పిల్లలు కావాలనుకున్నప్పుడే పెళ్లి | Taapsee interview about game over | Sakshi
Sakshi News home page

పిల్లలు కావాలనుకున్నప్పుడే పెళ్లి

Published Tue, Jun 11 2019 2:51 AM | Last Updated on Tue, Jun 11 2019 10:43 AM

Taapsee interview about game over - Sakshi

‘‘ప్రేక్షకులు 200–300 రూపాయలు పెట్టి టికెట్‌ కొనుక్కుని రెండు మూడు గంటలు సమయాన్ని వెచ్చించి నా సినిమా చూస్తున్నారు. అలాంటప్పుడు వారిని మెప్పించేలా నా చిత్రాలు ఉండాలి. లేకుంటే వారి డబ్బు, సమయం వృథా. డబ్బు సంపాదించుకోవచ్చు.. కానీ సమయం తిరిగి రాదు.. అందుకే మంచి కథలు ఎంచుకుంటున్నా’’ అని తాప్సీ అన్నారు. ఆమె లీడ్‌ రోల్‌లో అశ్విన్‌ శరవణన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గేమ్‌ ఓవర్‌’. వై నాట్‌ స్టూడియోస్, రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ఎస్‌.శశికాంత్‌ నిర్మించిన ఈ సినిమా తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఈ నెల 14న విడుదలవుతోంది. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లో తాప్సీ పంచుకున్న విశేషాలు...
 

ఈ సినిమాలో వీల్ చైర్ లో కూర్చొని నటించారు కదా ఎలా అనిపించింది?
అవునండీ.. నా లైఫ్ లో ఇప్పటివరకూ ఎలాంటి ఫ్రాక్చర్ జరగలేదు. రెండు కాళ్లు ఫ్రాక్చర్ అయి వీల్ ఛైర్‌లో కూర్చొవడం, నా జీవితంలో ఎప్పుడూ అలాంటి ఎక్స్‌పీరియన్స్ అవ్వలేదు. 60 పర్సెంట్ ఈ సినిమాలో నేను వీల్ చైర్‌లో ఉంటాను. ఫిజికల్లీ అండ్ మెంటల్లీ చాలా డిమాండ్ ఉన్న రోల్ ఇది. యాక్సిడెంట్ జరిగిన ఒక సంవత్సరానికి, మళ్లీ యానివర్సిరీ రియాక్షన్ స్టార్ట్ అయ్యే ఒక ట్రోమా సమస్యతో బాధపడే క్యారెక్టర్. ఆ యాక్సిడెంట్ ఏంటో మీరు సినిమాలో చూడాల్సిందే.

ఏ లాంగ్వెజ్ లో అయినా సినిమాను మీ భుజాలపైనే వేసుకుంటున్నారు. ఎలా హ్యాండిల్ చేయగలుగుతున్నారు? అది కాన్ఫిడెన్స్ అనుకోవచ్చా..?
(నవ్వుతూ)నిజానికి ఆప్షన్స్ దొరకలేదు. ఇలాంటి స్టోరీలే దొరికాయి కాబట్టి, నేనే నా భుజాలపై మోయాల్సి వస్తుంది. నాకు కూడా ఈ కథలు నచ్చాయి. మా డైరెక్టర్స్ కూడా చాలా బ్రిలియంట్. వాళ్లే నాకు హీరోలు. వాళ్లే అసలైన కెప్టెన్స్. నేను స్క్రిప్ట్ చదువుతున్నప్పుడు కానీ.. షూటింగ్ లో ఉన్నప్పుడు కానీ.. సోలో హీరోయిన్ అని.. ప్రెజర్ ఎక్కువ ఉంటుందని.. నేనెప్పుడూ ఆలోచించలేదు. కానీ ఫస్ట్ పోస్టర్ రిలీజ్ చేసినప్పుడు తాప్సీ ఇన్ గేమ్ ఓవర్ అని వార్తలు వచ్చాయి. అప్పుడు కొంచెం స్ట్రెస్ ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఇంతకుముందు ఎప్పుడూ నా పేరు పోస్టర్‌లో రాలేదు. హిందీలో నామ్ షబానా అనే టైటిల్ రోల్ చేసినా కూడా అక్కడ పోస్టర్‌లో పేరు వేయలేదు. ఇది మాత్రం చాలా స్కేరీగా ఉంది. ఇప్పటి వరకూ నేను త్రీ లాంగ్వెజెస్‌లో చేశాను. చాలా లక్కీ.. కానీ నాకు ఇది అసలైన టెస్ట్, కొంచెం నెర్వస్ గా ఉంది.

ఒక స్క్రిప్ట్ ను మీరు ఎంపిక చేసుకునేప్పుడు ఏం చూస్తారు?
కెరీల్ స్టార్టింగ్‌లో అసలు సినిమా అంటే ఏంటీ.. నటన అంటే ఏంటీ నాకు నిజంగా తెలీదు. నేర్చుకోవాలని ఉండేది.. కానీ ఎలాగో తెలిసేది కాదు. చిన్నచిన్నగా నేర్చుకోవడం మొదలుపెట్టాను. చేసిన తప్పులు మరోసారి చేయకుండా చూసుకునేదాన్ని. ఇప్పుడు స్క్రిప్ట్ విని డిసైడ్ చేసుకోగలుగుతున్నా. స్క్రిప్ట్ విన్న ప్పుడు ఆడియన్స్ పెట్టే డబ్బుకు నేను న్యాయం చేయగలుగుతానా, నా కథ నచ్చుతుందా అని ఆలోచిస్తాను. వాళ్లు పెట్టే డబ్బుకు, టైమ్ కు నా సినిమా నచ్చుతుందా అని ఆలోచిస్తున్నాను.

మీరు రియల్ లైఫ్ లో వీడియో గేమ్స్ ఆడుతారా?
ఆడేదాన్ని.. స్కూల్, కాలేజ్ డేస్‌లో ఉన్నప్పుడు మారియో, బాట్ మాన్, కాంట్రా ఆడేదాన్ని. ఆ తరువాత ఆడలేదు.

బద్లా సినిమా 100 కోట్లు పైగా కలెక్ట్ చేసింది. మీరు ఆడియన్స్‌లో ఎక్స్‌పెక్టేషన్స్ పెంచేశారని అనుకోవడంలేదా?
అవును.. నా నుండి మంచి సినిమాలు రావాలని ఆడియన్స్ కూడా కోరుకోవాలనుకుంటాను. ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా కిక్ ఏముంటుంది. ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా సినిమాలు తీసి మాత్రం ఉపయోగం ఏముంది. 100 కోట్లు కలెక్ట్ చేస్తుందా అంటే ఏం చెప్తాం. మ్యాగ్జిమమ్ నా సినిమా అంత కలెక్ట్ చేయాలని ట్రై చేస్తా.. కానీ బద్లా బిగ్ సర్ ప్రైజ్ అందరికీ. ఇంత కలెక్ట్ చేస్తుందని కూడా అనుకోలేదు. అది నాకు చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చింది. ఆడియన్స్ ఏదో నవ్వుకోడానికో, ఏదో పాటల కోసమో రారు. థ్రిల్ ఎంజాయ్ చేయడానికి కూడా వస్తారు. అయితే మనం వాళ్లను స్టోరీతో ఎంత ఎంగేజ్ చేస్తున్నాం అనేది ముఖ్యం. గేమ్ ఓవర్ అలాంటిదే..

ఈ సినిమాలో సింగిల్ క్యారెక్టర్ కదా.. ఒక్క క్యారెక్టర్ ఆడియన్స్‌ను ఎంగేజ్ చేయడం ఛాలెంజింగ్‌గా అనిపించడం లేదా?
ఒక యాక్టర్‌కు ఇది నిజంగా పరీక్ష లాంటిది. 95 పర్సెంట్ నన్నే చూడాలి ఈ సినిమాలో మీరు.. నా పెర్ఫామెన్స్ తో మీరు రెండు గంటలు సినిమా చూడాలి. మీకు ఆప్షన్ లేదు.. ఇది నాకు టెస్ట్ లాంటిది.

హిందీలో సాండ్ కీ ఆంఖ్ చేస్తున్నట్టున్నారు? ఆ రోల్ ను ఒప్పుకోవడానికి డిఫరెంట్ రోల్స్ చేయాలన్న భావనే కారణమా?
డిఫరెంట్ రోల్ అండ్ టూ హీరోయిన్ ఒరియంటెడ్ సినిమా కోసం చూస్తున్నాను.. ఆ టైంలో సాండ్ కీ ఆంఖ్ దొరికింది. 65 ఇయర్ ఓల్డ్ గెటప్ లో నటించడం చాలా హ్యాపీగా ఉంది. నాకు ఎక్స్‌పెరిమెంట్స్ అంటే చాలా ఇష్టం అందుకే ఈ స్టోరీ నా దగ్గరకు వచ్చిన వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాను.

మీరు ఇప్పుడు మంచి ఫేజ్ లో ఉన్నారు.. ఇయర్‌కు 3 నుండి 4 సినిమాలు అది కూడా క్వాలిటీ అండ్ క్వాంటిటీ సినిమాలు ఎంపిక చేసుకోవడం ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు..?
దేవుని దయ వల్ల నా దగ్గరకు మంచి స్టోరీలే వచ్చాయి.. సో కథలు సెలక్ట్ చేసుకోవడం పెద్దగా కష్టం అనిపించలేదు. సో హ్యాపీగా ఇయర్ కి మూడు నాలుగు సినిమాలు సెలక్ట్ చేసుకొని, వర్క్ చేసుకుంటూ వెళ్లిపోవడమే. కొంచెం ఎక్కువ వర్క్ చేయాల్సి ఉంటుంది. కానీ నాకు ఇయర్ కు మూడు నాలుగు సినిమాలు చేయడం ఇష్టం.

అక్షయ్ కుమార్ తో వర్క్ చేశారు కదా.. ఆ ఎక్స్ పీరియన్స్ ఎలా ఉంది..?
అక్షయ్ సార్ సాధించిన దాంట్లో సగం సాధించినా చాలు నేను రిటైర్ అవ్వొచ్చు (నవ్వుతూ)

రెగ్యులర్ కమర్షియల్ మూవీస్ మిస్ అవుతున్నారా..?
ఎక్కువ కాదు... కొంచెం మిస్ అవుతున్నా. కమర్షియల్ మూవీ డెఫినేషన్ మారిపోయింది. మంచి స్టోరీ ఉన్న మూవీ వస్తే గ్లామరస్ రోల్ చేయొచ్చు. కానీ స్టోరీ కూడా ఉండాలి..

ప్రస్తుతం చేస్తున్న సినిమాలు ఏంటి..?
తమిళ్ లో ఒక సినిమా ఫైనల్ అయింది. గేమ్ ఓవర్ రిలీజ్ తరువాత ఆ సినిమా ప్రారంభం కానుంది. తెలుగులో రెండు మూడు స్టోరీలు విన్నా ఇంకా ఫైనలైజ్ కాలేదు. కానీ సంవత్సరానికి ఒక సినిమా మాత్రం పక్కా తీస్తా.

అశ్విన్ శరవనన్ ఈ సినిమాను హ్యాండిల్ చేస్తాడని మీకు అంత నమ్మకం ఎలా కలిగి ఈ స్టోరీ ఒప్పుకున్నారు..?
మయూరి సినిమా చూశారా..? ఈ సినిమా మొత్తం ఒకేసారి చూడలేదు... నాకు చాలా భయం. పార్ట్ పార్ట్‌లుగా చూశాను. తను చాలా బ్రిలియంట్.. రైటింగ్ స్కిల్స్ కూడా సూపర్.. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్. మాయ చూడలేదు. కానీ స్టోరీ చదివాను.. చదివిన దానికంటే సినిమా చాలా బెటర్ ఉంది. అందుకే తనపై నమ్మకంతోనే సినిమా చేశా..

మిమ్మల్ని డైరెక్టర్స్ యాక్ట్రెస్ అని అనొచ్చా..?
తప్పకుండా నేను డైరెక్టర్స్ యాక్ట్రెస్‌నే, వారు నాకు చాలా బిగ్గెస్ట్ సపోర్టింగ్ సిస్టమ్ లాంటి వాళ్లు. నా కెరీర్‌లో నేను ఎదగడానికి చాలా హెల్ప్ చేసినవాళ్లు, నేను ఇప్పుడు ఈ స్టేజ్‌లో ఉన్నానంటే వాళ్లే కారణం.

పెళ్లి చేసుకునే ప్లాన్స్ ఇప్పుడేమైనా ఉన్నాయా?
ఇప్పుడైతే లేవండి.. ఒక ఫ్యామిలీ స్టార్ట్ చేయాలన్న ఆలోచన వచ్చినప్పుడే పెళ్లి చేసుకుంటాను.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement