మరో చిన్నారి ప్రాణం తీసిన బోరు బావి
పూణే: తెలంగాణలో బోరు బావి దుర్ఘటనను మరువక మునుపే అలాంటి ఘటనే మహారాష్ట్రలో చోటు చేసుకుంది. సతారా జిల్లాలో మరో బాలుడు బోరు బావిలో పడి ప్రాణాలు కోల్పోయాడు. మాన్ తహశీల్ పరిధిలోని విరాలీ గ్రామ వ్యవసాయ కుటుంబానికి చెందిన మంగేష్(5) సోమవారం మధ్యాహ్నం ప్రమాదవశాత్తు పొలంలో ఉన్న బోరుబావిలో పడిపోయాడు. విషయం తెలిసిన వెంటనే ఎన్డీఆర్‌ఎఫ్ అధికారులు రంగంలోకి దిగారు.
రక్షణ, సహాయక చర్యలు ప్రారంభించి 300 అడుగుల లోతు ఉన్న బోరు బావి నుంచి అర్థరాత్రి రెండు గంటల సమయానికి బాలుడిని వెలికి తీయగలిగారు. అయితే, బాలుడు అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. బోరుబావిలో పడిన బాలుడు 20 అడుగుల లోతులోనే ఉన్నప్పటికీ అతనిపై మట్టి, బురద పడటంతో ఊపిరాడక చనిపోయి ఉంటాడని భావిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.