
ధనుష్, కార్తీలతో నదియా ఢీ
స్టార్ హీరోలు ధనుష్, కార్తీలతో సీనియర్ నటి నదియా ఢీ కొట్టడానికి సిద్ధం అవుతున్నారు. సాధారణంగా స్టార్ హీరోల చిత్రాల విడుదల సమయంలో వాటికి పోటీగా విడుదల చేయడానికి ఇతర చిత్రాల దర్శక నిర్మాతలు సాహసం చేయరు. అలాంటిది నదియా తన సహ నటీమణులు, యువ నాయికలతో పోటీకి సై అంటుండడం విశేషం. వివరాల్లోకెళితే నటుడు ధనుష్ ద్విపాత్రాభినయం చేసిన కొడి, కార్తీ త్రిపాత్రాభినయం చేసిన కాష్మోరా చిత్రాలు దీపావళికి తెరపైకి రానున్నాయి. వాటికి పోటీగా నదియా, కోవైసరళ, ఇనియ,ఆర్తి, ఈడన్, హారతి మొదలగు నాటి నేటి ప్రముఖ తారామణులు నటించిన చిత్రం తిరైక్కు వరాద కథై.
ఈ చిత్రంలో ప్రధాన విశేషం ఏమిటంటే ఒక్క నటుడు కూడా మచ్చుకైనా కనిపించడు. అందరూ తారామణులతో తెరకెక్కిన తొలి చిత్రం ఇదే అని చెప్పవచ్చు. నటి నదియా ఇందులో పోలీస్ అధికారిగా ఒక పవర్‌ఫుల్ పాత్రలో నటించారు. చాలా కాలం తరువాత ఆమె నటించిన తమిళ చిత్రం ఇది. మలయాళంలో సూపర్‌స్టార్స్ మమ్ముట్టి, మోహన్‌లాల్ వంటి వారితో చిత్రాలు చేసిన ప్రముఖ దర్శకుడు తులసిదాస్ రూపొందించిన చిత్రం తిరైక్కు వరాద కథై. హారర్, సస్పెన్స్ థ్రిల్లర్‌తో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఎంజేడీ ప్రొడక్షన్స్ పతాకంపై కే.మణికంఠన్ భారీ ఎత్తున నిర్మించారు.
కళాశాలలో చదువుకుంటూ హాస్టల్‌లో నివసించే స్నేహితుల ఇతివృత్తంగా రూపొందిన ఇందులో ఇంతకు ముందు పెద్ద వివాదానికి దారి తీసిన హిందీ చిత్రం ఫైర్ తరహా సన్నివేశాలు చోటు చేసుకుంటాయని తెలిపారు. ఇద్దరు యువతుల మధ్య ప్రేమ పెళ్లికి దారి తీసే పాశ్చాత్య దేశాల సంస్కృతికి అద్దం పట్టే విధంగా తిరైక్కు వరాద కథై చిత్రంలో కొన్ని సన్నివేశాలు చోటు చేసుకుంటాయన్నారు. ప్రేమ, ఈర్ష్య కారణంగా స్నేహితురాళ్ల మధ్య జరిగే పరిణామాల తీవ్రత ఎలా ఉంటుందనే కోణంలో ఆవిష్కరించిన చిత్రం ఇదని చెప్పారు.
ఈ చిత్రాన్ని తమిళంతో పాటు తెలుగు,కన్నడం,మలయాళం భాషల్లోనూ విడుదల చేయనున్నట్లు తెలిపారు. తెలుగులో కొన్ని ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థల అధినేతలు హక్కులను అడుగుతున్నారని, వారితో చర్చలు జరుగుతున్నాయని నిర్మాత మణికంఠన్ చెప్పారు.