1938లో డిగ్రీ.. 2016లో పీజీ.. | 97-Year-Old Man Appears For MA Exam In Bihar After Graduating in 1938 | Sakshi
Sakshi News home page

1938లో డిగ్రీ.. 2016లో పీజీ..

Published Sat, Apr 23 2016 8:54 PM | Last Updated on Tue, Oct 9 2018 5:39 PM

1938లో డిగ్రీ.. 2016లో పీజీ.. - Sakshi

1938లో డిగ్రీ.. 2016లో పీజీ..

పాట్నాః 'పట్టుదలే ఉంటే కాగలడు మరో బ్రహ్మ' అన్న చందంగా ఉంది ఆ వృద్ధుడి ప్రయత్నం. 97 ఏళ్ళ  వయసులోనూ చదువంటే సై అంటున్నాడు. ఎప్పుడో ఏడున్నరు దశాబ్దాల క్రితం గ్యాడ్యుయేషన్ పూర్తి చేసిన ఆయన.. ఇప్పుడు మళ్ళీ ఎకనామిక్స్ లో ఎం.ఏ పరీక్షలు రాసేందుకు సిద్ధమయ్యాడు. కుటుంబ బాధ్యతలతో డిగ్రీతోనే ఆపేయాల్సి వచ్చిన చదువును తిరిగి కొనసాగిస్తున్నాడు.

బీహార్ కు చెందిన రాజ్ కుమార్ వైశ్యా ఎకనామిక్స్ లో మాస్టర్స్ డిగ్రీ కోసం  గతేడాది ఎన్ రోల్ చేసుకున్నాడు. 97 ఏళ్ళ వయసులోనూ మూడు గంటలపాటు ఎగ్జామ్ సెంటర్లో కూర్చొని మరీ ఆంగ్లంలో సమాధానాలను రాశాడు. 1938 లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన రాజ్ కుమార్.. అప్పట్లో కుటుంబ బాధ్యతలతో  పై చదువులు చదువలేక పోయాడు. అందుకే ఇప్పడు తన కోర్కెను తీర్చుకునేందుకు సన్నద్ధమయ్యాడు. నలందా ఓపెన్ యూనివర్శిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పట్టా పొందేందుకు 97 ఏళ్ళ వయసులో పరీక్షలు రాశాడు. ఎం.ఏ ఎకనామిక్స్ లో మొదటిభాగం పరీక్ష రాసేందుకు ఆయన సుమారు 23 పేపర్ షీట్లను వినియోగించినట్లు వర్శిటీ అధికారులు తెలిపారు. మిగిలిన విద్యార్థులకు ఏమాత్రం తీసిపోకుండా మూడు గంటలపాటు పరీక్షా కేంద్రంలో కూర్చొని మరీ పరీక్షలు రాయడం అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తించింది. ఆయనతోపాటు పరీక్షలు రాసిన వారంతా ఆయన మనవలకంటే కూడ చిన్నవారేనట. మాడ్చేస్తున్న ఎండలకు  భయపడి జనం ఇళ్ళనుంచి బయటకు రాలేని సమయంలో ఆ వృద్ధుడు మిగిలిన యువ విద్యార్థులతో కలసి ఉత్సాహంగా పరీక్షలు రాశాడని వర్శిటీ అధికారులు చెప్తున్నారు. అయితే వైశ్యా ఈ వయసులో ఎకనామిక్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేయాలన్న పట్టుదలకు వెనుక రెండు కారణాలున్నాయట. ఒకటి తాను ఎం.ఏ పూర్తి చేయాలన్న కోరిక, రెండోది భారత్ ఎందుకు ఆర్థిక ప్రకగతిని సాధించి, సమస్యలను అధిగమించలేకపోతోందో తెలుసుకోవాలన్న ఆరాటమూనట. అందుకే ఇప్పుడు పరీక్ష రాసిన రాజ్ కుమార్...తన కల నెరవేరిందంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నాడు.

1920 లో ఉత్తర ప్రదేశ్ బరెల్లీ పట్టణంలో పుట్టిన రాజ్ కుమార్ వైశ్యా... జార్ఘండ్ లో ఉన్న ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తూ 1980 లో పదవీవిరమణ పొందారు. ఆగ్రా యూనివర్శిటీలో 1938 లో డిగ్రీ పూర్తి చేసి, 1940 లో లా పట్టాను కూడ పొందారు. అయితే కుటుంబ బాధ్యతలతో తాను మాస్టర్స్ డిగ్రీని పొందలేకపోయానన్న కోరిక అలాగే ఉండిపోయిందని, ఇప్పుడా కోరిక తీరిందని వైశ్యా చెప్తున్నారు. పదేళ్ళ క్రితం భార్య చనిపోయిన అనంతరం వైశ్యా.. పాట్నా రాజేంద్రనగర్ కాలనీలోని చిన్న కుమారుడు సంతోష్ కుమార్ వద్ద ఉంటున్నాడు. సంతోష్ కుమార్ పాట్నాలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో పనిచేసి రిటైరయ్యారు. ఆయన భార్య భారతి కూడ పాట్నా యూనివర్శిటీలో ప్రొఫెసర్ గా పనిచేసి రిటైరయ్యారు. 97 ఏళ్ళ వయసులోనూ ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉన్న వైశ్యా... భారత శాఖాహార భోజనాన్నే ఇష్టపడతాడట. ఎప్పుడూ వేపుళ్ళను తిననని, మితంగానే భుజిస్తానని కూడ చెప్తున్నాడు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement