జై 2017.. మన హీరోలు దుమ్మురేపారు! | top tollywood heros of 2017 | Sakshi
Sakshi News home page

Published Thu, Dec 28 2017 6:09 PM | Last Updated on Thu, Dec 27 2018 4:17 PM

top tollywood heros of 2017 - Sakshi

కొందరు సిక్సులు బాదారు.. మరికొందరు ఫోర్లు కొట్టారు.. ఇంకొందరు యావరేజ్‌గా ఆడినా మొత్తానికి టాలీవుడ్‌ని 2017లో గెలిపించారు. సంవత్సరం ప్రారంభంలోనే అదిరిపోయే హిట్స్‌ వచ్చాయి. టాలీవుడ్‌ బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిసింది. టాలీవుడ్‌ ఇండియన్‌ రికార్డ్సు కూడా బద్దలుకొట్టింది. దేశం మొత్తం టాలీవుడ్ వైపు చూసింది. హీరోలు కథలను ఎంచుకోవడంలో మార్పు కనిపించింది. పాతతరం హీరోలు సైతం తమ స్టామినాను చాటుకున్నారు. యువ హీరోలకు సవాల్‌ విసిరారు. ఈ ఏడాది హీరోయిజానికి కాకుండా కథలకు వెండితెర పట్టంకట్టింది. ఈ పరిణామం మంచిదే. అయితే కొన్నిసక్సెస్‌ అవ్వొచ్చు, మరికొన్ని కాకపోవచ్చు. 2017 వెళ్లిపోతున్న ఈ తరుణంలో ఈ ఏడాది అదరగొట్టిన టాలీవుడ్‌ హీరోలపై ఓ లుక్కేద్దాం..

మెగాస్టార్‌ గ్రాండ్‌ ఎంట్రీ..
దాదాపు 9 ఏళ్ల నిరీక్షణ అనంతరం మెగా అభిమానుల కల నిజమైంది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన మెగాస్టార్‌ చిరంజీవి 150వ సినిమా ఖైదీ నం.150 ఈ ఏడాది జనవరిలో విడుదలైంది. నాన్‌ బాహుబలి రికార్డులను బద్దలు కొట్టింది. రీ ఎంట్రీతో తన స్టామినా ఏంటో ఇండస్ట్రీకి చూపించారు. విశ్లేషకులు సైతం ఆశ్చర్యపోయేలా ఈ సినిమా రికార్డులను బ్రేక్‌ చేసింది. ఈ విజయం ఇచ్చిన ఊపుతో 151వ సినిమాను చేయడానికి సిద్ధమయ్యారు. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో నటిస్తున్నారు.

బాలకృష్ణ
సంక్రాంతి బరిలో దిగిన బాలయ్యకు ఈ ఏడాది కలిసొచ్చింది. గౌతమీపుత్ర శాతకర్ణిగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉన్న దర్శకుడు క్రిష్‌. ఆయన కథను నడిపించిన విధానం, యుద్ధ సన్నివేశాలు, బాలకృష్ణ నటన అన్నీ కలిసి ఈ సినిమాను విజయతీరాలకు చేర్చాయి. ప్రతీ ఫ్రేమ్‌లో క్రిష్‌ పనితనం కనిపిస్తుంది. బాలయ్య తన మార్క్‌ కనిపించేలా డైలాగ్స్‌తో ఆకట్టుకున్నాడు. విమర్శకుల నుంచి ప్రశంసలు వచ్చాయి. పూరీ డైరెక్షన్‌లో వచ్చిన  'పైసావసూల్‌' కూడా ఈ సంవత్సరమే విడుదలైంది.

ప్రభాస్‌
ఈ సంవత్సరం ప్రభాస్‌కు బాగా కలిసొచ్చింది. బాహుబలితో జాతీయ స్థాయి హీరోగా ఎదిగారు. దాదాపు ఐదు సంత్సరాలు కష్టపడి తీసిన బాహుబలికి ప్రపంచస్థాయిలో సంచలన విజయం సాధించింది. ప్రభాస్‌కు టాలీవుడ్‌లోని హీరోలందరికంటే ఎక్కువ గుర్తింపు వచ్చింది. భారతీయ సినీ చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన రెండో చిత్రంగా బాబహుబలి-2 రికార్డుకెక్కింది. ఈ క్రేజ్‌ని ప్రభాస్‌ నిలబెట్టుకుంటాడా అన్నది చూడాలి.

రానా దగ్గుబాటి
రానా ముందు నుంచీ విలక్షణ పాత్రలను చేస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ఈ సంవత్సరం మూడు సినిమాలతో ప్రేక్షకులను అలరించారు. బాహుబలి, ఘాజీ, నేనే రాజు నేనే మంత్రి ఈ  మూడు చిత్రాలు విభిన్నమైనవే. బాహుబలిలో ప్రతినాయకుడి పాత్రలో ఒదిగిపోయారు. సబ్‌మెరైన్‌ కథతో తెరకెక్కిన ఘాజీ చిత్రంలో నేవీ ఆఫీసర్‌గా పాత్రకు ప్రాణం పోశారు. చాలాకాలంగా సరైన హిట్‌ కోసం ఎదురుచూస్తున్న డైరెక్టర్‌ తేజ 'నేనే రాజు నేనే మంత్రి' సినిమాతో మళ్లీ సక్సెస్‌ బాట పట్టారు. రానాతో తీసిన ఈ సినిమా మంచి విజయం సాధించింది. రాజకీయ నాయకుడిగా రానా నట విశ్వరూపాన్ని చూపించారు. మొత్తానికి రానాకు ఈ సంవత్సరం అన్నీ హిట్లతో ఆనందంగా గడిచింది.

విజయ్‌ దేవరకొండ
పెళ్లిచూపులు సినిమాతో అందరినీ ఆశ్చర్యానికీ గురి చేశాడు విజయ్‌ దేవరకొండ. జాతీయ స్థాయిలో ఈ సినిమాకు అవార్డు లభించింది. ఈ ఏడాది 'అర్జున్‌ రెడ్డి'గా వచ్చి ఇండస్ట్రీ దృష్టిని తనవైపు తిప్పుకున్నారు. వివాదాల మధ్యలో ఈ సినిమా విడుదలైనా పెద్ద విజయాన్ని సాధించింది. రాత్రికి రాత్రి  విజయ్‌ సూపర్‌స్టార్‌గా ఎదిగాడు. తన వయసుకు తగ్గ కథ, ఆ పాత్రలో తను లీనమైన తీరు, నటనలో పరిణతి ఈ సినిమాను మరోమెట్టు ఎక్కించాయి. విజయ్‌ తప్ప ఇంకెవరూ ఆ పాత్రకు న్యాయం చేయలేరన్నంతగా నటించారు.

జూనియర్‌ ఎన్టీఆర్‌
తనకు ఏ పాత్ర ఇచ్చినా అవలీలగా చేయగలిగే ఎన్టీఆర్‌.. ఈ ఏడాది త్రిపాత్రాభినయంతో అదరగొట్టారు. వరుస హిట్స్‌తో దూసుకుపోతున్న ఆయన ఈ ఏడాది 'జైలవకుశ'గా మన ముందుకు వచ్చారు. ప్రతినాయకుడి ఛాయలున్న 'జై' పాత్రతో ఎన్టీఆర్‌ తన నటవిశ్వరూపాన్ని చూపారు.  

మహేశ్‌బాబు
తమిళ డైరెక్టర్‌ మురుగదాస్‌, మహేశ్‌ బాబు కలయికలో భారీ అంచనాలతో వచ్చిన సినిమా స్పైడర్‌.. తమిళ, తెలుగు భాషల్లో విడుదలైన ఈ సినిమా అంచనాలను అందుకోలేకపోయింది. బాక్సాఫీస్‌ వద్ద బోల్తాపడింది. మహేశ్‌ నటనకు విశ్లేషకుల ప్రశంసలు దక్కాయి. శ్రీమంతుడు లాంటి భారీ హిట్‌ ఇచ్చిన డైరెక్టర్‌​ కొరటాల శివతో 'భరత్‌ అను నేను' సినిమాను మహేశ్‌ చేస్తున్నాడు. వచ్చే ఏడాది ఎలాగైనా సూపర్‌హిట్‌ కొట్టాలనే కసితో ప్రిన్స్‌ ఉన్నాడని ఈ చిత్రం విశేషాలను బట్టి తెలుస్తోంది.

నాని
టాలీవుడ్‌లో అదృష్టం ఎవరికైనా ఉందంటే అది నానికే. ఈ ఏడాది విడుదలైన మూడు సినిమాలు విజయవంతమయ్యాయి. నేను లోకల్‌, నిన్ను కోరి, ఎంసీఏ ఇలా వరుస హిట్స్‌తో నాని అదరగొట్టారు. నటన విషయంలో నాని ఒక్కో సినిమాకి ఒక్కో మెట్టు ఎక్కుతున్నారు. టాలీవుడ్‌లో తనకుంటూ ప్రత్యేక స్థానాన్ని సృష్టించుకున్నారు. నాచురల్‌ స్టార్‌గా తన సహజమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.

శర్వానంద్‌
టాలీవుడ్‌లో యువ హీరోల హవా కొనసాగుతోంది. ఈ ఏడాది యువ హీరోలందరూ విజయాలతో దూసుకెళ్లారు. శతమానం భవతి, రాధ, మహానుభావుడు వంటి మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు శర్వానంద్‌. శతమానం భవతి సినిమాకి జాతీయ స్థాయిలో అవార్డు లభించింది.  రాధ పర్వాలేదనిపించినా.. మహానుభావుడుతో హిట్‌ కొట్టారు. అతి శుభ్రం అనే వ్యాధితో బాధపడే వ్యక్తి పాత్రలో శర్వానంద్‌ నటించి మెప్పించారు. మారుతి తనదైన శైలిలో వినోదాత్మకంగా సినిమాను రూపొందించారు.

అల్లు అర్జున్‌
మెగా కార్డ్‌తో ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్‌ తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకున్నారు. వరుస హిట్స్‌తో రాకెట్‌లా దూసుకుపోతున్నారు. రేసుగుర్రం, సన్‌ ఆఫ్‌ సత్యమూర్తి, సరైనోడు లాంటి హిట్‌లతో ఉన్న అల్లు అర్జున్‌ ఈ సంవత్సరం 'డీజే దువ్వాడ జగన్నాథం'గా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. హరీశ్‌ శంకర్‌ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా విజయవంతమైంది. అదే ఊపులో కథా రచయిత వక్కంతం వంశీని డైరెక్టర్‌గా పరిచయం చేస్తూ 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' సినిమాలో అల్లుఅర్జున్‌ నటిస్తున్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement