సంక్రాంతి బరిలో ఎవడు
సంక్రాంతి బరిలో ఎవడు
Published Thu, Dec 26 2013 11:34 PM | Last Updated on Fri, Jul 6 2018 3:36 PM
కొన్ని సినిమాలు లేట్‌గా విడుదలైనా.. లేటెస్ట్ విజయాలను అందుకుంటుంటాయి. ఫ్లాష్‌బ్యాక్‌లోకెళితే... అలాంటి విజయాలు చాలా కనిపిస్తాయి. మరి వాటి చెంత ‘ఎవడు’ చేరుతుందా? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలంటే సంక్రాంతి దాకా ఆగాల్సిందే. ఏనాడో నిర్మాణం పూర్తి చేసుకున్న ‘ఎవడు’ ఎట్టకేలకు సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. సాధారణంగా ఇంత ఆలస్యమైన సినిమాలపై అంచనాలు ఎక్కువగా ఉండవు. కానీ ‘ఎవడు’పై అంచనాలు మాత్రం ఇసుమంత కూడా తగ్గలేదు.
పైగా బన్నీ ఇందులో ఓ పదిహేను నిమిషాల పాటు మెరిపిస్తాడని తెలియగానే.. అంచనాలు అంబరాన్ని తాకాయి. దేవిశ్రీప్రసాద్ అందించిన పాటలు ఇప్పటికే విశేషాదరణ పొందుతున్న విషయం తెలిసిందే. ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైన ఈ సినిమా గురించి నిర్మాత ‘దిల్’రాజు మాట్లాడుతూ- ‘‘చరణ్ కెరీర్‌లో మైలురాయిగా నిలిచిపోయే సినిమా ఇది. దర్శకుడు పైడిపల్లి వంశీ ‘ఎవడు’ రూపంలో వెండితెరపై ఓ అద్భుతాన్నే ఆవిష్కరించాడు.
ఈ సినిమా విజయంపై మా టీమ్ మొత్తం నమ్మకంగా ఉన్నాం. జనవరి 1న ఈ సినిమాకు సంబంధించిన స్పెషల్ టీజర్‌ని విడుదల చేస్తున్నాం. అలాగే.. అదే నెల 3న థియేటరికల్ ట్రైలర్‌ని కూడా విడుదల చేస్తాం. సంక్రాంతి కానుకగా అత్యధిక థియేటర్లలో సినిమాను విడుదల చేయనున్నాం’’ అని తెలిపారు. శ్రుతిహాసన్, అమీ జాక్సన్ కథానాయికలుగా నటించిన ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ ఓ ప్రత్యేక పాత్ర పోషించారు. ఈ చిత్రానికి కథ: పైడిపల్లి వంశీ, వక్కంతం వంశీ, మాటలు: అబ్బూరి రవి, సహ నిర్మాతలు: శిరీష్, లక్ష్మణ్.
Advertisement
Advertisement