![వంశీ గారు పాటలు చేయడమే మా అదృష్టం!](/styles/webp/s3/article_images/2017/09/3/41447096886_625x300.jpg.webp?itok=ppWbmRs2)
వంశీ గారు పాటలు చేయడమే మా అదృష్టం!
ఆ కుర్రాడు ముగ్గురు అమ్మాయిలను ప్రాణంగా ప్రేమించాడు. మరి చివరకు ఎవరిని దక్కించుకున్నాడనే కథాంశంతో లవ్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన చిత్రం ‘ఈ సినిమా సూపర్‌హిట్ గురూ’. హెచ్.హెచ్.మహదేవ్, సిరిశ్రీ, పునర్ణవి భూపాలం, ఐశ్వర్య నాయకా నాయికలుగా చెందు ముద్దు దర్శకత్వంలో సినీ నిలయ క్రియేషన్స్ పతాకంపై పి.ఎస్.సూర్యతేజారెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. దర్శకుడు వంశీతో పాటు మారుతీరాజా స్వరాలందించిన ఈ చిత్రం పాటల వేడుక ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో జరిగింది. పాటల సీడీని సంగీత దర్శకుడు ఆర్.పి.పట్నాయక్ ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ- ‘‘ఇలాంటి టైటిల్ పెట్టాలంటే గట్స్ ఉండాలి. టైటిల్ లానే సినిమా కూడా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నా’’ అని చెప్పారు.
దర్శకుడు మాట్లాడుతూ -‘‘వైజాగ్ సత్యానంద్ కారణంగానే ఈ సినిమా అవకాశం వచ్చింది. సీనియర్ దర్శకులు వంశీగారు ఇందులో రెండు పాటల్ని స్వరపరచడం నా అదృష్టం’’ అన్నారు. నిర్మాత బెక్కెం వేణుగోపాల్ మాట్లాడుతూ -‘‘చెందు నన్ను సినిమా చూడమంటే, చూశా. ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకూ ఆసక్తికరంగా తీశారు’’ అని చెప్పారు. ఈ వేడుకలో దర్శకులు క్రాంతిమాధవ్, చంద్రమహేశ్, కాశీవిశ్వనాథ్, దేవీప్రసాద్, నటి హేమ పాల్గొన్నారు.