
సాక్షి, న్యూఢిల్లీ : ఏదైనా పెద్ద ప్రమాదం నుంచి బయటపడినపుడు పొద్దున లేచిన ఘడియ మంచిదయింది లేకపోతే ఏం అనర్థం జరిగేదోనని అనుకోవడం చాలా మందికి అలవాటు. మయూర్ పటేల్ అనే 21 ఏళ్ల యువకుడు కూడా అలాగే అనుకోవాలేమో. అతడు తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. ఇంతకీ ఏం జరిగిందంటే.. శాస్త్రినగర్ మెట్రో స్టేషన్‌లో మయూర్ పటేల్ ఒక ప్లాట్‌ఫాం నుంచి మరో ప్లాట్‌ఫామ్‌కు వెళ్లేందుకు ఆగి ఉన్న రైలు ముందు నుంచి ట్రాక్ దాటడానికి ప్రయత్నించాడు.
సరిగ్గా అదే సమయంలో రైలు కదలడంతో ఒక్కసారిగా భయంతో వణికిపోయాడు. అయితే అతడు రావడాన్ని గమనించిన లోకో పైలట్ వెంటనే అప్రమత్తమై రైలును ఆపడంతో మయూర్ ప్రాణాలతో బయటపడ్డాడు. దీంతో మయూర్‌కి జరిమానా విధించడంతో ఎందుకిలా చేశావంటూ ప్రశ్నించారు అధికారులు.
ఒక ప్లాట్‌ఫాం నుంచి మరో ప్లాట్‌ఫాంకు ఎలా వెళ్లాలో తనకు తెలీదని, అందుకే ట్రాక్ దాటి వెళ్లేందుకు ప్రయత్నించానని తాపీగా సమాధానం చెప్పాడు. మయూర్ సమాధానం విన్న అధికారులు అవాక్కవ్వడంతో పాటు.. కాస్త అసహనానికి గురయ్యారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి.