
అప్పుడు గాంధీగారికి 78 ఏళ్లు... నాకిప్పుడు 60 ఏళ్లే! ప్రయత్నిస్తా!
రాజకీయాలపై తన అభిప్రాయాలను కమల్‌హాసన్ సూటిగా, స్పష్టంగా చెబుతున్నారు. కొన్నాళ్లుగా ప్రస్తుత రాజకీయాలపై ఆయన స్పందిస్తున్న తీరు సంచలనమవుతోంది. ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తున్నారు. త్వరలో రాజకీయ రంగ ప్రవేశం చేయడానికేనా ఇదంతా? అని కమల్‌ను ప్రశ్నిస్తే... ‘‘నేనలా చెప్పానా? మీరు ఎందుకలా ఆలోచిస్తున్నారు?’’ అని ఎదురు ప్రశ్నిస్తున్నారు.
మరి, మీ లక్ష్యం ఏంటి? అనడిగితే... ‘‘కరప్షన్‌కి వ్యతిరేకంగా పోరాటం చేస్తా, ఉద్యమిస్తా. కేవలం తమిళ రాజకీయాల్లోని కుళ్లుని మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా ఉన్న అవినీతిని కడిగేస్తా’’ అంటున్నారు కమల్‌హాసన్. ఒంటి చేత్తో మీరు పోరాటం చేయగలరా? అంటే... ‘‘కనీసం నన్ను ప్రయత్నించనివ్వండి. నా స్ఫూర్తి ప్రదాత గాంధీగారు 78 ఏళ్ల వయసులో కరప్షన్‌కి వ్యతిరేకంగా పోరాడినప్పుడు... 60 ఏళ్ల వయసులో నేను ప్రయత్నించలేనా?’’ అని కమల్ పేర్కొన్నారు. ఓ ఆంగ్ల పత్రికతో మాట్లాడుతూ... కమల్ పై విధంగా స్పందించారు. అంతే కాదు... రజనీకాంత్‌కు వ్యతిరేకంగా తానెలాంటి వ్యాఖ్యలూ చేయలేదని స్పష్టం చేశారు.