సన్యాసినిపై గ్యాంగ్ రేప్ కేసులో 8 మంది అరెస్ట్
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ నదియా జిల్లాలోని ఓ కాన్వెంట్ స్కూల్లో క్రైస్తవ సన్యాసిని(71)పై జరిగిన సామూహిక అత్యాచారం కేసులో పోలీసులు ఆదివారం ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు. వారిని ప్రస్తుతం విచారిస్తున్నామని, జిల్లాలో గాలింపు జరుపుతున్నామని జిల్లా ఎస్పీ అర్నాబ్ వెల్లడించారు. అయితే అరెస్టయిన వారిలో.. కాన్వెంట్‌లోని సీసీ ఫుటేజీల్లో కనిపించిన నలుగురు దుండగులు ఉన్నారో లేదో తెలియడం లేదు.
రాణాఘాట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు చెప్పారు. గంగ్నపూర్‌లోని జీసస్ అండ్ మేరీ కాన్వెంట్ స్కూల్లోకి శనివారం తెల్లవారుజామున చొరబడిన దొంగలు సన్యాసినిపై అఘాయిత్యానికి పాల్పడి, రూ.12 లక్షలు దోచుకెళ్లడం తెలిసిందే.
కాగా, బాధితురాలికి చంపుతామని బెదిరింపులు రావడంతో ఆమె పోలీసు రక్షణ కోరారని బంగీయ క్రైస్తవ పరిసెబ అధ్యక్షుడు హెరోద్ మల్లిక్ చెప్పారు. ఈ అత్యాచారాన్ని కాంగ్రెస్ నేత పీసీ చాకో, ఆరెస్సెస్ ప్రధాన కార్యదర్శి సురేశ్ భయ్యాజీ జోషీ ఖండించారు.