
బాహుబలి.. వసూళ్లపై అధికార దందా
♦ కాసుల కోసం టీడీపీ నేతల కక్కుర్తి
♦ టికెట్ల ధరలు భారీగా పెంపు
♦ రెవెన్యూ.. పోలీస్ యంత్రాంగం మౌనం
♦ కొత్త కలెక్టర్ కల్పించుకోవాలంటున్న జనం
చిత్తూరు (అర్బన్): బాహుబలి–2 విడుదల కావడానికి ఒక్కరోజు మాత్రమే గడువు ఉంది. రెండేళ్ల క్రితం విడుదలైన బాహుబలి మొదటిభాగం డిస్ట్రిబ్యూటర్లకు కాసుల వర్షం కురిపించడంతో ఈ సారి ఆ సొమ్ముపై చిత్తూరులోని కొందరు టీడీపీ నాయకుల కన్ను పడింది. భారీగా టికెట్ల ధరలను పెంచేసి అమ్ముకుంటున్నారు. జిల్లా కలెక్టర్ కల్పించుకుంటే తప్ప ఈ వ్యవహారంలో తామేమీ చేయలేమని అధికారులు చేతులెత్తేస్తున్నారు.
వసూళ్లపైనే దృష్టి..
బాహుబలి–2 (కన్‌క్లూజన్) సినిమాపై ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉంది. ఈ నెల 28న చిత్తూరు నగరంలోని నాలుగు థియేటర్లలో చిత్రాన్ని ప్రదర్శించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. చిత్రం విడుదలైన 15 రోజుల్లో బాక్సు కొన్న మొత్తం వచ్చేసే అవకాశం ఉందని నిపుణులు అంచనాలు వేస్తున్నారు. ఇక్కడే సినిమాపై టీడీపీ నాయకుల కన్ను పడింది. ఎలాగైనా సినిమా ప్రదర్శనను తమ చేతుల్లోకి తీసుకోవాలని.. వచ్చే భారీ వసూళ్లలతో జేబులు నింపుకోవాలని స్కెచ్ వేశారు. తొలిరోజు ప్రదర్శించబడే ఫ్యాన్సీ షోను అభిమాన సంఘ నాయకులు చేజిక్కించుకోవడం, రూ.50 టికెట్లను ఏకంగా రూ.200 వరకు అమ్ముకోవడం ఇక్కడ అందరూ చేసేదే. అయితే ఫ్యాన్సీ షోతో పాటు వారం రోజుల గ్రాస్ కలెక్షన్‌ను ఎలాంటి పెట్టుబడి లేకుండా తమ కైవసం చేసుకోవడానికి చిత్తూరు నగరంలో దాదాపు 12 ఏళ్లుగా ప్రభాస్ అభిమాన సంఘ నాయకుడిగా పనిచేస్తున్న వ్యక్తికి తొలుత చెక్ పెట్టారు.
అసలు ఈ వ్యక్తి ప్రభాస్ అభిమాని కాడని.. అసలైన ప్రభాస్ అభిమానుల సంఘ అధ్యక్షుడిని తానేనంటూ కొత్త వ్యక్తి తెరపైకి వచ్చాడు. ఫ్యాన్సీ షో నిర్వహణ బాధ్యత తామే దక్కించుకున్నట్లు పత్రికా ప్రకటనలు కూడా ఇచ్చేశాడు. చివరకు ఈ వ్యవహారంలో హీరోప్రభాస్ కల్పించుని ఫోన్‌లో అభిమానులతో మాట్లాడారు. ఎలాంటి గొడవలు లేకుండా చిత్ర ప్రదర్శన నిర్వహించాలని ఆదేశించారు.కాగా నాలుగు థియేటర్లలో ప్రదర్శితమయ్యే ఫ్యాన్సీ షోల్లో తనకు వాటాలు ఇవ్వాలని టీడీపీ నాయకుల షరతుతో చిత్ర ప్రదర్శనకు లైన్ క్లియర్ చేసుకున్నా రు. ఫ్యాన్సీ షోలతో వచ్చే డబ్బులతో నిరుపేదలకు తాము సేవా కార్యక్రమాలు చేస్తుంటే.. టీడీపీ నాయకులు ఇలా దందాలకు దిడం భావ్యం కాదని ప్రభాస్ అభిమానుల సంఘ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
చేతులు కలిపిన నిర్వాహకులు..?
టీడీపీ నేతల ప్రణాళికలకు చిత్తూరులోని మూడు థియేటర్లను నిర్వహిస్తున్న వ్యక్తి చేతులు కలిపినట్లు సమాచారం. బాహుబలి–2 చిత్ర ప్రదర్శనలో తొలి 15 రోజులపాటు రూ.50 విక్రయించే టికెట్లను రూ.150కు విక్రయించడానికి ఒప్పందం చేసుకున్నారు. తనకు ఒక్కో టికెట్టుకు రూ.వంద, మిగిలిన రూ.50 టీడీపీ నేతలకు ఇవ్వడానికి అంగీకరించినట్లు తెలిసింది. పోలీసు, రెవెన్యూ అధికారుల నుంచి ఇబ్బందులు వస్తే మీరే చూసుకోవాలంటూ టీడీపీ నేతల నుంచి హామీ కూడా తీసుకున్నారు. తాను చెప్పిన రేట్లకు టికెట్లు విక్రయిస్తేనే బాక్సు వారం రోజులకు లీజుకు ఇస్తానని మరో థియేటర్ నిర్వాహకుడిని బలవంతంగా ఈ రొచ్చులోకి లాగారు. ఇప్పటికే ఈ వ్యవహారం పోలీసులకు, రెవెన్యూ అధికారుల దృష్టికి వెళ్లింది. అయితే చిత్తూరులో టీడీపీ నాయకులు గీసిన గీతను దాటని పోలీసు, రెవెన్యూ అధికారులు ఇప్పుడు కూడా మౌనం వహిస్తున్నారు. జిల్లాకు కొత్తగా వచ్చిన కలెక్టర్ ప్రద్యూమ్న థియేటర్ల బ్లాక్ టికెట్ల వ్యాపారానికి చెక్ పెట్టాలని సగటు ప్రేక్షకుడు కోరుకుంటున్నారు.