చేస్తున్న సినిమా కోసం గడ్డం పెంచారు.  ఇది పీరియాడికల్‌ గ్యాంగ్‌స్టర్‌ డ్రామా. ఇందులో శర్వానంద్‌ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. అందులో ఓ పాత్రలో గ్యాంగ్‌స్టర్‌గా కనిపిస్తారు ఈ యంగ్‌ హీరో. డాన్‌ క్యారెక్టర్‌ వరకూ గడ్డంతో కనిపిస్తారు. ఈ గ్యాంగ్‌స్టర్‌ డ్రామా వచ్చే ఏడాది రిలీజ్‌ కానుంది.

గళ్ల లుంగీ.. గుబురు గడ్డం 
ఈ సంవత్సరం ప్రారంభంలోనే గుబురు గడ్డంతో సందడి చేసిన చిట్టిబాబు గుర్తుండే ఉంటాడు. ‘రంగస్థలం’లో రామ్‌చరణ్‌ పోషించిన పాత్ర ఇది. గళ్ల లుంగీ, గుబురు గడ్డం, అమాయకత్వమే ఈ పాత్ర ఇంతలా గుర్తుండుపోయేలా చేసింది. ప్రస్తుతం చేస్తున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాలోనూ చరణ్‌ గడ్డంతో కనిపించనున్నారు. కానీ ‘రంగస్థలం’ సినిమాలో అంతలా ఉండకపోవచ్చని సమాచారం. 

అంతకు మించి..
మెగా మేనల్లుడు సాయిధరమ్‌ తేజ్‌ కొత్త లుక్‌తో ప్రేక్షకుల ముందుకు రావాలనుకున్నారు. ‘నేను శైలజా’ ఫేమ్‌ కిశోర్‌ తిరుమల దర్శకత్వంలో చేసే ‘చిత్రలహరి’లో గడ్డంతో కనిపించనున్నారు ధరమ్‌తేజ్‌. ఇంతకుముందు కనిపించలేదా? అంటే.. కనిపించారు. అయితే ఈసారి అంతకు మించి. ‘చిత్రలహరి’ ఫుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌తో కూడిన చిత్రమని సమాచారం. 

వీళ్లతో పాటు రెండో సినిమా కోసం మెగా అల్లుడు కల్యాణ్‌ దేవ్, భిన్న కథాంశాలతోప్రేక్షకులను అలరించే శ్రీవిష్ణు కూడా ఫుల్‌గా గడ్డాలు పెంచేశారు. అలాగే ‘డియర్‌ కామ్రేడ్‌’ సినిమాలో విజయ్‌ దేవరకొండ గుబురు గడ్డంలో కనిపిస్తారని టాక్‌. ఇంకొందరు హీరోలు కూడా గడ్డం గ్యాంగ్‌ లిస్ట్‌లో ఉన్నారు. మరి ఈ గుబ్బురు గడ్డాల హీరోలు థియేటర్‌లో చేయబోయే సందడి కోసం వెయిట్‌ చేద్దాం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement