
‘‘అర్జున్ రెడ్డి’ సినిమా తర్వాత గీతా ఆర్ట్స్ బ్యానర్లో సినిమా చేస్తున్నపుడు స్వప్న ఫోన్ చేసి ‘మహానటి’ చిత్రం గురించి చెప్పింది. వివరాలు అడక్కుండా ఒప్పేసుకున్నా. ఎందుకంటే.. స్వప్న, నాగీ (నాగ్ అశ్విన్) ఇద్దరూ నాకు ఫ్రెండ్స్’’ అని హీరో విజయ్ దేవరకొండ అన్నారు. నేడు ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో విజయ్ విలేకరులతో మాట్లాడుతూ– ‘‘మహానటి’ చిత్రంలో జెమినీ గణేశన్ పాత్ర కోసం మొదట దుల్కర్‌ని అడిగితే డేట్స్ కుదరలేదు. అందుకే నాగీ నన్ను చేయమన్నాడు. నాకేమో ఆ పాత్ర చేయగలనా? అనే భయం ఉండేది. ఎలాగైనా చేసేయాలి అనుకున్నా. మళ్లీ దుల్కర్ ఒప్పుకోవడంతో నేను తప్పించుకున్నా. ఫైనల్లీ విజయ్ ఆంటోనీ పాత్రకు ఫిక్సయ్యాను.
ఈ చిత్రంలో సమంతలాంటి స్టార్‌తో నటించడం సరదాగా అనిపించింది. ఆమె చాలా హుషారుగా, ఎప్పుడూ జోక్స్ వేస్తూ ఉంటారు. తెలుగు, తమిళ సినిమాలు దగ్గరగా ఉంటాయి. కాబట్టి తమిళంలో నటించినా వర్కవుట్ అవుతుంది. కానీ, హిందీ అలా కాదు. పూర్తిగా భిన్నంగా ఉంటుంది. అందుకే హిందీవైపు దృష్టి పెట్టడంలేదు. ‘అర్జున్ రెడ్డి’ సక్సెస్ తర్వాత కథలు ఎంచుకోవడంలో యాటిట్యూడ్ కొంత మార్చాను. ఒక టాక్సీ డ్రైవర్‌ను తీసుకెళ్లి రకరకాల పరిస్థితుల్లో పడేస్తే అతని కథ ఎలా ఉంటుందన్నదే ‘టాక్సీవాలా’ కథ. ‘నోటా’ సినిమాలో కొంచెం యాంగ్రీగా కనిపిస్తాను. ఇదొక ఫిక్షనల్ స్టోరీ. చాలా కొత్తగా ఉంటుంది’’ అన్నారు.