ఆ రూమర్ నన్ను ఇబ్బంది పెట్టింది : విశాల్
ఆ రూమర్ నన్ను ఇబ్బంది పెట్టింది : విశాల్
Published Tue, Jun 24 2014 11:36 PM | Last Updated on Sat, Sep 2 2017 9:20 AM
వాణిజ్య చిత్రాలతో పాటు ప్రయోగాలకు ప్రాధాన్యమిచ్చే విశాల్ ఇటీవలే ‘ఇంద్రుడు’గా తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చారు. హైదరాబాద్ వచ్చిన విశాల్‌తో ‘సాక్షి’ జరిపిన సంభాషణ.
ఉన్నట్లుండి ఇలా ప్రయోగాల బాట పట్టారేం?
ఇప్పుడు చేయపోతే... ఇంకెప్పుడు చేయలేం. అసలు ఇలాంటి పాత్రలు చేసే సామర్థ్యం నాకుందా? అనే మీమాంసలో ఉండేవాణ్ణి మొదట్లో. ‘వాడు-వీడు’ చిత్రంతో ప్రయోగాలు చేయొచ్చని అర్థమైంది. ఏళ్ల తరబడి ప్రేక్షకుల హృదయాల్లో ఉండాలంటే ఇలాంటి పాత్రలే కరెక్ట్. వాణిజ్యపరంగా చూసుకుంటే ఇది రిస్కే. అందుకని రొటీన్‌గా వెళ్లమంటే నా వల్ల కాదు.
‘ఇంద్రుడు’లో నార్కొలస్పీ డిజార్డర్‌తో బాధపడే పాత్ర చేశారు కదా. దీనికోసం ఏమైనా హోమ్‌వర్క్ చేశారా?
సాధారణంగా పోరాటాలు, నృత్యాల సమయంలో కష్టం ఎక్కువగా ఉంటుంది. కానీ ఈ సినిమా విషయంలో మాత్రం ఆ పడిపోయే సన్నివేశాలే కష్టంగా అనిపించాయి. నిల్చున్నవాణ్ణి నిల్చున్నట్లే పడిపోవాలి. చేతుల్ని నేలకు బేలన్స్ చేయకూడదు. దాంతో భారీగా దెబ్బలు తగిలేవి. వాటన్నింటినీ భరిస్తూ చేశాను. హీరో అంటే.. ‘విలన్లను ఒంటిచేత్తో కొట్టేయాలి’ అనేది చాలామంది అభిప్రాయం. కానీ... ఇందులో కంటి ముందు హీరోయిన్‌ని కొట్టి చంపుతుంటే.. నిద్రపోతాను. ఈ కథ విని కొంతమంది శ్రేయోభిలాషులు వద్దని వారించారు. కానీ నాకు మాత్రం ఈ కథ బాగా నచ్చింది.
మీరు తెలుగబ్బాయి. కానీ... తమిళ సినిమాకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు. కారణం?
నేను పుట్టింది, పెరిగిందీ చెన్నయ్‌లో. సహాయ దర్శకునిగా కెరీర్ మొదలుపెట్టిందీ అక్కడే. అందుకే.. ఆ పరిశ్రమపై మక్కువ ఎక్కువ. ఒకవేళ ఇక్కడే పుడితే ఇలా జరిగేది కాదేమో. నేను తెలుగువాణ్ణి కాబట్టే.. మాతృభాషలో కూడా మంచి పేరు తెచ్చుకోవాలని మా నాన్నగారు తపించారు. అందుకే ఇక్కడా విజయాలు అందుకోగలిగా. త్వరలో తెలుగులో ఓ సినిమా చేయబోతున్నాను. అందులోనూ నా పాత్ర భిన్నంగానే ఉంటుంది. శ్రీనువైట్ల సహాయకుడు శశికాంత్‌ని ఈ సినిమా ద్వారా దర్శకునిగా పరిచయం చేస్తున్నాను. ‘శివ’ను గుర్తుచేసేలా ఉంటుందీ సినిమా. అక్టోబర్‌లో మొదలుపెడతాం.
అన్ని భాషా చిత్రాలూ చూస్తుంటారు కదా. కథల విషయంలో ఎవరు ముందున్నారంటారు?
వందశాతం తమిళ సినిమానే. బాలీవుడ్ అంతా ఇప్పుడు మన సౌత్ సినిమాలపైనే ఆధారపడింది. ఇక తెలుగు సినిమా మాత్రం హీరోల ఇమేజ్‌లు, భారీ తనానికే ప్రాధాన్యత ఇస్తోంది. కానీ... తమిళంలో అలా కాదు. కథకే అక్కడ తొలి ప్రాముఖ్యత.
ఇటీవల మీపై కూడా రకరకాల రూమర్లు వినిపిస్తున్నాయి. వాటిని వింటుంటే ఏమనిపిస్తుంది?
పట్టించుకోను. అయితే.. ఈ మధ్య ఓ రూమర్ మాత్రం కాస్త ఇబ్బంది పెట్టింది. శ్రీయతో కలిసి నేను హిమాలయాలకు వెళ్లానట. ఆ రాసిన వారికి ఫోన్ చేశాను. నేను వెళ్లినట్లు మీకెలా తెలుసు? సాక్ష్యాలేమైనా ఉన్నాయా? హిమాలయాలంటే నాకిష్టం... వెళ్తాను. శ్రీయతో వెళ్లాల్సిన పనేంటి? అని అడిగేశాను. మా నాన్న అయితే.. నాపై ఇలాంటి రూమర్లు పేపర్‌లో రాగానే వాటిని కట్ చేసి దాచుకుంటారు. ఎందుకంటే మా అబ్బాయి పేరు న్యూస్ పేపర్‌లో వచ్చిందని ఆయన ఆనందం.
ఇంతకూ మీ పెళ్లెప్పుడు?
నేను పెళ్లికి రెడీ అవ్వలేదు. పెళ్లంటే ఒక పనిగా చేసుకోకూడదు. ఈ టైమ్‌కి బడికెళ్లాలి, ఈ టైమ్‌కి జాబ్ చేసుకోవాలి, ఈ టైమ్‌కి పెళ్లాడాలి అనే పద్ధతికి నేను పూర్తి విరుద్ధం. ఇంకా రెండేళ్ల వరకూ పెళ్లి ప్రస్తావనే రానీయను.
Advertisement
Advertisement